Sunday, August 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౩ (303)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-598-చ.
"నరవర! యొక్కనాఁడు విను నారదసంయమి మాధవుండు దా
నరకునిఁ ద్రుంచి వాని భవనంబున నున్న పదాఱువేల సుం
దరులను నొక్కమాటు ప్రమదంబున నందఱ కన్నిరూపులై
పరిణయ మయ్యె నా విని శుభస్థితిఁ దద్విభవంబుఁ జూడఁగన్.
10.2-599-వ.
ఇట్లు దలంచి కృష్ణపాలితంబయిన ద్వారకానగరంబు డాయంజని ముందట.
10.2-600-సీ.
శుక శారికా శిఖి పిక కూజిత ప్రస-
  వాంచితోద్యానవనౌఘములనుఁ
గలహంస సారస కైరవ కమల క-
  హ్లార శోభిత కమలాకరములఁ
గలమాది సస్య సంకుల వరేక్షుక్షేత్ర-
  భూరి లసన్నదీ తీరములను
గిరిసాను పతిత నిర్ఝరకణ సందోహ-
  సంతత హేమంతసమయములనుఁ
10.2-600.1-తే.
గమలసంభవ కాంచనకార రచిత
చిరతరైశ్వర్య నగరలక్ష్మీకరాబ్జ
ఘటిత నవరత్నమయ హేమకటక మనఁగ
సొబగుమీఱిన కోటయుఁ జూచె మౌని.

భావము:
“ఓ రాజశేఖరా! విను. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపి, అతని మందిరంలో ఉన్న పదహారువేల మంది అందగత్తెలనూ వరించి, ఒకేమారు అందరికీ అన్ని రూపాలతో కనపడుతూ వివాహం చేసుకున్నాడు అనే వార్త నారదుడు విన్నాడు. ఒకనాడు ఆ కృష్ణవైభవం దర్శించాలనే కాంక్షతో ద్వారకకు వచ్చాడు. అప్పుడు అలా కృష్ణవైభవ దర్శనం కోసం నారదుడు ద్వారకలో ప్రవేశించి నప్పుడు. చిలుకలూ, గోరువంకలూ, నెమళ్ళూ, కోయిలలూ ఆనందంతో కలకలారావాలు చేస్తూ ఉన్న ఉద్యానవనాలను కనుగొన్నాడు. హంసలతోనూ, బెగ్గురపక్షులతోనూ, పద్మాలతోనూ, కలువలతోనూ శోభిస్తున్న సరస్సులను సందర్శించాడు. వరిపంటలతో కలకలలాడే క్షేత్రాలతోనూ చెరకుతోటలతోనూ కనువిందుచేసే నదీతీరాలను సందర్శించాడు. కొండచరియల నుంచి ఎడతెగకుండా జల్లులుగా పడుతున్న సెలయేటి నీటితుంపరల వలన సదా హేమంత ఋతువుగా అలరారుతున్న ప్రదేశాలనూ తిలకించాడు. భోగభాగ్యాలతో తులతూగే నగరలక్ష్మి తన చేతికి ధరించినదీ, బ్రహ్మతో సమానులైన స్వర్ణకారులు తయారుచేసినదీ అయిన నవరత్న ఖచిత బంగారు కంకణంలాగా ప్రకాశిస్తున్న కోటను చూసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=600

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, August 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౨ (302)

( కాశీరాజు వధ )

10.2-535-వ.
అదియును, బ్రళయవేళాసంభూత జీమూతసంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నినదాధరీకృత మహాదుస్సహ కహకహ నిబిడనిస్వననిర్ఘోషపరిపూరిత బ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహ కీలాసముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగచ్ఛటాభీలంబును, సకలదేవతాగణ జయజయశబ్ద కలితంబును, ననంతతేజో విరాజితంబును నగుచుం గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంటనంటిన నది తన తొంటిరౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పౌరలోకంబు భయాకులతంబొంది వాపోవ, రోషభీషణాకారంబుతో నప్పుడు ఋత్విఙ్నికాయయుతంబుగ సుదక్షిణుని దహించె; నత్తఱిఁ జక్రంబును దన్నగరంబు సౌధ ప్రాకార గోపురాట్టాల కాది వివిధ వస్తు వాహన నికరంబుతో భస్మంబు గావించి మరలి యమరులు వెఱఁగందఁ గమలలోచన పార్శ్వవర్తి యై నిజ ప్రభాపుంజంబు వెలుఁగొందఁ గొల్చియుండె" నని చెప్పి; మఱియు నిట్లనియె.
10.2-536-క.
"మురరిపు విజయాంకితమగు
చరితము సద్భక్తిఁ దగిలి చదివిన వినినన్
దురితములఁ బాసి జను లిహ
పరసౌఖ్యము లతనిచేతఁ బడయుదు రధిపా!"
10.2-537-వ.
అనిన శుకయోగికి రాజయోగి యిట్లనియె.

భావము:
ఆ చక్రాయుధం ప్రళయకాలంనాటి మేఘాల నుండి పుట్టిన ఘుమ ఘుమ అంటూ భయంకరంగా ధ్వనించే గర్జనల వంటి ధ్వనితో, ఆకాశాన్ని అంటుతున్న అగ్నిజ్వాలలతో, అమిత తేజస్సుతో వెలుగొందుతూ, సకల దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా, కృత్యను సమీపించింది. తనను చూసి తడబడకుండా కంటగిస్తున్న కృత్యను గెంటివేసి, వెంటబడింది. అప్పుడు, కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశీపురం వచ్చింది. మరలి వచ్చిన కృత్యను చూసి పౌరులంతా భయపడి శోకిస్తుండగా, ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో ఋత్విజులతోపాటు సుదక్షిణుని దహించి వేసింది. అప్పుడు, శ్రీకృష్ణుడి చక్రాయుధం సౌధ, గోపుర, ప్రాకారాలతోపాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేలా శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి చేరి, తన నిజప్రభావంతో ప్రకాశిస్తూ ఉంది.” అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పి కృష్ణగాథను ఇంకా ఇలా కొనసాగించాడు. “ఓ పరీక్షన్మహారాజా! శ్రీకృష్ణుడి ఈ విజయగాథలను భక్తితో చదివినవారు, వినినవారు పాపరహితులై, ఆ దేవుని దయచేత ఇహపర సౌఖ్యాలను పొందుతారు.” శుకయోగి ఇలా చెప్పగా రాజయోగి ఐన పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=536

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, August 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౧ (301)

( కాశీరాజు వధ )

10.2-534-సీ.
భీమమై బహుతీవ్రధామమై హతరిపు-
  స్తోమమై సుమహితోద్దామ మగుచుఁ
జండమై విజితమార్తాండమై పాలితా-
  జాండమై విజయప్రకాండ మగుచు
దివ్యమై నిఖిలగంతవ్యమై సుజన సం-
  భావ్యమై సద్భక్త సేవ్య మగుచు
నిత్యమై నిగమసంస్తుత్యమై వినమితా-
  దిత్యమై నిర్జితదైత్య మగుచు
10.2-534.1-తే.
విలయసమయ సముద్భూత విపులభాస్వ
దళికలోచన లోచనానల సహస్ర
ఘటిత పటుసటాజ్వాలికా చటుల సత్త్వ
భయదచక్రంబు కృత్యపైఁ బంపె శౌరి.

భావము:
బహు భయంకరమైనదీ, శత్రువులను హతం గావించేదీ, సూర్యకాంతిని ధిక్కరించే తీక్షణ మైన కాంతి కలదీ, సుజనులచే స్తుతింపబడేదీ, భక్తులచే సేవించబడేదీ, దేవతలచే నమస్కరింపబడేదీ, దానవులను సంహరించేదీ, ప్రళయకాలంలోన పరమేశ్వరుని ఫాలనేత్రం నుంచి వెలువడే జ్వలనజ్వాలా మాలికవలె భయంకరమైనదీ, అన్ని వైపులా పయనించ గలదీ అయిన ఆ చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు కృత్యపై ప్రయోగించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=534

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :


Wednesday, August 4, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౦ (300)

( కాశీరాజు వధ )

10.2-532-తే.
అనిన నా చంద్రమౌళి వాక్యముల భంగి
భూరినియమముతో నభిచారహోమ
మొనరఁ గావింప నగ్ని యథోచితముగఁ
జెలఁగు దక్షిణవలమాన శిఖల వెలిఁగె.
10.2-533-వ.
అందుఁ దామ్రశ్మశ్రుకేశకలాపంబును, నశనిసంకాశంబులైన నిడుద కోఱలును, నిప్పులుప్పతిల్లు చూడ్కులును, ముడివడిన బొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతి రౌద్రాకారంబునఁ బ్రజ్వరిల్లుచుఁ గుండంబు వెలువడి యనుదిన నిహన్య మాన ప్రాణిరక్తారుణ మృత్యుకరవాలంబు లీలం జూపట్టు నాలుకను సెలవుల నాకికొనుచు నగ్నికీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువనకోలాహలంబుగా నార్చుచు, నుత్తాల తాలప్రమాణ పాదద్వయ హతులం దూలు పెంధూళి నింగిమ్రింగ, భూతంబులు సేవింప, నగ్నవేషయై, నిజవిలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికాజాలంబున దిశాజాలంబు నోలిం బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరు నగరంబున కరుగుదేరఁ, బౌరజనంబులు భయాకులమానసులై దావదహనునిం గని పఱచు వన మృగంబులచాడ్పునం బఱచి, సుధర్మాభ్యంతరంబున జూదమాడు దామోదరునిం గని “రక్షరక్షేతి”రవంబుల నార్తులయి “కృష్ణ! కృష్ణ! పెనుమంటలం బురంబు గాల్పం బ్రళయాగ్ని సనుదెంచె” నన వారిం జూచి “యోడకోడకుఁ” డని భయంబు నివారించి, సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు గావునం దద్వృత్తాంతం బంతయుఁ దన దివ్యచిత్తంబున నెఱింగి కాశీరాజపుత్త్ర ప్రేరితయైన యమ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్శ్వవర్తి యయియున్న యద్దివ్యసాధనంబు గనుంగొని యప్పుడు.

భావము:
అలా చెప్పిన పరమేశ్వరుని వాక్యానుసారం సుదక్షిణుడు గొప్పనియమాలతో అభిచార హోమం చేసాడు. అగ్నిదేవుడు కుడి వైపుగా తిరుగుతూ జ్వలించే జ్వాలలతో వెలిగాడు. ఆ అభిచారహోమ గుండంలోని అగ్నిజ్వాలల నుండి ఎఱ్ఱని జుట్టూ; పిడుగుల వంటి కోరలూ; నిప్పులు గ్రక్కే చూపులూ; ముడిపడిన కనుబొమలూ; జేవురించిన ముఖము; కలిగిన “కృత్య” అతిభయంకర ఆకారంతో వెలువడింది. ఆ కృత్య మృత్యుదేవత కరవాలంలా కనిపిస్తున్న నాలుకతో పెదవి మూలలు తడవుకుంటూ, అగ్నిజ్వాలవంటి శూలాన్ని చేతబట్టి, లోకం దద్దరిల్లేలా బొబ్బలు పెడుతూ, నింగినిండా దుమ్ము వ్యాపించేలా తాటిచెట్ల వంటి పాదాలతో అడుగులు వేస్తూ, భూతాలు సేవిస్తుండగా, కళ్ళ నుంచి రాలే నిప్పులతో దిక్కులను కాల్చివేస్తూ, అతివేగంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి దిగంబరంగా వచ్చింది. ద్వారకానగరవాసులు అంతా కృత్యను చూచి దావానలాన్ని చూసి పారిపోయే అడవిజంతువుల లాగా పారిపోయి “కాపాడు కాపాడు” అని అరుస్తూ, సుధర్మా సభామండపంలో జూదమాడుతున్న దామోదరుడు, శ్రీకృష్ణుడిని చేరారు. “మన పట్టణాన్ని దహించడానికి ప్రళయకాలాగ్ని వచ్చింది. మమ్మల్ని రక్షించు” అని ప్రార్థించారు. వారికి “భయపడకండి” అని చెప్పి, పుండరీకముల వంటి కన్నులున్న వాడు, విశ్వము అంతటిలోనూ ఆత్మరూపంలో వ్యాపించి ఉండేవాడు, సర్వరక్షకుడు, అయిన శ్రీకృష్ణుడు జరిగిన సంగతంతా దివ్యదృష్టితో తెలిసికొని, కాశీ రాకుమారుడు పంపించిన కృత్యను సంహరించాలని భావించి తన చక్రాయుధాన్ని పరికించి......

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=533

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, August 3, 2021

శ్రీకృష్ణ విజయము - 299

( కాశీరాజు వధ )

10.2-529-క.
"మెచ్చితి నే వర మైనను
నిచ్చెద నను వేఁడు" మనిన "నీశ్వర! నన్నున్
మచ్చిక రక్షింతువు పొర
పొచ్చెము సేయక మహేశ! పురహర! యభవా!
10.2-530-క.
దేవా! మజ్జనకుని వసు
దేవాత్మజుఁ డాజిలో వధించెను, నే నా
గోవిందుని ననిలోపల
నే విధమున గెలుతు నానతీవె పురారీ! "
10.2-531-తే.
అనిన శంకరుఁ డతనికి ననియె "ననఘ!
నీవు ఋత్విజులును భూసురావళియునుఁ
బ్రీతి నభిచార మొనరింప భూతయుక్తుఁ
డగుచు ననలుండు దీర్చు నీ యభిమతంబు. "

భావము:
“నీ భక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో ఇస్తాను” అని అనుగ్రహించాడు. అప్పుడు, సుదక్షిణుడు “పరమేశ్వరా! త్రిపురాసుర సంహారా! అభవా! నన్ను ప్రీతితో ఏ పొరపొచ్చమూ లేకుండా తప్పక రక్షిస్తావు. ఓ దేవా! వాసుదేవుడి కొడుకు శ్రీకృష్ణుడు నా తండ్రిని యుద్ధంలో సంహరించాడు. నేను యుద్ధంలో ఆ శ్రీకృష్ణుడిని ఏ ఉపాయంతో అయితే గెలువగలనో దానిని చెప్పు.” అని ప్రార్థించాడు. అప్పుడు పరమశివుడు అతడితో ఇలా అన్నాడు “అనఘా! నీవూ ఋత్విజులూ బ్రాహ్మణశ్రేష్ఠులూ ప్రీతితో అభిచారహోమం చేస్తే, భూతములతో కూడి, అగ్నిదేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=531

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, August 2, 2021

శ్రీకృష్ణ విజయము - 298

( కాశీరాజు వధ )

10.2-527-సీ.
అక్కడఁ గాశిలో నా రాజు మందిరాం-
  గణమునఁ గుండల కలిత మగుచుఁ
బడి యున్న తలఁ జూచి పౌరజనంబులు-
  దమ రాజు తలయ కాఁ దగ నెఱింగి
చెప్పిన నా నృపు జీవితేశ్వరులును-
  సుతులు బంధువులును హితులు గూడి
మొనసి హాహాకారమున నేడ్చి; రత్తఱిఁ-
  దత్తనూభవుఁడు సుదక్షిణుండు
10.2-527.1-తే.
వెలయఁ దండ్రికిఁ బరలోకవిధు లొనర్చి
జనకు ననిలో వధించిన చక్రపాణి
నడరి మర్దింపఁ దగు నుపాయంబు దలఁచి
చతురుఁ డగు నట్టి తన పురోహితునిఁ బిలిచి.
10.2-528-క.
అతడుం దానునుఁ జని పశు
పతిపద సరసిజములకునుఁ బ్రమదముతో నా
నతుఁడై యద్దేవుని బహు
గతులం బూజింప నతఁడుఁ గరుణాన్వితుఁడై.

భావము:
ఇక అక్కడ కాశీపట్టణంలో ఆ రాజమందిరంలో, కుండల సహితమైన శిరస్సు పడగానే పురజనులు అందరూ అది తమ రాజు శిరస్సుగా గుర్తించారు. ఆ రాజు భార్యలు, పుత్రులు, మిత్రులు, బంధువులు హాహాకారాలు చేస్తూ దుఃఖించారు. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు తండ్రికి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. తన తండ్రిని యుద్ధంలో సంహరించిన శ్రీకృష్ణుడిని సంహరించడానికి ఉపాయం ఆలోచించాడు. చతురుడైన పురోహితుడిని పిలిపించి. పురోహితుడూ తానూ వెళ్ళి పరమేశ్వరుని పాదాలకు మ్రొక్కి, బహువిధాలుగా పూజలు చేసారు. పరమశివుడు కరుణామయుడు అయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=527

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 297

( కాశీరాజు వధ )

10.2-524-చ.
మడవక కాశికావిభుని మస్తక ముద్ధతిఁ ద్రుంచి బంతి కై
వడి నది పింజ పింజ గఱవన్ విశిఖాళి నిగుడ్చి వాని యే
లెడి పురిలోన వైచె నవలీల మురాంతకుఁ డిట్లు వైరులం
గడఁగి జయించి చిత్తమునఁ గౌతుకముం జిగురొత్త నత్తఱిన్.
10.2-525-క.
సుర గంధర్వ నభశ్చర
గరుడోరగ సిద్ధ సాధ్యగణము నుతింపన్
మరలి చనుదెంచి హరి నిజ
పురమున సుఖముండె నతి విభూతి దలిర్పన్.
10.2-526-క.
వనజోదరు చిహ్నంబులు
గొనకొని ధరియించి పౌండ్రకుఁడు మచ్చరియై
యనవరతము హరి దన తలఁ
పునఁ దగులుటఁ జేసి ముక్తిఁ బొందె నరేంద్రా!

భావము:
అటుపిమ్మట, కాశీరాజు శిరస్సును కూడా శ్రీకృష్ణుడు ఖండించి, ఆ శిరస్సును బంతిలాగ వరుస బాణాలతో పైపైకి ఎగురకొట్టి అతని పట్టణంలో పడేలా కొట్టాడు. ఈ విధంగా మురాంతకుడు శత్రువులను జయించి మనస్సులో ఎంతో ఉత్సాహం ఉప్పొంగగా ఆనందించాడు. అప్పుడు దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్య, గరుడ, ఉరగ గణాలు వారందరూ స్తుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మిక్కిలి వైభవంతో తన నగరానికి తిరిగి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు. రాజా పరీక్షిత్తూ! పద్మనాభుడి చిహ్నాలు అన్నింటినీ పట్టుదలతో ధరించి అసూయాపరుడై నిరంతరం తన మనస్సులో శ్రీకృష్ణుడినే ధ్యానించడం వలన పౌండ్రకుడు మోక్షాన్ని పొందాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=526

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :