Friday, January 8, 2021

శ్రీ కృష్ణ విజయము - 115

(నందోద్ధవ సంవాదము)

10.1-1441-శా.
ఆ పుణ్యాత్మునిఁ గౌఁగిలించుకొని నందాభీరుఁ డానంది యై
మా "పాలింటికిఁ గృష్ణు డీతఁ" డనుచున్ మన్నించి పూజించి వాం
ఛాపూర్ణంబుగ మంజులాన్నమిడి మార్గాయాసముం బాపి స
ల్లాపోత్సాహముతోడ నిట్లనియె సంలక్షించి మోదంబునన్.
10.1-1442-క.
"నా మిత్రుఁడు వసుదేవుఁడు
సేమంబుగ నున్నవాఁడె? చెలువుగఁ బుత్రుల్
నేమంబున సేవింప మ
హామత్తుండైన కంసుఁ డడగిన పిదపన్.
10.1-1443-శా.
అన్నా! భద్రమె? తల్లిదండ్రుల మమున్ హర్షించి చింతించునే?
తన్నుం బాసిన గోపగోపికల మిత్రవ్రాతమున్ గోగణం
బు న్నిత్యంబు దలంచునే? వన నదీ భూముల్ ప్రసంగించునే?
వెన్నుం డెన్నఁడు వచ్చు నయ్య! యిట మా వ్రేపల్లెకు న్నుద్ధవా?

భావము:
నందుడు ఆ పుణ్యాత్ముడిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. “ఇతడు మా పాలిటి గోపాలకృష్ణుడు” అంటూ సాదరంగా మన్ననలు చేసాడు. కడుపునిండా కమ్మని భోజనం పెట్టించాడు. ప్రయాణం బడలిక పోగొట్టాడు. ముచ్చటలాడే కోరికతో ఉద్దవుడితో ఎంతో సంతోషంగా ఇలా అన్నాడు. “నా చెలికాడు వసుదేవుడు క్షేమమే కదా! గర్వాంధు డైన కంసుడు కనుమూసాక తన కుమారులు చక్కగా సేవలు చేస్తుంటే సుఖంగా ఉన్నారు కదా. అన్నా! ఉద్ధవా! మమ్మల్ని తల్లితండ్రులను కృష్ణుడు సంతోషంతో తలచుకొంటూ ఉంటాడా? తనకి దూరంగా ఉంటున్న గోపగోపికలనూ, చెలికాండ్రనూ, ఆలమందలనూ ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటాడా? ఇక్కడి వనాలనూ నదులను గూర్చి ముచ్చటిస్తూ ఉంటాడా? వెన్నుడు ఇటు మా వ్రేపల్లెకు ఎప్పుడు వస్తాడయ్యా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=174&padyam=1443

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: