Friday, January 1, 2021

శ్రీ కృష్ణ విజయము - 111

( గురుపుత్రుని తెచ్చి ఇచ్చుట )

10.1-1429-క.
అనిన విని "వీఁడె వీనిం
గొనిపొం" డని భక్తితోడ గురునందను ని
చ్చినఁ గృష్ణుఁడు వీడ్కొలిపెను
ఘనదుర్జనదమను మహిషగమనున్ శమనున్.
10.1-1430-వ.
ఇట్లు జము నడిగి తెచ్చి రామకృష్ణులు సాందీపునికిం బుత్రుని సమర్పించి “యింకనేమి చేయవలయు నానతిం” డనిన న మహాత్ముం డిట్లనియె.
10.1-1431-క.
"గురునకుఁ గోరిన దక్షిణఁ
గరుణన్ మున్నెవ్వఁ డిచ్చె? ఘనులార! భవ
ద్గురునకుఁ గోరిన దక్షిణఁ
దిరముగ నిచ్చితిరి మీరు దీపితయశులై.

భావము:
శ్రీకృష్ణుడి మాటలు వినిన యమధర్మరాజు “ఇడుగో వీడే. వీడిని తీసుకుపొండి.” అని భక్తితో గురుపుత్రుని ఇచ్చివేశాడు. దుర్మార్గులను అణచివేసేవాడూ దున్నపోతు వాహనంగా కలవాడు అయిన యముడికి కృష్ణుడు వీడ్కోలు చెప్పి, గురుకుమారుణ్ణి కూడా తీసుకొని బయలుదేరాడు. అలా యముడి దగ్గర నుండి గురుపుత్రుడిని తీసుకొని వచ్చి తమ గురువు సాందీపనుడికి ఇచ్చి, రామకృష్ణులు “ఇంకా ఏమి చేయమంటారో చెప్పండి” అని అడిగారు. ఆ మహానుభావుడు సాందీపని వారితో ఇలా అన్నాడు. “ఓ మహాత్ములారా! గురువు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ యశస్సు దిగంతాలలో ప్రకాశింపజేసారు. ఇంతవరకూ తన గురువునకు అతడడిగిన ఇలాంటి దక్షిణ దయతో ఇచ్చినవాడు ఎక్కడా లేడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=172&padyam=1430

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, December 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 110

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1427-వ.
వచ్చి రామకృష్ణులం గని వారు లీలామనుష్యు లైన విష్ణుమూర్తు లని యెఱింగి; భక్తితోడ శుశ్రూష చేసి సర్వభూతమయుం డగు కృష్ణునకు నమస్కరించి “యేమి చేయుదు నానతి” మ్మనిన నమహాత్ముండు యిట్లనియె.
10.1-1428-క.
"చెప్పెద మా గురునందనుఁ
దప్పుగలుగఁ జూచి నీవు దండనమునకుం
దెప్పించినాఁడ వాతని
నొప్పింపుము మాకు వలయు నుత్తమచరితా!"

భావము:
అలా వచ్చిన యముడు బలరామకృష్ణులను చూడగానే. వారు లీలావతారం ధరించిన విష్ణువు అవతార మూర్తులు అని గ్రహించాడు. భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన కృష్ణుడికి నమస్సులు సమర్పించి. “నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించ” మని అడిగాడు. యముడి మాటలు విని ఆ పరమాత్మ ఇలా అన్నాడు. “ఓ పుణ్యశీలా! యమధర్మరాజా! చెబుతాను విను. మా గురుపుత్రునిలో తప్పు చూసి దండించడం కోసం తెప్పించుకున్నావు. మాకు అతడు కావాలి, అప్పగించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1428

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 109

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1425-వ.
చని సంయమనీనామ నగరంబు చేరి తద్వారంబునఁ బ్రళయకాల మేఘగంభీర నినద భీషణం బగు శంఖంబు పూరించిన విని వెఱఁగుపడి.
10.1-1426-శా.
"అస్మద్బాహుబలంబుఁ గైకొనక శంఖారావమున్ మాన సా
పస్మారంబుగ నెవ్వఁ డొక్కొ నగరప్రాంతంబునం జేసె? మ
ద్విస్మేరాహవ రోషపావకునిచే విధ్వస్తుఁడై వాఁడు దా
భస్మంబై చెడు" నంచు నంతకుఁడు కోపప్రజ్వలన్మూర్తియై.

భావము:
అలా వెళ్ళిన శ్రీకృష్ణుడు సంయమని అనే పేరు కల ఆ యముడి పట్టణం చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీరధ్వనితో భీతిగొలిపే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖఘోషము వినిన యమధర్మరాజు అశ్చర్యపోయాడు. “నా యమపురి ముందట ఎవరో నా భుజబలాన్ని లెక్కచేయకుండా నా మనసుకు క్రోధావేశం కలిగేలా శంఖం పూరిస్తున్నాడు. వాడు అద్భుతావహ మైన నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు.” అంటూ దండధరుడు కోపంతో మండిపడుతూ వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1426

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, December 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 108

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1422-వ.
అని వాని వసియించు చో టెఱింగించిన.
10.1-1423-శా.
శంఖారావముతోడఁ బంచజనుఁ డాశంకించి చిత్తంబులో
సం ఖిన్నుండయి వార్థిఁ జొచ్చె దహనజ్వాలాభ హేమోజ్జ్వల
త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందుఁ డ
ప్రేంఖచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై.
10.1-1424-క.
దానవుని దేహజం బగు
మానిత శంఖంబుఁ గొనుచు మసలక బలుఁడుం
దో నేతేరఁగ రథి యై
దానవరిపుఁ డరిగె దండధరుపురికి నృపా!

భావము:
అంటూ సముద్రుడు ఆ రాక్షసుడుండే చోటు రామకృష్ణులకు తెలియజేసాడు. శ్రీకృష్ణుడు శంఖం పూరించగా, ఆ శంఖారావం వినిన పంచజనుడు భయ సందేహాలతో కంపించిపోయి,. సాగర జలంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు వాడిని అగ్నిజ్వాలలతో సమానములైన బంగారుపింజల రంగారు బాణాలతో పడగొట్టి, వాడి పొట్టను చీల్చాడు. అచంచలమనస్కు డైన శ్రీకృష్ణునకు పంచజనుని కడుపులో విప్రకుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రీతిచే కార్య తత్పరుడు అయ్యాడు. ఓ పరీక్షన్మహారాజా! రాక్షసవిరోధి అయిన శ్రీకృష్ణుడు పంచజన రాక్షసుడి శరీరం నుంచి జనించిన పాంచజన్యం అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఆలసించక బలభద్ర సహితుడై రథము ఎక్కి, యమ పురికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1424

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 107

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1418-వ.
అనిన విని రామకృష్ణులు గుర్వర్థంబుగా దుర్వారరథారూఢులై రయంబునం జని రౌద్రంబున సముద్రంబుఁ జేరి యిట్లనిరి.
10.1-1419-క.
"సాగర! సుబుద్ధితోడను
మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ
వాగడ మగుదువు దుస్సహ
వేగరణాభీల నిశిత విశిఖాగ్నులకున్."
10.1-1420-వ.
అనిన వారలకు జలరాశి యిట్లనియె.
10.1-1421-ఉ.
"వంచన యేమి లేదు యదువల్లభులార! ప్రభాసతీర్థమం
దంచితమూర్తి విప్రసుతుఁ డాఢ్యుఁడు తోయములాడుచుండ ను
త్సంచలితోర్మి యొక్కటి ప్రచండగతిం గొనిపోయెఁ బోవఁగాఁ
బంచజనుండు మ్రింగె నతిభాసురశీలుని విప్రబాలునిన్."

భావము:
ఇలా పలికిన తమ గురువు పలుకులు విని, రామకృష్ణులు వారి కోరిక తీర్చడం కోసం ఎదురు లేని రథాన్ని అధిరోహించారు. తత్క్షణం సముద్రుడి దగ్గరకి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు. “ఓ సముద్రుడా! మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుడిని తెచ్చి మాకు అప్పగించు. ఎదురు చెప్పావు అంటే, సహింపరాని వేగం కలవీ, రణరంగ భయంకరాలూ అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు గుఱి అవుతావు.” ఇలా పలికిన రామకృష్ణులతో సాగరుడు ఇలా అన్నాడు. “యాదవేశ్వరులారా! నా మాటలలో ఏమాత్రం మోసం లేదు. ప్రభాసతీర్ధంలో మంచి అందమైన చక్కటి బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా, పెద్ద అల ఒకటి పైకెగసి భయంకరవేగంతో అతడిని లోపలికి తీసుకుపోయింది. అలా తీసుకునిపోగా బహు చక్కనైన స్వభావం కల ఆ బ్రాహ్మణ పిల్లాడిని పంచజనుడనే దైత్యుడు మ్రింగివేశాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1421

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, December 21, 2020

శ్రీ కృష్ణ విజయము - 106

( సాందీపుని వద్ధ శిష్యులగుట )


10.1-1416-శా.
"అంభోరాశిఁ బ్రభాసతీర్థమున ము న్నస్మత్తనూసంభవుం
డంభోగాహము సేయుచున్ మునిఁగి లేఁ డయ్యెం గృపాంభోనిధుల్
శుంభద్వీర్యులు మీరు మీ గురునకుం జోద్యంబుగా శిష్యతన్
గాంభీర్యంబునఁ బుత్రదక్షిణ యిడం గర్తవ్య మూహింపరే.
10.1-1417-క.
శిష్యులు బలాఢ్యులైన వి
శేష్యస్థితి నొంది గురువు జీవించును ని
ర్దూష్యగుణ బలగరిష్ఠులు
శిష్యులరై గురుని కోర్కి సేయం దగదే?"

భావము:
“నాయనలారా! మా కుమారుడు కొన్నాళ్ళ క్రితం సముద్రంలో ప్రభాసమనే తీర్థ ఘట్టం వద్ద స్నానం చేయడానికి నీటిలో దిగి మునిగిపోయాడు. అంతే మళ్ళీ కనిపించ లేదు. దయసముద్రులూ, ప్రకాశవంతమైన ప్రతాపం కలవారూ అయిన మీరు శిష్యధర్మం వహించి, మాకు గురుదక్షిణ ఇవ్వాలి. అందుచేత, అందరికీ అచ్చెరువు కలిగేలాగ మా కుమారుడిని తీసుకొని వచ్చి గురుదక్షిణగా ఇవ్వండి. శిష్యులు మిక్కిలి బలవంతులైతే గురువు విశేషమైన ఉత్తమస్థితిని పొంది తలెత్తుకొని జీవిస్తాడు. అనింద్య గుణములతో, అఖండ పరాక్రమంతో విరాజిల్లే మీ వంటి శిష్యులు గురుడి కోరిక నెరవేర్చడం న్యాయం కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1417

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, December 19, 2020

శ్రీ కృష్ణ విజయము - 105

( సాందీపుని వద్ధ శిష్యులగుట )

10.1-1413-క.
అఱువదినాలుగు విద్యలు
నఱువదినాలుగు దినంబు లంతన వారల్
నెఱవాదులైన కతమున
నెఱి నొక్కొక నాటి వినికి నేర్చి రిలేశా!
10.1-1414-క.
గురువులకు నెల్ల గురులై
గురులఘుభావములు లేక కొమరారు జగ
ద్గురులు త్రిలోకహితార్థము
గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్.
10.1-1415-వ.
ఇట్లు కృతకృత్యులైన శిష్యులం జూచి వారల మహాత్మ్యంబునకు వెఱఁగుపడి సభార్యుండైన సాందీపుం డిట్లనియె.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! రామకృష్ణులు ఎంతో నేర్పరులు కనుక, అరవైనాలుగు కళలనూ అరవైనాలుగు రోజులలో చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ చొప్పన వినడంతోనే నేర్చుసుకున్నారు. గురువులకే గురువులు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేద భావములు లేక ప్రకాశించు లోకగురువులు అయిన రామకృష్ణులు, ముల్లోకాలకు మేలు కలిగించడం కోసం, సంతోషంగా గురుశిష్య న్యాయంతో గురువు అయిన సాందీపుడిని సేవించారు. ఇలా, కృతార్థులైన శిష్యులను చూసి వారి ప్రభావానికి ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి, సాందీపని రామకృష్ణులతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1414

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :