Saturday, January 11, 2020

దక్ష యాగము - 3


(ఈశ్వర దక్షుల విరోధం)

4-37-క.
అని యడిగిన నవ్విదురునిఁ
గనుఁగొని మైత్రేయుఁ డనియెఁ గౌతుక మొప్పన్
"విను మనఘ! తొల్లి బ్రహ్మలు
జన నుతముగఁ జేయునట్టి సత్రముఁ జూడన్.
4-38-చ.
సరసిజగర్భ యోగిజన శర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు
క్పరమ ఋషిప్రజాపతులు భక్తిఁ మెయిం జనుదెంచి యుండ న
త్తరణిసమాన తేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సదస్యు లా
దరమున లేచి; రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్.
భావము:
అని అడిగిన విదురునకు మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు. “పుణ్యాత్మా! విను. పూర్వం బ్రహ్మవేత్తలు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని చూడటానికి... శివుడు, బ్రహ్మ, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైన వారంతా పరమాసక్తితో వచ్చారు. అప్పుడు అక్కడికి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తూ దక్షుడుకూడ వచ్చాడు. దక్షుని చూడగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోనివారందరూ లేచి నిలబడ్డారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=38

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, January 10, 2020

దక్ష యాగము - 2


(ఈశ్వర దక్షుల విరోధం)

4-36-సీ.
"చతురాత్మ! దుహితృవత్సలుఁడైన దక్షుండు;
దన కూఁతు సతి ననాదరము చేసి
యనయంబు నఖిలచరాచర గురుఁడు ని;
ర్వైరుండు శాంతవిగ్రహుఁడు ఘనుఁడు
జగముల కెల్లను జర్చింప దేవుండు;
నంచితాత్మారాముఁ డలఘుమూర్తి
శీలవంతులలోన శ్రేష్ఠుండు నగునట్టి;
భవునందు విద్వేషపడుట కేమి
4-36.1-తే.
కారణము? సతి దా నేమి కారణమున
విడువరానట్టి ప్రాణముల్ విడిచె? మఱియు
శ్వశుర జామాతృ విద్వేష సరణి నాకుఁ
దెలియ నానతి యిమ్ము సుధీవిధేయ!"

భావము:
“చతురస్వభావం కలవాడా! సజ్జనవిధేయా! తన పుత్రికలపై ప్రేమ గల దక్షుడు సతీదేవిని ఎందుకు అవమానించాడు? సమస్త చరాచరాలకు గురువు, ఎవరినీ ద్వేషింపనివాడు, ప్రశాంతమూర్తి, మహానుభావుడు, ఎల్ల లోకాలకు దేవుడు, ఆత్మారాముడు, విశ్వేశ్వరుడు, శీలవంతులలో అగ్రేసరుడు అయిన మహాదేవుని దక్షుడు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఏ కారణంగా సతీదేవి తన ప్రాణాలు విడిచింది? మామయైన దక్షునికి, అల్లుడైన శివునికి విరోధం ఎలా సంభవించింది? నాకు ఈ కథను దయచేసి సెలవీయండి.”
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=36

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, January 9, 2020

దక్ష యాగము - 1

(ఈశ్వర దక్షుల విరోధం)

4-35-సీ.
దక్షప్రజాపతి తనయ యా భవుని భా;
ర్యయు ననఁ దగు సతి యను లతాంగి
సతతంబుఁ బతిభక్తి సలుపు చుండియుఁ దనూ;
జాతలాభము నందఁ జాలదయ్యె;
భర్గుని దెసఁ జాలఁ బ్రతికూలుఁ డైనట్టి;
తమ తండ్రిమీఁది రోషమునఁ జేసి
వలనేది తా ముగ్ధవలె నిజయోగ మా;
ర్గంబున నాత్మదేహంబు విడిచె;"
4-35.1-తే.
నని మునీంద్రుఁడు వినిపింప నమ్మహాత్ముఁ
డైన విదురుండు మనమున నద్భుతంబు
గదురఁ దత్కథ విన వేడ్క గడలుకొనఁగ
మునివరేణ్యునిఁ జూచి యిట్లనియె మఱియు.

భావము:
దక్షప్రజాపతి కూతురు, పరమశివుని భార్య అయిన సతీదేవి తన పతిని అనునిత్యం మిక్కిలి భక్తితో సేవించినా ఆమెకు సంతానం కలుగలేదు. పరమేశ్వరునిపట్ల పగబూనిన తన తండ్రిమీద కోపించి ఆ ఉత్తమ ఇల్లాలు యోగమార్గంలో తన శరీరాన్ని పరిత్యజించింది.” అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. విదురుడు ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమంతా తెలుసుకోవాలనే కుతూహలం కలుగగా ఆ మునీంద్రుని ఇలా ప్రశ్నించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=35

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, October 18, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 16


( కల్ప ప్రళయ ప్రకారంబు )

12-23-సీ.
అంత లోకేశున కవసానకాలంబు;
వచ్చిన నూఱేండ్లు వసుధలోన
వర్షంబు లుడిగిన వడిఁ దప్పి మానవుల్;
దప్పి నాఁకటఁ జిక్కి నొప్పి నొంది
యన్యోన్యభక్షులై యా కాలవశమున;
నాశ మొందెద; రంత నలినసఖుఁడు
సాముద్ర దైహిక క్ష్మాజాత రసములఁ;
జాతురిఁ గిరణాళిచేతఁ గాల్ప
12-23.1-తే.
నంతఁ గాలాగ్ని సంకర్షణాఖ్య మగుచు
నఖిల దిక్కులు గలయంగ నాక్రమించు
నట్టియెడ నూఱువర్షంబు లాదుకొనఁగ
వీఁకతోడుత వాయువుల్ వీచు నపుడు.

భావము:
బ్రహ్మదేవునికి అతని కాలమాన ప్రకారం వంద సంవత్సరాలు (365,000 యుగచతుష్టయములు) నిండితే ఒక అవసానకాలం వస్తుంది. అపుడు భూమిమీద నూరేళ్ళపాటు వానలు కురవవు. దానితో మానవులు ఆకలిదప్పులు తట్టుకోలేక అల్లాడిపోతారు. అప్పుడు ఒకరినొకరు తినడం మొదలు పెడతారు. ఆ విధంగా కాలవశులై అంతరిస్తారు. అప్పుడు పద్మబాంధవుడైన సూర్యుడు సముద్ర జలాలను, శరీరము లందున్న రసాలను, భూమి యందు ఉండు ద్రవాలను తన కిరణాలచేత కాల్చి పీల్చివేస్తాడు. ఆ విధమైన కాలాగ్ని సంకర్షణం అనే పేరుతో అన్నిదిక్కులలోనూ వ్యాపించి ఆక్రమిస్తుంది. అప్పుడు నూరు సంవత్సరాలపాటు విడవకుండా వాయువులు వీస్తాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=5&padyam=23

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

Friday, October 11, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 15


( కల్ప ప్రళయ ప్రకారంబు )

12-22-వ.
అనినఁ గల్పప్రళయ ప్రకారం బెట్లనిన నతం డిట్లనియెఁ; “జతుర్యుగ సహస్రంబులు సనిన నది బ్రహ్మకు నొక్క పవలగు; నా క్రమంబున రాత్రియు వర్ధిల్లు; నంత బ్రహ్మకు నొక్కదినం బగుటవలన నది నైమిత్తిక ప్రళయం బనంబడు; నందు విధాత సమస్త లోకంబులం దన యాత్మ యందు నిలిపి శయనింప ప్రకృతి వినష్టంబయిన నది ప్రాకృత ప్రళయం బని చెప్పంబడు; నా ప్రళయ ప్రకారంబు విను; మిట్లు పవలు నైమిత్తిక ప్రళయంబును, రాత్రి ప్రాకృత ప్రళయంబు నగుట గలిగిన, నది యజునకు దినప్రమాణం; బిట్టి దినప్రమాణంబున మున్నూటయఱువది దినంబు లయిన నలువకు నొక్క సంవత్సరంబు పరిపూర్ణం బగుఁ; దద్వత్సరంబులు శతపరిమితంబు లయిన.

భావము:
అప్పుడు పరీక్షుత్తు “కల్ప ప్రళయం ఏ ప్రకారం జరుగుతుంది” అని అడిగాడు. దానికి శుకముని ఇలా అన్నాడు. “ఒకవెయ్యి యుగచతుష్టయాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. అలాగే రాత్రి కూడ ఒకవెయ్యి యుగచతుష్టయాలే. ఇటువంటి రాత్రింబగళ్ళు కలిస్తే బ్రహ్మకు ఒకరోజు అవుతుంది. అందులో పగలు కలుగుదానిని “నైమిత్తిక ప్రళయం” అంటారు. ఆ బ్రహ్మరాత్రి సమయంలో విధాత లోకాలు అన్నింటినీ తనలో చేర్చుకుని నిద్రిస్తాడు. అప్పుడు ప్రకృతి అంతరిస్తుంది దానిని “ప్రాకృత ప్రళయం” అంటారు. ఈ ప్రళయ విషయం వివరిస్తాను విను. పగటిపూట నైమిత్తిక ప్రళయం రాత్రి పూట ప్రాకృత ప్రళయం. ఈ రెండూ కలసి బ్రహ్మదేవునికి ఒక దినము అవుతుంది ఇటువంటివి మూడువందల అరవై అయినప్పుడు బ్రహ్మ కాలమానంలో ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అటువంటివి వంద సంవత్సరాలు అయినప్పుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=5&padyam=22

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 14


( కలియుగ ధర్మంబు )

12-21-క.
"మూడవ యుగమున నెంతయు
వేడుక హరికీర్తనంబు వెలయఁగ ధృతిచేఁ
బాడుచుఁగృష్ణా! యనుచుం
గ్రీడింతురు కలిని దలఁచి కృతమతు లగుచున్. "

భావము:
“మూడవ యుగం అయిన ద్వాపరంలో "కృష్ణా" అని హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. హరిని స్తోత్రాలు ఆలపిస్తూ ఉంటారు. కలిని తలచి జాగ్రత్త పడువారు అయి భగవంతుని యందు క్రీడిస్తూ ఉంటారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=4&padyam=21

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

Wednesday, October 9, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 13


( కలియుగ ధర్మంబు )

12-20-వ.
అనిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె; “కలియుగం బతిపాప సమ్మిళితంబు; గాన దురితంబు లేలాగున రాకుండఁ జేయుదురు? కాలం బే క్రమంబున నడచుఁ? గాలస్వరూపకుం డైన హరి ప్రభావం బేలాగునం గానఁబడు? నీ జగజ్జాలం బెవ్విధంబున నిలుచు?” నని యడిగిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియెఁ;“ గృత త్రేతా ద్వాపర కలి యుగంబులను యుగ చతుష్టయంబును గ్రమంబుగాఁ బ్రవర్తించు, ధర్మంబునకు సత్య దయా తపో దానంబులు నాలుగు పాదంబులై నడచు; శాంతిదాంత్యత్మజ్ఞాన వర్ణాశ్రమాచారంబులు మొదలగునవి గలిగి ధర్మంబు మొదటి యుగంబున నాలుగు పాదంబులం బరిపూర్ణం బై ప్రవర్తిల్లు; శాంతిదాంతికర్మాచరణాది రూపం బగు ధర్మంబు మూఁడు పాదంబుల రెండవ యుగంబునం బ్రవర్తిల్లు; విప్రార్చనాహింసావ్రత జపానుష్టానాది లక్షణంబులు గలిగి ధర్మంబు రెండు పాదంబుల మూడవ యుగంబునం దేజరిల్లు; మఱియు జనులు గలియుగంబున దర్మరహితులు, నన్యాయకారులు, క్రోధమాత్సర్యలోభమోహాది దుర్గుణ విశిష్టులు, వర్ణాశ్రమాచారరహితులు, దురాచారులు, దురన్నభక్షకులు, శూద్రసేవారతులు, నిర్దయులు, నిష్కారణవైరులు, దయాసత్యశౌచాది విహీనులు, ననృతవాదులు, మాయోపాయులు, ధనవిహీనులు, దోషైక దృక్కులునై పాపచరితులగు రాజుల సేవించి, జననీజనక సుత సోదర బంధు దాయాద సుహృజ్జనులం బరిత్యజించి, సురతాపేక్షులై కులంబులం జెఱచుచుండెదరు; మఱియు క్షామ డామరంబులం బ్రజా క్షయం బగు; బ్రాహ్మణులు దుష్ప్రతిగ్రహవిహారులై యజ్ఞాదికర్మంబులు పదార్థపరులై చేయుచు హీనులై నశించెద; రట్లుగాన యీ కలియుగంబున నొక్క ముహూర్తమాత్రం బయిన నారాయణస్మరణ పరాయణులై మనంబున ‘శ్రీనృసింహ వాసుదేవ సంకర్ష’ణాది నామంబుల నచంచల భక్తిం దలంచు వారలకుఁ గ్రతుశత ఫలంబు గలుగు; నట్లు గావున రాజ శేఖరా! నీ మది ననవరతంబు హరిం దలంపుము; కలి యనేక దురితా లయంబు గాన, యొక్క నిమేషమాత్రంబు ధ్యానంబు సేసినం బరమ పావనత్వంబు నొంది కృతార్థుండ వగుదు” వని పలికి మఱియును.

భావము:
అని శుకయోగి పరీక్షిన్మహారాజునకు చెప్పాడు. అప్పుడు పరీక్షన్మహారాజు శుకమహర్షిని ఇలా అడిగాడు. “కలియుగం ఘోరపాపాలకు ఆలవాలం కదా. మరి ఈ కాలంలో ప్రజలు తమకు పాపాలు చెందకుండ ఏమి చేయాలి? కాలం ఏవిధంగా నడుస్తుంది? కాలస్వరూపుడు విష్ణుదేవుని ప్రభావం ఏ విధంగా తెలుస్తుంది? ఈ లోకాలన్నీ ఏవిధంగా నిలబడతాయి?” అంతట, శుకమునీంద్రుడు మహారాజుకు ఈవిధంగా బదులు చెప్పాడు. “కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని యుగాలు నాలుగు. ఆ నాలుగు యుగాలు వరుసగా నడుస్తుంటాయి. ధర్మానికి సత్యము, దయ, తపస్సు, దానము అని నాలుగు పాదాలు. ప్రథమ యుగం కృతయుగంలో శాంతి, దాంతి, ఆత్మజ్ఞానము, వర్ణాచారాలు, ఆశ్రమాచారాలు మున్నగునవి కలిగి ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. రెండవ యుగం త్రేతాయుగంలో శాంతి, దాంతి, కర్మాచరణ మున్నగు లక్షణాలు కలిగి ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది. మూడవ యుగం ద్వాపరయుగంలో బ్రాహ్మణపూజ, జపానుష్టానములు, అహింసావ్రతము మున్నగు లక్షణాలు కలిగి ధర్మం రెండు పాదాలతో ప్రకాశిస్తుంది. ఇంక నాలుగవ యుగం కలియుగంలో జనులు ధర్మదూరులు, అన్యాయం ఆచరించే వారు, క్రోధం మాత్సర్యం మోహం లోభం మున్నగు దుర్లక్షణాలు కలవారు, అయి ఉంటారు. వర్ణాచారాలను ఆశ్రమాచారాలను విడిచిన వారు, దురాచార పరులు, తినరాని ఆహారం తినువారు, శూద్రసేవాసక్తులు, దయలేనివారు, నిష్కారణ వైరాలు పెట్టుకునేవారు, అబద్ధాలకోరులు, కపటోపాయాలుపన్నువారు, దయ సత్యము శౌచము మున్నగు సుగుణాలు లేనివారు, దరిద్రులు, దోషపూరిత చూపులు కలవారు అయి ఉంటారు. అంతేకాకుండా పాపశీలం కల రాజులను సేవిస్తూ ఉంటారు. తల్లి తండ్రి కొడుకు సోదరుడు చుట్టం జ్ఞాతి స్నేహితుడు అన్న అనురాగాలు లేకుండా ఉంటారు. కేవలం కాముక కర్మ యందే కాంక్ష కలిగి తిరుగుతూ ఉంటారు. కులపవిత్రతను కూలదోస్తూ ఉంటారు. ఇంకా ఆ కలికాలంలో కరువుకాటకాలవలన ప్రజలు నశించిపోతుంటారు. బ్రాహ్మణులు పరిగ్రహింపరాని దానాలు పరిగ్రహిస్తూ ఉంటారు. భౌతిక పదార్థాల మీద మాత్రమే ఆసక్తితో యజ్ఞయాగాదులు చేస్తూంటారు. యధేచ్ఛావిహారులై ఉంటారు. ఇలా భ్రష్టులు నీచులు కావటంచేత నశిస్తారు. కాబట్టి ఈ కలియుగంలో ఒక్కక్షణమైనా సరే శ్రీహరి స్మరణ పరాయణులు అయి, శ్రీనృసింహ, వాసుదేవ, సంకర్షణ మొదలైన నామాలతో సుస్థిరమైన భక్తితో పలకాలి. ఆ విధంగా హరినామస్మరణ పరాయణులు అయిన వారికి స్మరణమాత్రాన వందయజ్ఞాలు చేస్తే వచ్చే అంత ఫలం వస్తుంది.కాబట్టి రాజోత్తమా! నీ మనస్సులో నిరంతరాయంగా హరిని స్మరించు. కలియుగం అనేక పాపాలకు పుట్టిల్లు. కావున, ఒక్క నిమిషం ధ్యానం చేసినా ఉత్తమమైన పవిత్రత పొంది కృతార్ధుడవు అవుతావు.” అని చెప్పి శుకమహర్షి మరల ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=4&padyam=20

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :