Tuesday, November 17, 2020

శ్రీ కృష్ణ విజయము - 79

( చాణూర ముష్టికులతో పోరు )

10.1-1348-వ.
ఇట్లగ్గలంబగు నగ్గలిక డగ్గఱిన మల్లునింగని మెల్లన మొల్లంబగు బీరంబు వెల్లిగొన, వల్లవీవల్లభుం డుల్లసిల్లి బాహునాదంబున రోదోంతరాళంబు పూరించి మించి కవిసె; నట్లిద్దఱు నుద్దవిడి నున్నత విషమంబులగు ఠాణ లిడి, కరి కరియును, హరి హరియును గిరి గిరియునుం దాఁకు వీఁకం దలపడి యితరేతర హేతిహింసితంబులగు దవానలంబుల తెఱంగునఁ బరస్పర దీర్ఘనిర్ఘాత ఘట్టితంబులగు మహాభ్రంబుల విభ్రమంబున నన్యోన్య తుంగతరంగ తాడితంబు లగు కల్పాంతకాల సముద్రంబుల రౌద్రంబున నొండరుల ముష్టి ఘట్టనంబుల ఘట్టితశరీరులై దద్దరిలక డగ్గఱి గ్రద్దన నయ్యిద్దఱుం దిరుగు నెడ హరి చొచ్చి పేర్చి యార్చి జెట్టింబట్టి పడం దిగిచి పాదంబుల జాడించి సముల్లాసంబున నెసకంబునకు వచ్చిన మెచ్చి నొచ్చి య చ్చపలుండు మీఱి మోర సారించి తెరలక పొరలం ద్రొబ్బిన న బ్బలానుజుం డుబ్బి గొబ్బున మేను వర్ధిల్ల నర్దాంగకంబున నుండి జానువుల నొత్తుచు నురవడింగరవడంబున నున్ననా దుర్నయుండును “బాల! మేలు మే”లని లీలం గాలు చొరనిచ్చి త్రోచినం జూచి యేచి ఖేచరు లగ్గించి యుగ్గడింప న గ్గోపకుమారుండు పాటవంబున రాటవంబునకుంజని వెన్నెక్కి నిక్కిన న క్కంసభటుండు మదజలరేఖా బంధురం బగు గంధసింధురంబు చందంబునఁ పదంబునుఁ బదంబునం జాఁపి కరంబునుఁ గరంబున గ్రహించి సహించి వహించి నైపుణ్యంబున లోపలం దిరిగి యట్టిట్టు దట్టించిన దిట్టతనంబునం దిటవు దప్పక న ప్పద్మలోచనుండు కేడించి యేచి సమతలంబున వైచి ప్రచండం బగు వాని పిచండంబు వాగించి కాలఁధిక్కరించి డొక్కరంబు గొనిన న య్యభ్యాసి సభ్యులు సన్నుతింపం గ్రమ్మఱించి జడ్డనం గా లడ్డగించి రక్షించుకొనిన నా రక్షోవైరి వైరి కటిచేలంబు పట్టి యెత్తి యొత్తి నడుమ రాగెయిడి సందుబెట్టి నవ్విన, న వ్విరోధికాలు కాలిలో నిడి వేధించి నిరోధించిన, నిరోధంబుఁ బాసి తిరిగిన వసుదేవుపట్టి పట్టిసంబుఁ గొని దట్టించిన నుబ్బరిక చేసి చాణూరుండు హరికరంబుపట్టి హుమ్మని నెమ్మొగంబునం గాలిడి మీఁదైనం గేళీ బాలకుండు కాలుగాల నివారించి మీఁదై నెగడియుండనీయక దుర్వారబలంబున విదలించిలేచి గృహీత పరిపంథి చరణుండయి విపక్షుని వక్షంబు వజ్రివజ్ర సన్నిభంబగు పిడికిటం బొడిచిన వాఁడు వాఁడిచెడక విజృంభించి యంభోరాశి మథనంబునం దిరుగు శైలంబు పోలిక నేల జిఱజిఱం దిరిగి తన్నిన వెన్నుండు కుప్పించి యుప్పరం బెగసి మీఁద నుఱికిన నతండు కృష్ణపాద సంధి పరిక్షిప్తపాదుండై యెగసి లేచి సముద్ధతుం డయ్యె, న య్యెడ.

భావము:
ఇలా మితిమీరిన శౌర్యంతో సమీపించిన ఆ మల్లుడిని గోపాలప్రియుడు చూసాడు; క్రమంగా పరాక్రమాటోపం అతిశయిల్లగా అతడు ఉల్లాసంగా భుజాలు అప్పళించాడు; ఆ శబ్దం భూనభోంతరాళాలు నిండిపోయింది; అతడు చాణూరమల్లుని ఎదుర్కొన్నాడు; వారిద్దరూ మహా పరాక్రమంతో పెద్ద చిన్న మల్లయోధుల పట్లు పట్టారు. ఏనుగు ఏనుగుతో, సింహం సింహంతో, కొండ కొండతో ఢీకొన్నట్లు ఒకరితో ఒకరు తలపడ్డారు; రెండు కార్చిచ్చులు తమ తమ అగ్నిజ్వాలలతో ఒకదాని నొకటి పీడించుకున్నట్లుగా; రెండు మహా మేఘములు పరస్పరం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకొన్నట్లుగా; ప్రళయకాలంలో రెండు సముద్రాలు ఒకదానినొకటి సముత్తుంగతరంగాలతో కొట్టుకున్నట్లుగా; వారిద్దరూ రౌద్రంతో ఒకరినొకరు పిడికిళ్ళతో గ్రుద్దుకున్నారు; తబ్బిబ్బు పడక ఇద్దరూ ఎదురు బెదురుగా చేరి వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. అప్పుడు హరి విజృంభించాడు బొబ్బరిస్తూ చాణూర జెట్టిని పట్టిపడలాగాడు; కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించడం చూసి గోవిందుడు మెచ్చుకున్నాడు; చపలుడైన చాణూరుడు నొప్పెడుతున్నప్పటికీ మెడ నిక్కించి తొలగిపోక మురారిని దొర్లిపోయేలా త్రోసాడు; అంతట బలరాముని తమ్ముడైన కృష్ణుడు శరీరము ఉప్పొంగగా తటాలున అర్ధాంగకంలో ఉన్నవాడై మోకాళ్ళతో వానిని ఒత్తాడు; వేగంగా కరవడ మనే ఒక మల్లబంధం భంగిమలో ఉన్నాడు; అప్పుడు దుర్నీతీపరుడైన మల్లుడు “డింభకా! మేలు మే” లని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుడిని పడద్రోసాడు; అంతట వెన్నుడు చెలరేగి వ్రేల్పులు ప్రస్తుతించగా చాతుర్యంతో వెనుకకు వెళ్ళి చాణూరుడి వీపుమీదకి ఎక్కి నిక్కాడు; ఆ కంస భృత్యుడు అయిన చాణూరుడు మదజలధారల చారికలతో నిండుగా ఉన్న మదపుటేనుగులా మాధవుడి పాదాన్ని తన పాదంతో, చేతిని తన చేతితో పెనవేసి పట్టుకుని నేర్పుగా మల్లరంగం అంతా తిరుగుతూ అటూ ఇటూ కుదిలించి వేసాడు; కమలలోచనుడు దిట్టతనముతో దిటవు కోల్పోకుండా తొలగి, చెలరేగి, జెట్టిని మల్లరంగతలం మీద పడద్రోసి పెద్దదైన వాడి కడుపు మీద మోదాడు; తన కాలితో వాడి కాలిని మెలిపెట్టి డొక్కర మనే మల్లబంధ విశేషాన్ని చూపాడు. మంచి మల్లవిద్యాభ్యాసం పొంది ఉన్న చాణూరుడు సభలోనివారు తన్ను పొగుడుతుండగా కృష్ణుడిని వెనుకకు మరలించి, తటాలున తన కాలితో అడ్డగించి తనను తాను రక్షించుకున్నాడు; రాక్షసవిరోధి యగు కృష్ణుడు వాడి దట్టి పట్టి ఎత్తి ఒత్తి రాగెయిడి సందుపెట్టి నవ్వాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుడి కాలితో చేర్చి బాధించి నిరోధించాడు; వాసుదేవుడు విరోధి నిరోధాన్ని తప్పించుకుని, అడ్డకత్తి చేబూని అదలించాడు; చాణూరుడు చెలరేగి గెంతి శ్రీహరి బాహువు పట్టుకుని హుమ్మని హూంకరించి ముఖాన కాలుపెట్టి మీదుమిగిలాడు; లీలామానుషబాలుడైన శ్రీకృష్ణుడు చాణూరుని కాలిని తన కాలితో అడ్డగించి, వాడి విజృంభణము అణచి, అడ్డుకొనరాని బలిమితో విదిలించుకుని లేచాడు; శత్రువు పాదాన్ని త్రొక్కిపట్టి వజ్రాయుధం వంటి పిడికిలితో వాడి వక్షంపైన పొడిచాడు; వాడు పోడిమిచెడక చెలరేగాడు; సాగరమథనవేళ సముద్రంలో తిరిగే మందరపర్వతం మాదిరి వాడు నేలమీద గిరగిర తిరుగుతూ, కృష్ణుణ్ణి తన్నాడు; వెన్నుడు కుప్పించి పైకెగిరి వాడిపైకి దూకాడు; కృష్ణుడి పాదాలు వాడి పాదాల సంధిబంధాలను తాకయి; వాడు ఎగిరి పైకి లేచి విజృంభించాడు. అదే సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=160&padyam=1348

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :




No comments: