Sunday, August 12, 2018

శ్రీకృష్ణ లీలలు - 63

10.1-401-వ.
చని యా యూర్జిత మహాబలుండు నిజోదరదామ సమాకృష్యమాణ తిర్యగ్భవదులూఖలుండై యా రెండు మ్రాకుల నడుమం జొచ్చి ముందటికి నిగుడుచు.
10.1-402-క.
బాలుఁడు ఱో లడ్డము దివ
మూలంబులు పెకలి విటపములు విఱిగి మహా
భీలధ్వనిఁ గూలెను శా
పాలస్యవివర్జనములు యమళార్జునముల్

భావము:
దృఢమైన బలము కల ఆ కృష్ణబాలకుడు, తన పొట్టకు కట్టిన త్రాటిని బలంగా ఊపాడు, ఱోలు అడ్డంతిరిగిపోయింది. అతడు చెరచెరా మద్దిచెట్లు రెంటి మధ్యనుండి దూరి ఱోలును ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆ కృష్ణబాలుడు అడ్డం పడిన ఱోలుని లాగాడు. దాంతో ఆ జంట మద్దిచెట్లు రెండూ వేళ్ళతో సహా పెకలించుంకొనిపోయి, కొమ్మలు విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేలకూలిపోయాయి. చాలా కాలం తరువాత వాటికి శాపాలు తొలగిపోయాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=56&padyam=402

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, August 10, 2018

శ్రీకృష్ణ లీలలు - 62

10.1-399-వ.
అని యిట్లు పలికి నారదుండు నారాయణాశ్రమంబునకుం జనియె వారిరువురు సంగడిమద్దు లైరి, పరమభాగవతుండైన నారదు మాటలు వీటింబుచ్చక పాటించి.
10.1-400-క.
ముద్దుల తక్కరిబిడ్డఁడు
మద్దులఁ గూల్పంగ దలఁచి మసలక తా నా
మద్దికవ యున్న చోటికిఁ 
గ్రద్దన ఱో లీడ్చుకొనుచుఁ గడకం జనియెన్.


భావము:
ఇలా శాపమూ విమోచనమూ చెప్పి, నారదుడు నారయణాశ్రమానికి వెళ్ళిపోయాడు: వాళ్ళిద్దరు జంట మద్ది చెట్లుగా భూలోకంలో పక్కపక్కన పడిఉన్నారు, నారదమహర్షి పరమభాగవతోత్తముడు కనుక శ్రీకృష్ణపరమాత్మ ఆయన మాటలను పాటించదలచాడు. ఆ టక్కులమారి ముద్దుకృష్టుడు ఆ రెండు మద్దిచెట్లను కూల్చాలని సంకల్పించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మద్దిచెట్ల జంట దగ్గరకు అమాతంగా ఱోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలలు - 61

10.1-398-క.
ముక్తులరై నారాయణ
భక్తులరై పరమసాధుభావ శ్రీ సం
సక్తులరై సురలోక
వ్యక్తుల రయ్యెదరు నాదువాక్యము కతనన్."

భావము:
ఈ నా శాప విమోచన అనుగ్రహం వలన, ఆ యశోదానందనుని పాదారవిందస్పర్శతో విముక్తులు అవుతారు; ఆ విధంగా ముక్తులై, శ్రీమన్నారాయణుని భక్తులై సత్ప్రవర్తన యందు ఆసక్తి కలవారై మళ్ళీ దేవలోకంలో ప్రవేశిస్తారు."

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=55&padyam=398

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, August 9, 2018

శ్రీకృష్ణ లీలలు - 60

10.1-396-క.
కలవాని సుతుల మనుచును
గలకంఠులతోడఁ గూడి కానరు పరులం
గలలో నైనను; వీరికిఁ
గల క్రొవ్వడఁగించి బుధులఁ గలపుట యొప్పున్.
10.1-397-వ.
అని చింతించి విజ్ఞాన విశారదుండగు నారదుండు నలకూబర మణిగ్రీవులఁ జూచి "మీరలు స్త్రీమదాంధులరు గావున భూలోకంబున నర్జున తరువులై నూఱు దివ్యవర్షంబు లుండుం డటమీఁద గోవిందచరణారవింద పరిస్పందంబున


భావము:
"ఈ యక్షరాజు కుమారులు ధనవంతుని కొడుకులమని గర్వించి ఉన్నారు; పైగా ప్రేయసులతో కూడి ఉన్నారు. ఇక చెప్పేదేమి ఉంది. వీరికి కొవ్వు అణచి మళ్ళీ సత్పురుషులనుగా మార్చటం సముచితమైన పని." అని తన మనసులో ఆలోచించుకొని విశేషమైన జ్ఞానం కల నారదమహర్షి నలకూబర, మణికూబరులతో ఇలా అన్నాడు "మీరు స్త్రీఐశ్వర్యమదంతో కొట్టుకుంటున్నారు; కనుక భూమ్మీద వంద దివ్యసంవత్సరాల పాటు మద్దిచెట్లుగా పడి ఉండండి. ఆ తరువాత గోవిందుని పాదారవిందాల స్పర్శ లభించుటచేత;



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలలు - 59

10.1-394-శా.
సంపన్నుం డొరుఁ గాన లేఁడు తనువున్సంసారమున్ నమ్మి హిం
సింపం జూచు దరిద్రుఁ డెత్తుబడి శుష్కీభూతుఁడై చిక్కి హిం
సింపం డన్యుల నాత్మకున్ సముల కాఁ జింతించు నట్లౌటఁ ద
త్సంపన్నాంధున కంజనంబు వినుమీ దారిద్ర్య మూహింపఁగన్."
10.1-395-వ.
అని గీతంబు వాడి తన మనంబున.

భావము:
ధనవంతుడు ఎవరినీ లెక్కచేయడు; తన ధనాన్నీ, శరీరాన్నీ, సంసారాన్నీ నమ్ముకుని ఇతరులను హింసించాలని చూస్తాడు; దరిద్రుడు దారిద్ర్యదేవతకు చిక్కి కష్టాలతో బక్కచిక్కినా ఇతరులను హింసించడు; వాళ్ళు కూడా తనలాంటివారే కదా అని భావిస్తాడు; ఇది లోకరీతి; విను, కనుక ధనమదాంధులైన వారికి దరిద్రమే చక్కని కళ్ళు తెరిపించే మందు అవుతుంది;" ఇలా గీతం పాడిన నారదుడు తన మనసులో . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=55&padyam=394

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, August 8, 2018

శ్రీకృష్ణ లీలలు - 58

10.1-392-క.
"నారదుఁ డేల శపించెను? 
వా రా వృక్షత్వమునకు వచ్చిన పనికిం
గారణ మెయ్యది? యోగికు
లారాధ్య! యెఱుంగఁ జెప్పు మయ్య! వినియెదన్."
10.1-393-వ.
అనిన శుకుండిట్లనియె “మున్ను కుబేరుని కొడుకు లిరువురు శంకరకింకరులై యహంకరించి వెండికొండమీఁద విరుల తోఁటలం బాడెడి చేడియలం గూడికొని కరేణు సంగతంబు లైన యేనుంగుల భంగి సురంగంబు లైన మందాకినీతరంగంబులం గ్రీడింప నారదుండు వచ్చిన న చ్చెలువలు చెచ్చెర వలువలు ధరియించిరి; మదిరాపాన పరవశులు గావున వార లిరువురు వివస్త్రులై మెలంగుచున్న నా మునీశ్వరుండు చూచి శపియించు వాఁడై ప్రతీతంబగు గీతంబు వాడె; వినుము.


భావము:
"ఓ యోగివరేణ్యా! శుకా! లోకంలోని యోగులందరూ నిన్ను సేవిస్తూ ఉంటారు. ఆ యక్షులను నారదుడు ఎందుకు శపించాడు; వారికి అలా చెట్లుగా పడిఉండే శాపం రావటానికి వారు చేసిన అపచారం ఏమిటి? ఆ వివరం తెలియజెప్పు వింటాను." అలా పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా చెప్పసాగాడు "పూర్వం కుబేరుడి కుమారులు ఇద్దరు నలకూబరుడు, మణిగ్రీవుడు అనేవారు శంకరునికి సేవకులుగా ఉండేవారు, యక్షుల రాకుమారులము, పైగా పరమశివుని అనుచరులము గదా అని అహంకారంతో వారు సంచరిస్తూ ఉండేవారు. ఒకరోజు వారిద్దరూ వెండికొండమీద ఉద్యానవనాలలో తమ ప్రియురాళ్ళతో కలిసి విహరిస్తున్నారు. ఆ గంధర్వకన్యలు చాలా మనోహరంగా పాటలు పాడుతున్నారు. ఇలా ఆడ ఏనుగులతో కూడిన మదపుటేనుగులులాగా తమ కాంతలతో అందమైన ఆకాశగంగా తరంగాలలో జలక్రీడలు సాగిస్తున్నారు. ఇంతలో ఆ మార్గాన నారదమహర్షి వచ్చాడు. ఆయనను చూసి గంధర్వ కాంతలు గబగబా బట్టలు ధరించారు. మద్యం కైపులో మునిగి ఉన్న నలకూబర మణిగ్రీవులు మాత్రం దిగంబరులుగానే తిరుగుతున్నారు. వారిని చూసిన నారదుడు శపించబోతూ ఒక ప్రసిద్ధమైన గీతాన్ని పాడాడు. దానిని విను;



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలలు - ౫౭

10.1-390-క.
జ్ఞానులచే మౌనులచే
దానులచే యోగ సంవిధానులచేతం
బూని నిబద్దుం డగునే
శ్రీనాథుఁడు భక్తియుతులచేతం బోలెన్?
10.1-391-వ.
అంత నయ్యశోద యింటికడఁ బనులవెంటందిరుగఁ గృష్ణుఁడు తొల్లి నారదు శాపంబున నిరుమద్దులై యున్న నలకూబర మణిగ్రీవు లను గుహ్యకుల నిద్దఱం గని ఱో లీడ్చుకొని చనియె" నని చెప్పిన శుకయోగివరునకు భూవరుం డిట్లనియె.

భావము:
భక్తులకు పట్టుబడినట్లు భగవంతుడు జ్ఞానులకు గానీ, మునులకు గానీ, దాతలకు గానీ, యోగీశ్వరులకు గానీ పట్టుబడడు గదా! తల్లి యశోదాదేవి కొడుకు కృష్ణుని అలా రోటికి కట్టివేసి, ఇంట్లో పనులు చేసుకోవటంలో మునిగిపోయింది. నలకూబరుడు, మణిగ్రీవుడు అనే ఇద్దరు యక్షులు నారదుని శాపం వలన చాలాకాలంనుంచి రెండు పెద్దపెద్ద మద్దిచెట్లుగా పడి ఉన్నారు. కృష్ణబాలుడు ఆ మద్దిచెట్ల జంటను చూసాడు. రోలును ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరకు వెళ్ళాడు" ఇలా శుకబ్రహ్మ చెప్పగా విన్న మహారాజు ఇలా అడిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54&padyam=390

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :