Saturday, April 11, 2015

కృష్ణలీలలు

10.1-349-వచనము
అనిన విని రాజిట్లనియె.
10.1-350-ఆటవెలది
జగదధీశ్వరునకుఁ జన్నిచ్చు తల్లి గా
నేమి నోము నోఁచె నీ యశోద?
పుత్రుఁ డనుచు నతనిఁ బోషించు తండ్రి గా
నందుఁ డేమి చేసె? నందితాత్మ.
         ఇలా శుకమహర్షి యశోద బాలకృష్ణుని ముద్దు చేస్తోంది అని చెప్పగా విని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.
         శుకమహర్షీ! నీవు ఆత్మానందం పొందిన వాడవు. ఈ లోకాలన్నిటికీ ప్రభువూ భగవంతుడూ అయిన శ్రీకృష్ణునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి యశోదాదేవి పూర్వజన్మలలో ఏమి నోములు నోచిందో? శ్రీ హరిని పొషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏమి తపస్సులు చేశాడో? 
10.1-349-vachanamu
anina vini raajiTlaniye.
10.1-350-aaTaveladi
jagadadheeshvarunakuM~ jannichchu talli gaa
nEmi nOmu nOM~che nee yashOda?
putruM~ Danuchu nataniM~ bOShiMchu taMDri gaa
naMduM~ DEmi chEse? naMditaatma.
         అనినన్ = అనగా; విని = విని; రాజు = పరీక్షిత్తు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
            జగదధీశ్వరున్ = హరి {జగదధీశ్వరుడు - జగత్ (లోకము) లన్నిటికి అధీశ్వరుడు (సర్వోత్కృష్ట అదిపతి), విష్ణువు}; కున్ = కి; చన్ను = చనుబాలు; ఇచ్చు = తాగించెడి; తల్లి = అమ్మ; కాన్ = అగుటకు; ఏమి = ఎట్టి; నోమున్ = నోములను; నోచెన్ = చేసెనో; ఈ = ఈ; యశోద = యశోద; పుత్రుడు = కుమారుడు; అనుచున్ = అంటూ; అతనిన్ = అతనిని; పోషింపన్ = పెంచుటకు; తండ్రి = తండ్రి; కాన్ = అగుటకు; నందుడు = నందుడు; ఏమి = ఎట్టి (పుణ్యములు); చేసెన్ = చేసెను; నందితాత్మ = శుకయోగి {నందితాత్మ - ఆనందమున ఉన్న ఆత్మ కలవాడు, శుకుడు}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Friday, April 10, 2015

కృష్ణలీలలు

10.1-347-వచనము
అని తన్ను పరమేశ్వరుండని తలంచుచున్న యశోద యందు నా కృష్ణుండు వైష్ణవమాయం బొందించిన.
10.1-348-కంద పద్యము
జడనుపడి యెఱుక చెడి యా
పడతుక సర్వాత్ముఁ డనుచుఁ బలుకక యతనిం
గొడుకని తొడపై నిడుకొని
కడు వేడుకతోడ మమతఁ గావించె నృపా!
         బాలకృష్ణుడు ఇలా తనను భగవంతుడైన శ్రీమహావిష్ణువుగా భావిస్తూ ఉన్న యశోదకు మళ్ళీ వైష్ణవమాయను ఆవరింపజేశాడు
         పరీక్షిన్మహారాజా! ఆ మాయా ప్రభావంవలన యశోద మోహం చెంది, బాలకృష్ణుడు సర్వాత్ముడే అనే విషయం మరచిపోయింది. అతడు తన కొడుకే అనుకుంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని చక్కగా ముద్దులాడింది
10.1-347-vachanamu
ani tannu paramEshvaruMDani talaMchuchunna yashOda yaMdu naa kRiShNuMDu vaiShNavamaayaM boMdiMchina.
10.1-348-kaMda padyamu
jaDanupaDi yeRruka cheDi yaa
paDatuka sarvaatmuM~ DanuchuM~ balukaka yataniM
goDukani toDapai niDukoni
kaDu vEDukatODa mamataM~ gaaviMche nRipaa!
          అని = అని; తన్ను = అతనిని; పరమేశ్వరుండు = భగవంతుడు; అని = అని; తలంచుచున్ = ఎంచుచున్నట్టి; యశోదన్ = యశోద; అందున్ = ఎడల; ఆ = ఆ; కృష్ణుండు = కృష్ణుడు; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; మాయన్ = మహిమను; పొందించినన్ = కలిగించగా.
          జడనుపడి = మూఢత్వములోపడిపోయి; ఎఱుక = ఙ్ఞానము; చెడి = పోయి; ఆ = ఆ; పడతుక = పడతి; సర్వాత్ముడు = విష్ణుమూర్తి; అనుచున్ = అనుచు; పలుకక = అనకుండా; అతనిన్ = అతనిని; కొడుకు = పుత్రుడు; అని = అని; తొడ = ఒడి; పైన్ = మీద; ఇడుకొని = పెట్టుకొని; కడు = మిక్కలి; వేడుక = కుతూహలము; తోడన్ = తోటి; మమతన్ = ప్రీతి; కావించెన్ = చేసెను; నృపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Thursday, April 9, 2015

కృష్ణలీలలు

10.1-346-కంద పద్యము
నా మగడు నేను గోవులు
నీ మందయు గోపజనులు నిబ్బాలుని నె
మ్మోమున నున్న విధముఁ గని
యేమఱితిమి గాక యీశుఁ డీతఁడు మాకున్.
          ఇలా ఈ కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొనిన యశోదాదేవి ఇలా స్తోత్రం చేస్తోంది. .
          ఈ బాలకుని నిండు ముఖాన్ని చూసి నేను, నా భర్త, ఈ వ్రేపల్లెలోని గోపగోపికా జనాలు అందరం, చివరకు గోవులుకూడ ఇతడు బాలుడే అని భ్రాంతి పడ్డాం కాని, ఇతడు మా కందరికి ప్రభువైన ఈశ్వరుడు అని గుర్తించలేకపోయాం.    
10.1-346-kaMda padyamu
naa magaDu nEnu gOvulu
nee maMdayu gOpajanulu nibbaaluni ne
mmOmuna nunna vidhamuM~ gani
yEmaRritimi gaaka yeeshuM~ DeetaM~Du maakun.
          నా = నా యొక్క; మగడు = భర్త; నేనున్ = నేను; గోవులున్ = పశువులు; ఈ = ఈ; మందయున్ = పల్లె; గోపజనులును = యాదవులు; ఈ = ఈ; బాలుని = పిల్లవాని; నెఱ = నిండైన; మోమునన్ = ముఖము నందు; ఉన్న = ఉన్న; విధమున్ = విధానమును; కని = చూసి; ఏమఱితిమి = భ్రమ పడితిమి; కాక = తప్పించి; ఈశుడు = భగవంతుడు; ఇతడున్ = ఇతను; మా = మా అందరి; కున్ = కి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Wednesday, April 8, 2015

కృష్ణలీలలు

10.1-344-వచనము
అని నిశ్చయించి.
10.1-345-ఆటవెలది
ఏ మహాత్మువలన నీ విశ్వరూపంబు
గానఁబడిన బుద్ధి కంప మయ్యె
నా మహాత్ము విష్ణు నఖిలలోకాధారు
నార్తులెల్లఁ బాయ నాశ్రయింతు.
          ఇలా ఈ కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొనిన యశోదాదేవి ఇలా స్తోత్రం చేస్తోంది. .
          విష్ణుమూర్తి అన్ని లోకాలకు ఆధారంగా నిలబడినవాడు. ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్న ఆ మహాత్ముడైన విష్ణువు వల్లనే నాకు ఈ విశ్వరూపం కనబడింది. నా బుద్ధి చలించిపోయింది. నా దుఃఖాలన్నీ పోవడానికి ఆ మహా విష్ణువునే శరణు కోరుతాను.  
10.1-344-vachanamu
ani nishchayiMchi.
10.1-345-aaTaveladi
E mahaatmuvalana nee vishvaroopaMbu
gaanaM~baDina buddhi kaMpa mayye
naa mahaatmu viShNu nakhilalOkaadhaaru
naartulellaM~ baaya naashrayiMtu.
          అని = అని; నిశ్చయించి = నిర్ణయించుకొని.
          ఏ = ఏ; మహాత్మున్ = గొప్పవాని; వలనన్ = వలన; ఈ = ఈ; విశ్వ = భువనభాండము యొక్క; రూపంబున్ = స్వరూపము; కానబడినన్ = కనబడుటచేత; బుద్ధి = మనసు; కంపము = చలించినది; అయ్యెన్ = అయినది; ఆ = అట్టి; మహాత్మున్ = గొప్పవానిని; విష్ణున్ = నారాయణుని; అఖిల = సమస్తమైన; లోక = భువనములకు; ఆధారున్ = ఆధారభూతుని; ఆర్తులు = పీడలు, దుఃఖములు; ఎల్లన్ = అన్నిటిని; పాయన్ = తొలగించుకొనుటకు; ఆశ్రయింతు = కొలచెదను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :