Sunday, January 17, 2021

శ్రీ కృష్ణ విజయము - 118

(నందోద్ధవ సంవాదము)

10.1-1450-సీ.
అట్టి నారాయణుం డఖిలాత్మభూతుండు-
  కారణమానవాకారుఁడైనఁ
జిత్తంబు లతనిపైఁ జేర్చి సేవించితి-
  రతికృతార్థులరైతి; రనవరతము
శోభిల్లు నింధనజ్యోతి చందంబున-
  నఖిల భూతములందు నతఁ; డతనికి
జననీ జనక దార సఖి పుత్ర బాంధవ-
  శత్రు ప్రియాప్రియ జనులు లేరు
10.1-1450.1-ఆ.
జన్మకర్మములును జన్మంబులును లేవు
శిష్టరక్షణంబు సేయుకొఱకు
గుణవిరహితుఁ డయ్యు గుణి యగు సర్వ ర
క్షణ వినాశకేళి సలుపుచుండు."

భావము:
సర్వ జీవుల యందు ఆత్మగా ఉన్నవాడు, కారణ వశంచే మానవ విగ్రహం గైకొన్న వాడు అయిన అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనసులు లగ్నం చేసి కొలిచారు; మీరు పరమ ధన్యులు అయ్యారు; ఆయన కట్టెలలో నిప్పు చొప్పున ఎల్లప్పుడూ సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు; ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, విరోధి, ఇష్టుడు, అనిష్ఠుడు అంటూ ఎవ్వరూ లేరు; జనన మరణాలు లేవు.; సజ్జనులను సంరక్షించుట కొరకు త్రిగుణరహితుడు అయినప్పటికీ, గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలలు సాగిస్తూ ఉంటాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=174&padyam=1450

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, January 9, 2021

శ్రీ కృష్ణ విజయము - 117

(నందోద్ధవ సంవాదము)

10.1-1447-వ.
ఇట్లు గోవింద సందర్శనాభావ విహ్వలురైన యశోదానందులకు నుద్దవుం డిట్లనియె.
10.1-1448-క.
"జననీజనకుల మిమ్ముం
గనుఁగొన శీఘ్రంబె వచ్చుఁ గని భద్రంబుల్
వనజాక్షం డొనరించును
మనమున వగవకుఁడు ధైర్యమండనులారా?
10.1-1449-మ.
బలుడుం గృష్ణుఁడు మర్త్యులే? వసుమతీ భారంబు వారింప వా
రల రూపంబులఁ బుట్టినాఁడు హరి నిర్వాణప్రదుం; డిప్పు డు
జ్జ్వలుఁడై ప్రాణవియోగకాలమునఁ దత్సర్వేశుఁ జింతించువాఁ
డలఘుశ్రేయముఁ బొందు బ్రహ్మమయుఁడై యర్కాభుఁడై నిత్యుఁడై

భావము:
కృష్ణుడు కనబడకుండా ఉండడంతో బెంగపట్టుకున్న ఆ యశోదానందులతో ఉద్ధవుడు ఇలా అన్నాడు. “మీరు ధైర్యంగా ఉండండి. కృష్ణుడు త్వరలోనే వస్తాడు. తలితండ్రులైన మిమ్మల్ని చూస్తాడు. మీకు శుభములు చేకూరుస్తాడు. చింతించకండి. ఈ రామకృష్ణులు సామాన్య మానవులు కారు. మోక్షము ఇచ్చే ఆ శ్రీమహావిష్ణువే భూభారాన్ని దించడం కోసం రామకృష్ణుల రూపాలలో అవతరించాడు. జ్ఞాని యై ప్రాణంపోయే టప్పుడు సర్వమునకు ప్రభువైన ఆ హరిని స్మరించిన వాడు బ్రహ్మస్వరూపుడై, సూర్యుడి వలె తేజోవిరాజితుడై, నిత్యత్వం పొంది ముక్తిరూపమైన శ్రేయస్సు చూరగొంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=174&padyam=1449

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 116

(నందోద్ధవ సంవాదము)

10.1-1444-క.
అంకిలి గలుగక మా కక
లంకేందుని పగిదిఁ గాంతిలలితంబగు న
ప్పంకజనయనుని నెమ్మొగ
మింక విలోకింపఁ గలదె యీ జన్మమునన్?"
10.1-1445-క.
అని హరి మున్నొనరించిన
పను లెల్లనుఁ జెప్పి చెప్పి బాష్పాకుల లో
చనుఁడై డగ్గుత్తికతో
వినయంబున నుండె గోపవీరుం డంతన్.
10.1-1446-క.
పెనిమిటి బిడ్డని గుణములు
వినిపింప యశోద ప్రేమవిహ్వలమతియై
చనుమొనలఁ బాలు గురియఁగఁ
గనుఁగొనలను జలము లొలుకఁగా బెగ్గిలియెన్.

భావము:
మచ్చలేని చంద్రుడిలా అందాలు చిందే కాంతులు వెదజల్లే ఆ కమలాక్షుని నిండుమోము కమ్మగా చూసే అదృష్టం మళ్ళీ మాకు ఈ జన్మలో లభిస్తుందా?” అని గోపాలశ్రేష్ఠుడు నందుడు పలికాడు. శ్రీకృష్ణుడు మునుపు చేసిన కృత్యములు అన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి బొంగురుపోయిన కంఠంతో మాటాడలేక కన్నీటితో కలకబారిన కన్నులు కలవాడై మిన్నకున్నాడు. అలా భర్త కృష్ణుడి గుణాలు వర్ణిస్తుంటే; నందుడి భార్య యశోద మనసు ప్రేమతో పరవశమై చలించి పోగా చనుమొనల నుండి పాలు జాలువారాయి; కనుకొనల నుండి కన్నీరు ధారలు కారాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=174&padyam=1446

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, January 8, 2021

శ్రీ కృష్ణ విజయము - 115

(నందోద్ధవ సంవాదము)

10.1-1441-శా.
ఆ పుణ్యాత్మునిఁ గౌఁగిలించుకొని నందాభీరుఁ డానంది యై
మా "పాలింటికిఁ గృష్ణు డీతఁ" డనుచున్ మన్నించి పూజించి వాం
ఛాపూర్ణంబుగ మంజులాన్నమిడి మార్గాయాసముం బాపి స
ల్లాపోత్సాహముతోడ నిట్లనియె సంలక్షించి మోదంబునన్.
10.1-1442-క.
"నా మిత్రుఁడు వసుదేవుఁడు
సేమంబుగ నున్నవాఁడె? చెలువుగఁ బుత్రుల్
నేమంబున సేవింప మ
హామత్తుండైన కంసుఁ డడగిన పిదపన్.
10.1-1443-శా.
అన్నా! భద్రమె? తల్లిదండ్రుల మమున్ హర్షించి చింతించునే?
తన్నుం బాసిన గోపగోపికల మిత్రవ్రాతమున్ గోగణం
బు న్నిత్యంబు దలంచునే? వన నదీ భూముల్ ప్రసంగించునే?
వెన్నుం డెన్నఁడు వచ్చు నయ్య! యిట మా వ్రేపల్లెకు న్నుద్ధవా?

భావము:
నందుడు ఆ పుణ్యాత్ముడిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. “ఇతడు మా పాలిటి గోపాలకృష్ణుడు” అంటూ సాదరంగా మన్ననలు చేసాడు. కడుపునిండా కమ్మని భోజనం పెట్టించాడు. ప్రయాణం బడలిక పోగొట్టాడు. ముచ్చటలాడే కోరికతో ఉద్దవుడితో ఎంతో సంతోషంగా ఇలా అన్నాడు. “నా చెలికాడు వసుదేవుడు క్షేమమే కదా! గర్వాంధు డైన కంసుడు కనుమూసాక తన కుమారులు చక్కగా సేవలు చేస్తుంటే సుఖంగా ఉన్నారు కదా. అన్నా! ఉద్ధవా! మమ్మల్ని తల్లితండ్రులను కృష్ణుడు సంతోషంతో తలచుకొంటూ ఉంటాడా? తనకి దూరంగా ఉంటున్న గోపగోపికలనూ, చెలికాండ్రనూ, ఆలమందలనూ ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటాడా? ఇక్కడి వనాలనూ నదులను గూర్చి ముచ్చటిస్తూ ఉంటాడా? వెన్నుడు ఇటు మా వ్రేపల్లెకు ఎప్పుడు వస్తాడయ్యా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=174&padyam=1443

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 114

( గోపస్త్రీలకడకుద్ధవుని బంపుట )

10.1-1439-క.
సందేహము మానుం డర
విందాననలార! మిమ్ము విడువను వత్తున్
బృందావనమున కని హరి
సందేశము పంపె" ననుము సంకేతములన్."
10.1-1440-వ.
అని మందహాస సుందర వదనారవిందుండై కరంబు కరంబున నవలంబించి, సరసవచనంబు లాడుచు వీడుకొల్పిన నుద్ధవుండును రథారూఢుండై సూర్యాస్తమయ సమయంబునకు నందవ్రజంబు జేరి వనంబులనుండి వచ్చు గోవుల చరణరేణువులం బ్రచ్ఛన్న రథుండై చొచ్చి, నందు మందిరంబు ప్రవేశించిన.

భావము:
సంకేతస్థలమునకు వెళ్ళి గోపికలతో “పద్మముల వంటి మోములు కల పడతులారా! సంశయం మానండి. మిమ్మల్ని వదలిపెట్టను. బృందావనానికి వస్తాను” అని కృష్ణుడు వార్త పంపాడని నీవు చెప్పు.” అని చిరునవ్వుతో అందమైన అరవిందం వంటి వదనము గల గోవిందుడు ఉద్ధవుడి చేతిలో చెయ్యేసి పట్టుకుని, సరసమైన మాటలు పలుకుతూ సాగనంపాడు. ఉద్ధవుడు రథము ఎక్కి సూర్యుడు అస్తమించే వేళకు గోకులం చేరాడు. అడవులలో మేతమేసి వచ్చే గోవుల పాద ధూళి అతని రథాన్ని కప్పివేస్తుండగా, ఉద్ధవుడు వ్రేపల్లె చేరి నందుడి ఇంటికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=173&padyam=1440

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, January 2, 2021

శ్రీ కృష్ణ విజయము - 113

( గోపస్త్రీలకడకుద్ధవుని బంపుట )

10.1-1436-క.
సిద్ధవిచారు గభీరున్
వృద్ధవచోవర్ణనీయు వృష్ణిప్రవరున్
బుద్ధినిధి నమరగురుసము
నుద్ధవునిం జూచి కృష్ణుఁ డొయ్యనఁ బలికెన్.
10.1-1437-శా.
"రమ్మా యుద్ధవ! గోపకామినులు నా రాకల్ నిరీక్షంచుచున్
సమ్మోహంబున నన్నియున్ మఱచి యే చందంబునం గుందిరో
తమ్మున్ నమ్మినవారి డిగ్గవిడువన్ ధర్మంబు గాదండ్రు; వే
పొమ్మా; ప్రాణము లే క్రియన్ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్.
10.1-1438-క.
"లౌకిక మొల్లక న న్నా
లోకించు ప్రపన్నులకును లోఁబడి కరుణా
లోకనములఁ బోషింతును
నా కాశ్రితరక్షణములు నైసర్గికముల్.

భావము:
ఫలవంత మైన భావాలు కలవాడు, గంభీరుడు, పెద్దలు మెచ్చదగిన వాడు, వృష్ణివంశోత్తముడు, గొప్ప తెలివి కలవాడు, దేవతల గురువైన బృహస్పతితో సమానుడు అయిన ఉద్ధవుడిని పిలచి, మెల్లగా ఇలా చెప్పాడు. “ఉద్ధవా! ఇలా రా! గోపికలు ప్రణయమూర్తులు. నా ఆగమనానికి ఎదురుచూస్తూ, నా మీది వ్యామోహంతో అన్నీ మరచిపోయి ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు. నమ్ముకున్న తమను విడవడం ధర్మం కాదని పెద్దలుఅంటూ ఉంటారు. వేగంగా వెళ్ళు. పెచ్చుమీరుతున్న వియోగమనే అగ్నిజ్వాలలతో వారెలా ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఉన్నారో? లోకధర్మాలు అన్నీ విడచిపెట్టి నా మీదనే చూపు నిలిపి, భక్తి ప్రపత్తులు సలిపేవారికి నేను లోబడి, వారిని దయతో చూస్తూ కాపాడుతాను. ఆశ్రితులను ఆదుకోవడం నాకు స్వభావసిద్ధమైన గుణం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=172&padyam=1438

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 112

( గురుపుత్రుని తెచ్చి ఇచ్చుట )

10.1-1432-క.
కాలుని వీటికిఁ జని మృత
బాలకుఁ దే నొరుల వశమె? భవదీయ కృపన్
మేలు దొరఁకొనియె మాకు; వి
శాల మగుంగాత మీ యశము లోకములన్.
10.1-1433-వ.
మహాత్ములార! యేను కృతార్థుండ నైతి" నని దీవించిన సాందీపుని వీడ్కొని కృతకృత్యులై రామకృష్ణులు రథారోహణంబు చేసి మథురకుఁ జనుదెంచి పాంచజన్యంబుఁ బూరించిన విని నష్టధనంబులు గనినవారి భంగిం బ్రజలు ప్రమోదించి; రంత నొక్కనాఁ డేకాంతంబున.
10.1-1434-శా.
"నా పైఁ జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నా రాకఁ గాంక్షించుచున్
నా పే రాత్మల నావహించుచు వగన్ నానాప్రకారంబులన్
గోపాలాంగన లెంత జాలిఁబడిరో? కోపించిరో? దూఱిరో?
వ్రేపల్లెన్ నిజధర్మ గేహములలో విభ్రాంతచైతన్యలై."
10.1-1435-వ.
అని చింతించి.

భావము:
యమపురికి వెళ్ళి చనిపోయిన పిల్లవాడిని తెచ్చి ఇవ్వడము అన్నది మీకు చెల్లింది కాని, ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్ధాభక్తులతో మాకు మేలు కలిగించారు. మీ కీర్తి లోకాలలో విస్తరిల్లు కాక! ఓ పుణ్యాత్ములారా! నేను ధన్యుడను అయ్యాను.” అని సాందీపని వారిని దీవించాడు. రామకృష్ణులు కృతార్ధులై గురువు దగ్గర సెలవు పుచ్చుకుని రథం ఎక్కి మధుర వెళ్ళి శంఖాన్నిఊదారు. అప్పుడు ప్రజలు పోయిన సొమ్ము తిరిగి లభించిన వారిలా సంతోషించారు. శ్రీకృష్ణుడు ఒకరోజు ఏకాంతంలో ఇలా ఆలోచించసాగాడు “వ్రేపల్లెలోని గొల్లముదితలు సదా నా మీదనే మనసు లగ్నం చేసుకుని ఉంటారు. నా ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నా పేరు మనసులో నిరంతరం ధ్యానిస్తూ, ప్రణయపారవశ్యంతో తమ పుణ్య గృహాలలో అనేక విధాలుగా వగలు చెందుతుంటారు. పాపం వారెంత దైన్యం పాలవుతున్నారో? నాపై ఎంత కినుక వహించారో? నన్నెంతగా దూషించుతున్నారో?”. ఇలా తలపోసిన కృష్ణుడు . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=172&padyam=1434

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :