Saturday, November 28, 2020

శ్రీ కృష్ణ విజయము - 84

( చాణూర ముష్టికుల వధ )

10.1-1361-క.
ధృతిచెడి లోఁబడె మల్లుం
డతులిత భవజలధితరికి హతరిపు పురికిన్
జితకరికిన్ ధృతగిరికిం
దత హరిరవ భరిత శిఖరిదరికిన్ హరికిన్.
10.1-1362-క.
హరికిని లోఁబడి బెగడక
హరి యురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్
హరి కుసుమమాలికాహత
కరి భంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై.

భావము:
సాటిలేని సంసారసాగరాన్ని దాటడానికి నావ వంటివాడూ; శత్రుపురాలను ధ్వంస మొనర్చినవాడూ; కువలయాపీడ గజాన్నిఓడించినవాడూ; గోవర్ధనగిరిని ఎత్తినవాడూ; గొప్ప సింహగర్జనతో పర్వత గుహలను పూరించినవాడూ అయిన శ్రీకృష్ణునికి చాణూరుడు ధైర్యంచెడి లోబడిపోయాడు. విరోధి చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ, భయపడక అతడి రొమ్ముపై మహా భయంకరమైన పిడికిలిపోటు పొడిచాడు. పూదండచే కొడితే ఏనుగు లెక్కచెయ్యని విధంగా, వాడి పోటును లెక్కచేయక శ్రీహరి విజృంభించి ఆ పోరులో పరాక్రమం చూపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1362

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, November 25, 2020

శ్రీ కృష్ణ విజయము - 83

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1357-క.
గోపాలకృష్ణుతోడను
గోపాలన వేళలందుఁ గూడి తిరుగు నా
గోపాలు రెంత ధన్యులొ
గోపాలుర కైన నిట్టి గురురుచి గలదే?
10.1-1358-క.
శ్రమజలకణసిక్తంబై
కమలదళేక్షణుని వదనకమలము మెఱసెన్
హిమజలకణసిక్తంబై
కమనీయం బగుచు నున్న కమలము భంగిన్.
10.1-1359-ఆ.
సభకుఁ బోవఁ జనదు; సభవారి దోషంబు
నెఱిఁగి యూరకున్ననెఱుఁగకున్న
నెఱిఁగి యుండియైన నిట్టట్టు పలికినఁ
బ్రాజ్ఞుఁ డైనఁ బొందుఁ బాపచయము."
10.1-1360-వ.
అని పెక్కండ్రు పెక్కువిధంబులం బలుకుచుండఁ దద్బాహు యుద్ధంబున.

భావము:
గోవులను మేపే సమయంలో గోపాలకృష్ణుడితో కలసిమెలసి తిరిగే ఆ గోపాలకు లెంత పుణ్యాత్ములో ఎంతటి ప్రభువులకైనా ఇంతటి గొప్ప అనుభవం దక్కదు కదా. మంచునీటి చుక్కలతో తడిసి మనోహరంగా ఉండే పద్మం వలె కలువరేకుల వంటి కన్నులు కల కృష్ణుని ముఖకమలం చెమటబిందువులతో తడిసి ప్రకాశిస్తున్నది. సభకు వెళ్ళరాదు. వెళితే సభలోనివారు చేసే దోషాలు తెలిసి ఉపేక్షించరాదు, ఆ దోషాలు తెలుసుకోలేకపోయినా, దోషాలు తెలిసి కూడా న్యాయవిరుద్ధంగా పలుకరాదు. లేకపోతే, ఎంతటి పండితుడి కైనా ఆ పాపం పట్టుకు తీరుతుంది.” ఇలా ఎందరో పురస్త్రీలు రకరకాలుగా పలుకుతుండగా ఆ ముష్టి యుద్ధంలో. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1359

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 82

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1355-సీ.
వేణునాళములమై వెలసిన మాధవుం-
  డధరామృతము లిచ్చి యాదరించుఁ
బింఛదామములమై పెరిగిన వెన్నుండు-
  మస్తకంబునఁ దాల్చి మైత్రి నెఱపుఁ
బీతాంబరములమై బెరిసిన గోవిందుఁ-
  డంసభాగమునఁ బాయక ధరించు
వైజయంతికలమై వ్రాలినఁ గమలాక్షుఁ;-
  డతి కుతూహలమున నఱుతఁ దాల్చుఁ
10.1-1355.1-తే.
దనరు బృందావనంబునఁ దరులమైనఁ
గృష్ణుఁ డానందమునఁ జేరి క్రీడ సల్పు
నెట్టి నోముల నైన ము న్నిట్టి విధము
లేల కామైతిమో యమ్మ! యింక నెట్లు?
10.1-1356-ఉ.
పాపపు బ్రహ్మ; గోపకుల పల్లెలలోన సృజింపరాదె; ము
న్నీ పురిలోపలన్ మనల నేల సృజించె? నటైన నిచ్చలుం
జేపడుఁ గాదె; యీ సుభగుఁ జెందెడి భాగ్యము సంతతంబు నీ
గోపకుమారుఁ బొంద మును గోపకుమారిక లేమి నోఁచిరో?

భావము:
మనము వేణువలమై ఉండి ఉంటే వేణుమాధవుడు కెమ్మోవిసుధలు ఇచ్చి మన్నించేవాడు; నెమలిఈకల దండలమై ఉండి ఉంటే నల్లనయ్య నెత్తిపై పెట్టుకుని నెయ్యం నెరపేవాడు; పచ్చని పట్టుబట్టలమై ఉండి ఉంటే ఈ వల్లవుడు భుజాలపై విడువక ధరించి ఉండే వాడు. వనమాలికలమై ఉండి ఉంటే వనమాలి కృష్ణుడు మిక్కిలి ఆసక్తితో కంఠాన కైసేసి ఉండేవాడు. అందమైన బృందావనంలో వృక్షాలమై ఉండి ఉంటే కృష్ణుడు ఆనందముతో దరిచేరి క్రీడించేవాడు. ఓ యమ్మా! పూర్వజన్మలలో ఎంతటి కష్టమైన వ్రతాలనైనా ఆచరించి ఈలా కాలేకపోయాము కదా. హు!. . ఇపుడు ఇంకేమి చేయగలం. ఈ పాపిష్టి బ్రహ్మదేవుడు మునుపే మనలను ఆ వ్రేపల్లెలో పుట్టించి ఉండకూడదా. ఈ మధురలో ఎందుకు పుట్టించాడో, ఆ గొల్లపల్లెలోనే పుట్టించి ఉంటే ఈ అందగాడిని పొందే సౌభాగ్యం, సంతోషం ఎల్లప్పుడూ మనకు సమకూడేవి కదా. ఈ గోపశేఖరుణ్ణి పొందడానికి ఆ గోపికలు పూర్వజన్మలలో ఎలాంటి నోములు నోచారో!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1355

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, November 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 81

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1352-వ.
ఆ సమయంబునం బౌరకాంతలు మూఁకలు గట్టి వెచ్చనూర్చుచు ముచ్చటలకుం జొచ్చి తమలో నిట్లనిరి.
10.1-1353-ఉ.
"మంచి కుమారులం గుసుమ మంజు శరీరులఁ దెచ్చి చెల్లరే
యంచిత వజ్రసారులు మహాద్రి కఠోరులు నైన మల్లురం
గ్రించులఁ బెట్టి రాజు పెనఁగించుచుఁ జూచుచు నున్నవాఁడు; మే
లించుకలేదు; మాను మనఁ డిట్టి దురాత్ముని మున్ను వింటిమే?
10.1-1354-క.
చూచెదరు గాని సభికులు
నీ చిన్నికుమారకులకు నీ మల్లురకు
న్నో చెల్ల! యీడు గాదని
సూచింపరు పతికిఁ దమకు శోకము గాదే?

భావము:
అలా బలరామకృష్ణులు మల్లులతో పోరాడుతున్న సమయంలో మధురలోని మగువలు గుంపులుగా చేరి, వేడి నిట్టూర్పులు విడుస్తూ తమలో తాము ఇలా ముచ్చటించుకున్నారు. “ఔరా! పువ్వులలా సుకుమారమైన శరీరాలు కల ఈ చక్కటి బాలురను రప్పించి, వజ్రాయుధ మంత సత్తా కలవారూ, పర్వతా లంత కఠోరులు అయిన వీరులతో మల్లయుద్ధం చేయిస్తూ రాజు వినోదం చూస్తున్నాడు. ఇందులో ఏమాత్రం మంచితనం లేదు. ఈ రాజు పోరు ఆపమని అనడయ్యె. ఇలాంటి దుర్మార్గులను మునుపు ఎన్నడైనా విన్నామా కన్నామా? సభాసదులైనా చూస్తున్నారే తప్ప; ఈ పసిపిల్లలకూ, ఈ మల్లయోధులకూ జోడు కుదరదని చెప్పరు. ఇది అధర్మం. ఇది వారికీ వారి రాజుకూ శోకం కలిగించదా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1354

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 80

( చాణూర ముష్టికులతో పోరు )

10.1-1349-క.
బలభద్రుఁడు ముష్టికుఁడును
బలములు మెఱయంగఁ జేసి బాహాబాహిం
బ్రళయాగ్నుల క్రియఁ బోరిరి
వెలయఁగ బహువిధములైన విన్నాణములన్.
10.1-1350-వ.
ఇవ్విధంబున.
10.1-1351-క.
వల్లవులు పెనఁగి రున్నత
గల్లులతో భిన్నదిగిభకరవల్లులతో
మల్లురతో రిపుమానస
భల్లులతో భీతగోపపల్లులతోడన్.

భావము:
అనేక రకాల బలవిన్యాసాలతో బలరాముడు, ముష్టికుడు తమ తమ బలాలు చూపుతూ ప్రళయకాలం లోని అగ్నుల చందాన చేతులతో ఒకరినొకరు త్రోసుకుంటూ పోరాటం సాగించారు. ఈ విధంగా నిక్కిన చెక్కిళ్ళు కలవారూ, దిగ్గజాల తొండాలను భేదించే తీవల వంటి చేతులు కలవారూ, శత్రువుల మనస్సులకు బల్లెముల వంటివారూ, గోపకుల సమూహానికి భయము కల్గించేవారూ అయిన మల్ల యోధులతో గోపాలబాలకులైన బలరామకృష్ణులు పోరాడారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=161&padyam=1351

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, November 17, 2020

శ్రీ కృష్ణ విజయము - 79

( చాణూర ముష్టికులతో పోరు )

10.1-1348-వ.
ఇట్లగ్గలంబగు నగ్గలిక డగ్గఱిన మల్లునింగని మెల్లన మొల్లంబగు బీరంబు వెల్లిగొన, వల్లవీవల్లభుం డుల్లసిల్లి బాహునాదంబున రోదోంతరాళంబు పూరించి మించి కవిసె; నట్లిద్దఱు నుద్దవిడి నున్నత విషమంబులగు ఠాణ లిడి, కరి కరియును, హరి హరియును గిరి గిరియునుం దాఁకు వీఁకం దలపడి యితరేతర హేతిహింసితంబులగు దవానలంబుల తెఱంగునఁ బరస్పర దీర్ఘనిర్ఘాత ఘట్టితంబులగు మహాభ్రంబుల విభ్రమంబున నన్యోన్య తుంగతరంగ తాడితంబు లగు కల్పాంతకాల సముద్రంబుల రౌద్రంబున నొండరుల ముష్టి ఘట్టనంబుల ఘట్టితశరీరులై దద్దరిలక డగ్గఱి గ్రద్దన నయ్యిద్దఱుం దిరుగు నెడ హరి చొచ్చి పేర్చి యార్చి జెట్టింబట్టి పడం దిగిచి పాదంబుల జాడించి సముల్లాసంబున నెసకంబునకు వచ్చిన మెచ్చి నొచ్చి య చ్చపలుండు మీఱి మోర సారించి తెరలక పొరలం ద్రొబ్బిన న బ్బలానుజుం డుబ్బి గొబ్బున మేను వర్ధిల్ల నర్దాంగకంబున నుండి జానువుల నొత్తుచు నురవడింగరవడంబున నున్ననా దుర్నయుండును “బాల! మేలు మే”లని లీలం గాలు చొరనిచ్చి త్రోచినం జూచి యేచి ఖేచరు లగ్గించి యుగ్గడింప న గ్గోపకుమారుండు పాటవంబున రాటవంబునకుంజని వెన్నెక్కి నిక్కిన న క్కంసభటుండు మదజలరేఖా బంధురం బగు గంధసింధురంబు చందంబునఁ పదంబునుఁ బదంబునం జాఁపి కరంబునుఁ గరంబున గ్రహించి సహించి వహించి నైపుణ్యంబున లోపలం దిరిగి యట్టిట్టు దట్టించిన దిట్టతనంబునం దిటవు దప్పక న ప్పద్మలోచనుండు కేడించి యేచి సమతలంబున వైచి ప్రచండం బగు వాని పిచండంబు వాగించి కాలఁధిక్కరించి డొక్కరంబు గొనిన న య్యభ్యాసి సభ్యులు సన్నుతింపం గ్రమ్మఱించి జడ్డనం గా లడ్డగించి రక్షించుకొనిన నా రక్షోవైరి వైరి కటిచేలంబు పట్టి యెత్తి యొత్తి నడుమ రాగెయిడి సందుబెట్టి నవ్విన, న వ్విరోధికాలు కాలిలో నిడి వేధించి నిరోధించిన, నిరోధంబుఁ బాసి తిరిగిన వసుదేవుపట్టి పట్టిసంబుఁ గొని దట్టించిన నుబ్బరిక చేసి చాణూరుండు హరికరంబుపట్టి హుమ్మని నెమ్మొగంబునం గాలిడి మీఁదైనం గేళీ బాలకుండు కాలుగాల నివారించి మీఁదై నెగడియుండనీయక దుర్వారబలంబున విదలించిలేచి గృహీత పరిపంథి చరణుండయి విపక్షుని వక్షంబు వజ్రివజ్ర సన్నిభంబగు పిడికిటం బొడిచిన వాఁడు వాఁడిచెడక విజృంభించి యంభోరాశి మథనంబునం దిరుగు శైలంబు పోలిక నేల జిఱజిఱం దిరిగి తన్నిన వెన్నుండు కుప్పించి యుప్పరం బెగసి మీఁద నుఱికిన నతండు కృష్ణపాద సంధి పరిక్షిప్తపాదుండై యెగసి లేచి సముద్ధతుం డయ్యె, న య్యెడ.

భావము:
ఇలా మితిమీరిన శౌర్యంతో సమీపించిన ఆ మల్లుడిని గోపాలప్రియుడు చూసాడు; క్రమంగా పరాక్రమాటోపం అతిశయిల్లగా అతడు ఉల్లాసంగా భుజాలు అప్పళించాడు; ఆ శబ్దం భూనభోంతరాళాలు నిండిపోయింది; అతడు చాణూరమల్లుని ఎదుర్కొన్నాడు; వారిద్దరూ మహా పరాక్రమంతో పెద్ద చిన్న మల్లయోధుల పట్లు పట్టారు. ఏనుగు ఏనుగుతో, సింహం సింహంతో, కొండ కొండతో ఢీకొన్నట్లు ఒకరితో ఒకరు తలపడ్డారు; రెండు కార్చిచ్చులు తమ తమ అగ్నిజ్వాలలతో ఒకదాని నొకటి పీడించుకున్నట్లుగా; రెండు మహా మేఘములు పరస్పరం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకొన్నట్లుగా; ప్రళయకాలంలో రెండు సముద్రాలు ఒకదానినొకటి సముత్తుంగతరంగాలతో కొట్టుకున్నట్లుగా; వారిద్దరూ రౌద్రంతో ఒకరినొకరు పిడికిళ్ళతో గ్రుద్దుకున్నారు; తబ్బిబ్బు పడక ఇద్దరూ ఎదురు బెదురుగా చేరి వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. అప్పుడు హరి విజృంభించాడు బొబ్బరిస్తూ చాణూర జెట్టిని పట్టిపడలాగాడు; కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించడం చూసి గోవిందుడు మెచ్చుకున్నాడు; చపలుడైన చాణూరుడు నొప్పెడుతున్నప్పటికీ మెడ నిక్కించి తొలగిపోక మురారిని దొర్లిపోయేలా త్రోసాడు; అంతట బలరాముని తమ్ముడైన కృష్ణుడు శరీరము ఉప్పొంగగా తటాలున అర్ధాంగకంలో ఉన్నవాడై మోకాళ్ళతో వానిని ఒత్తాడు; వేగంగా కరవడ మనే ఒక మల్లబంధం భంగిమలో ఉన్నాడు; అప్పుడు దుర్నీతీపరుడైన మల్లుడు “డింభకా! మేలు మే” లని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుడిని పడద్రోసాడు; అంతట వెన్నుడు చెలరేగి వ్రేల్పులు ప్రస్తుతించగా చాతుర్యంతో వెనుకకు వెళ్ళి చాణూరుడి వీపుమీదకి ఎక్కి నిక్కాడు; ఆ కంస భృత్యుడు అయిన చాణూరుడు మదజలధారల చారికలతో నిండుగా ఉన్న మదపుటేనుగులా మాధవుడి పాదాన్ని తన పాదంతో, చేతిని తన చేతితో పెనవేసి పట్టుకుని నేర్పుగా మల్లరంగం అంతా తిరుగుతూ అటూ ఇటూ కుదిలించి వేసాడు; కమలలోచనుడు దిట్టతనముతో దిటవు కోల్పోకుండా తొలగి, చెలరేగి, జెట్టిని మల్లరంగతలం మీద పడద్రోసి పెద్దదైన వాడి కడుపు మీద మోదాడు; తన కాలితో వాడి కాలిని మెలిపెట్టి డొక్కర మనే మల్లబంధ విశేషాన్ని చూపాడు. మంచి మల్లవిద్యాభ్యాసం పొంది ఉన్న చాణూరుడు సభలోనివారు తన్ను పొగుడుతుండగా కృష్ణుడిని వెనుకకు మరలించి, తటాలున తన కాలితో అడ్డగించి తనను తాను రక్షించుకున్నాడు; రాక్షసవిరోధి యగు కృష్ణుడు వాడి దట్టి పట్టి ఎత్తి ఒత్తి రాగెయిడి సందుపెట్టి నవ్వాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుడి కాలితో చేర్చి బాధించి నిరోధించాడు; వాసుదేవుడు విరోధి నిరోధాన్ని తప్పించుకుని, అడ్డకత్తి చేబూని అదలించాడు; చాణూరుడు చెలరేగి గెంతి శ్రీహరి బాహువు పట్టుకుని హుమ్మని హూంకరించి ముఖాన కాలుపెట్టి మీదుమిగిలాడు; లీలామానుషబాలుడైన శ్రీకృష్ణుడు చాణూరుని కాలిని తన కాలితో అడ్డగించి, వాడి విజృంభణము అణచి, అడ్డుకొనరాని బలిమితో విదిలించుకుని లేచాడు; శత్రువు పాదాన్ని త్రొక్కిపట్టి వజ్రాయుధం వంటి పిడికిలితో వాడి వక్షంపైన పొడిచాడు; వాడు పోడిమిచెడక చెలరేగాడు; సాగరమథనవేళ సముద్రంలో తిరిగే మందరపర్వతం మాదిరి వాడు నేలమీద గిరగిర తిరుగుతూ, కృష్ణుణ్ణి తన్నాడు; వెన్నుడు కుప్పించి పైకెగిరి వాడిపైకి దూకాడు; కృష్ణుడి పాదాలు వాడి పాదాల సంధిబంధాలను తాకయి; వాడు ఎగిరి పైకి లేచి విజృంభించాడు. అదే సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=160&padyam=1348

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :




శ్రీ కృష్ణ విజయము - 78

( చాణూరునితో సంభాషణ )

10.1-1347-సీ.
రోషాగ్నిధూమప్రరోహంబు కైవడి-
  శిరమున సన్నపు శిఖ వెలుంగ
నాశామదేభేంద్ర హస్తసన్నిభములై-
  బాహుదండంబులు భయదములుగ
లయసమయాంతకోల్లసిత దంష్ట్రల భంగిఁ-
  జాఁగిన కోఱ మీసములు మెఱయ
నల్లని తెగఁగల నడకొండ చాడ్పున-
  నాభీల నీలదేహంబు వెలయఁ
10.1-1347.1-ఆ.
జరణహతుల ధరణి సంచలింపఁగ నభో
మండలంబు నిండ మల్ల చఱచి
శౌరి దెసకు నడచెఁ జాణూర మల్లుండు
పౌరలోకహృదయభల్లుఁ డగుచు.

భావము:
గగనమండలం నిండేలా భుజాలు చరిచిన చాణూర మల్లుడు, కోపమనే అగ్ని నుంచి ప్రసరించే సన్నని పొగ మాదిరిగా అతని తలపై పిలకజుట్టు ప్రకాశిస్తుండగా; దిగ్గజముల తొండాలకు సమానమైన పొడుగాటి చేతులు భీతిని కలిగిస్తుండగా; ప్రళయకాలం లోని యమధర్మరాజు పదునైన కోరల వలె పొడవైన కోరమీసాలు మెరుస్తుండగా; నల్లని నిడుపైన నడకొండలాగ భయంకరమైన నల్లని దేహం పెల్లుబుకుతుండగా; అడుగుల తాకిడికి నేల అదురి పోతుండగా; చూస్తున్న పట్టణ ప్రజల హృదయాలకు ఆ దృశ్యం బల్లెంలా తగులుతుండగా చాణూరమల్లుడు కృష్ణుడి వేపు నడిచాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1347

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :