Monday, January 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౫(465)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-998-వ.
అదియునుం గాక, సకల భూతాత్మకుండ నైన యేను దపోవ్రత యజ్ఞ దాన శమ దమాదులచేత సంతసింపను; గురుజనంబులఁ బరమభక్తి సేవించువారలం బరిణమింతు” నని చెప్పి మఱియు “మనము గురుమందిరమున నున్న యెడ నొక్కనాఁడు గురుపత్నీ నియుక్తులమై యింధనార్థం బడవికిం జనిన నయ్యవసరంబున. 

భావము:
అంతే కాకుండా, సకల భూతాలలో ఆత్మగా ఉండు నేను తపోదానయజ్ఞాదులవల్ల సంతోషించను భక్తితో గురువును సేవించేవారిని ప్రేమిస్తాను.” ఇలా పలికి శ్రీకృష్ణుడు కుచేలుడితో మళ్ళీ ఇలా పలికాడు. “మనం గురువు గారి ఆశ్రమంలో ఉన్న దినాలలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాము. గుర్తుంది కదూ. ఆ సమయంలో... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=998 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Sunday, January 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౪(464)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-995-వ.
అమ్మహాత్మునివలన సకల వర్ణాశ్రమంబులవారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు గురుభజనంబు పరమధర్మం బని యాచరించితి; నదిగావున.
10.2-996-క.
భూసురులకెల్ల ముఖ్యుఁడ
నై సకల కులాశ్రమంబు లందును నెపుడున్
ధీసుజ్ఞానప్రదుఁ డన
దేశికుఁ డన నొప్పుచుందు ధృతి నెల్లెడలన్.
10.2-997-తే.
అట్టి వర్ణాశ్రమంబులయందు నర్థ
కుశలు లగువారు నిఖిలైక గురుఁడ నైన
నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచ
దాఁటుదురు మత్పదాంబుజ ధ్యానపరులు. 

భావము:
సకల వర్ణాశ్రమాలవారికీ నేను నిజానికి విజ్ఞానప్రదాత అయిన గురువును అయినా గురుసేవ అత్యున్నత ధర్మము అని బోధించడం కోసం నేను కూడ గురుసేవ చేసాను. అందుచేత బ్రాహ్మణులలో కెల్లా ముఖ్యుడను అయి, సకల వర్ణాలకూ ఆశ్రమాలకూ జ్ఞానప్రదాతను అయి నేను ప్రకాశిస్తూ ఉంటాను. ఆ సకల వర్ణాలకు చెందిన జ్ఞానులు, లోకాలు సమస్తానికి గురుడనైన నా పలుకులను ఆలకించి, నా పాదపద్మాలను ధ్యానిస్తూ సంసార సాగరాన్ని దాటుతారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=997 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Saturday, January 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౩(463)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-992-క.
"ఎఱుఁగుదువె? మనము గురు మం
దిరమున వసియించి యతఁడు దెలుపఁగ వరుస
న్నెఱుఁగఁగ వలసిన యర్థము
లెఱిఁగి పరిజ్ఞానమహిమ లెఱుఁగుట లెల్లన్. "
10.2-993-వ.
అని మఱియు గురుప్రశంస సేయం దలంచి యిట్లనియె.
10.2-994-తే.
తివిరి యజ్ఞానతిమిర ప్రదీపమగుచు
నవ్యయంబైన బ్రహ్మంబు ననుభవించు
భరితసత్త్వుండు సత్కర్మనిరతుఁ డతుల
భూసురశ్రేష్ఠుఁ డలఘుండు బుధనుతుండు 

భావము:
“మనం గురువుగారి నివాసంలో ఉన్నప్పుడు ఆచార్యుడు బోధించగా నేర్చుకోవలసినవి మనం వరుసగా నేర్చుకుని గొప్ప విజ్ఞానము గడించిన సంగతి నీకు జ్ఞాపకం ఉందా?” ఇలా కుచేలుని పలకరిస్తున్న శ్రీకృష్ణుడు గురుప్రశంస చేయదలచి ఇలా అన్నాడు. “మన గురువు అజ్ఞానం అనే చీకటికి దీపం లాంటివాడు; బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు; సత్కర్మ పరాయణుడు; బ్రాహ్మణ శ్రేష్ఠుడు; పుణ్యాత్ముడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=994 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Thursday, January 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౨(462)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-989-క.
మురసంహరుఁడు కుచేలుని
కరము గరంబునఁ దెమల్చి కడఁకన్ మన మా
గురుగృహమున వర్తించిన
చరితము లని కొన్ని నుడివి చతురత మఱియున్
10.2-990-సీ.
"బ్రాహ్మణోత్తమ! వేదపాఠనలబ్ధ ద;
క్షత గల చారువంశంబు వలనఁ
బరిణయంబైనట్టి భార్య సుశీలవ;
ర్తనములఁ దగభవత్సదృశ యగునె?
తలఁప గృహక్షేత్ర ధనదార పుత్త్రాదు;
లందు నీ చిత్తంబు సెందకుంట
తోఁచుచున్నది; యేనుదుది లోకసంగ్రహా;
ర్థంబు కర్మాచరణంబుసేయు
10.2-990.1-తే.
గతి, మనంబులఁ గామమోహితులు గాక
యర్థిమై యుక్తకర్మంబు లాచరించి
ప్రకృతి సంబంధములు వాసి భవ్యనిష్ఠ
దవిలియుందురు కొంద ఱుత్తములు భువిని. " 

భావము:
కృష్ణుడు ప్రేమతో కుచేలుడి చేతిలో తన చేయి వేసి పట్టుకుని, తాము గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన విశేషాలను ప్రస్తావించి, కృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు. “ఓ భూసురోత్తమా! చక్కటి వేద పండితుల వంశంలో పుట్టిన సద్గుణశాలి అయిన నీ భార్య నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు గృహక్షేత్రాల మీద, భార్యాపుత్రుల మీద లగ్నమైనట్లు కనిపించుట లేదు. లోకకల్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు లోకంలో కొందరు ఉత్తములు కామమోహాలకు వశం కాకుండా తమ విధ్యుక్తధర్మాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్య నిష్ఠతో జీవిస్తారు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=990 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Wednesday, January 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౧(461)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-985-ఉ.
ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్
బామున! యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్?
10.2-987-చ.
తన మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం
దును నెడఁగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదముం
దనుకఁగఁ గౌఁగిలించి యుచితక్రియలం బరితుష్టుఁ జేయుచున్
వినయమునన్ భజించె; ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుడో? " 

భావము:
“ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎంతటి తపస్సు చేసాడో? మహా యోగులచేత పూజింపబడే శ్రీపతి పరుండు పానుపు మీద అధివసించాడు. ఎంతటి మహామునులు అయినా ఈ మహానుభావునికి సాటిరారు కదా. తన మృదుతల్పం మీద ఉన్న రుక్మిణీదేవి సాంగత్యానికి ఎడబాటు అని కూడా చూడకుండా, శ్రీకృష్ణుడు లేచి వెళ్ళి విప్రోత్తమునికి స్వాగతం చెప్పాడు. ప్రేమతో అతడిని కౌగలించుకున్నాడు. సముచితంగా సత్కరించాడు. ఎంతో వినయంగా పూజించాడు. ఇంతటి గౌరవం పొందిన ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=987 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Tuesday, January 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౦(460)


( కుచేలుని ఆదరించుట )

10.2-984-వ.
సురభికుసుమ మాలికలు సిగముడిం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు నిడి, ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పు డవ్విప్రుండు మేనం బులకాంకురంబు లంకురింప నానందబాష్ప జలబిందు సందోహుం డయ్యె; నట్టియెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి కరకంకణ రవంబు లొలయం జామరలు వీవం దజ్జాత వాతంబున ఘర్మసలిలంబు నివారించుచుండఁ జూచి శుద్ధాంత కాంతానివహంబులు దమ మనంబుల నద్భుతం బంది యిట్లనిరి.

భావము:
కుచేలుడి సిగలో పూలదండలు ముడిచి, కర్పూరతాంబూలం ఇచ్చి, గోదానం చేసి, ఆదరంగా కుశలప్రశ్నలు అడిగాడు. అప్పుడు కుచేలుడి శరీరం పులకించింది, కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్మిణి చేతి కంకణాలు ఘల్లుఘల్లు మంటుంటే వింజామరము వీచింది. ఆ చల్లని గాలికి కుచేలుని మార్గాయాసం తీరింది. ఈ దృశ్యాన్ని చూసిన అంతఃపురకాంతలు విస్మయంతో ఇలా అనుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=984

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, January 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౯(459)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-982-తే.
అట్లు గూర్చుండఁ బెట్టి నెయ్యమునఁ గనక
కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భక్తిఁ
దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి
లలిత మృగమద ఘనసార మిళిత మైన.
10.2-983-తే.
మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత
శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి
బంధురామోదకలిత ధూపంబు లొసఁగి
మించు మణిదీపముల నివాళించి మఱియు. 

భావము:
అలా కుచేలుడిని కూర్చుండ బెట్టి, పిమ్మట శ్రీకృష్ణుడు బంగారు కలశంలో నీళ్ళు తీసుకు వచ్చి ఆయన పాదాలను కడిగాడు. ఆ జలాన్ని భక్తితో శిరస్సు మీద చల్లుకున్నాడు. పిమ్మట మనోహర మైన కస్తూరి, పచ్చకర్పూరపు మైపూతలు తీసుకుని ఆ మనోజ్ఞ మైపూతలు కుచేలుని శరీరానికి ప్రీతితో అలది, మార్గాయాసం తీరేలా స్వయంగా ఆప్తమిత్రుడు కుచేలునికి విసన కఱ్ఱతో విసిరాడు. అగరధూపం వేసి, మణిమయ దీపాలతో నివాళులు అర్పించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=983 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Sunday, January 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౮(458)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-980-మ.
కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళత్కంజాక్షుఁ డప్పేద వి
ప్రుని నశ్రాంత దరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్
ఘనతృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖండోత్తరీయుం గుచే
లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్.
10.2-981-క.
కర మర్థి నెదురుగాఁ జని
పరిరంభణ మాచరించి, బంధుస్నేహ
స్ఫురణం దోడ్తెచ్చి, సమా
దరమునఁ గూర్పుండఁ బెట్టెఁ దన తల్పమునన్. 

భావము:
కుచేలుడు కృష్ణుడి దగ్గరకు వెళ్తుండగా. నిరంతర దారిద్ర్య పీడితుడూ; కృశించిన అంగములు కలవాడూ; చినిగిన వస్త్రములు ధరించినవాడూ; ఆశాపూరిత చిత్తుడూ; హాస్యానికి చిరునామా ఐన వాడు; అయిన కుచేలుడు వస్తుంటే అల్లంత దూరంలో చూసిన పద్మాల రేకుల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు ఎంతో సంభ్రమంగా గబగబా పానుపు దిగాడు. ఆదరాభిమానాలతో కుచేలుని కెదురుగా వెళ్ళి శ్రీకృష్ణుడు అతనిని కౌగలించుకున్నాడు. స్నేహ పూర్వక అనురాగం ఉట్టిపడేలా స్వాగతం పలికి ఆప్యాయంగా తోడ్కొనివచ్చి తన పాన్పు మీద కూర్చుండ బెట్టాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=981 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, January 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౭(457)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-979-సీ.
ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ;
గరుణాలవాలు, భాసుర కపోలుఁ
గౌస్తుభాలంకారుఁ, గామితమందారు;
సురచిరలావణ్యు, సుర శరణ్యు
హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు;
ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు,
ఖగకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ;
బన్నగశయను, నబ్జాతనయను,
10.2-979.1-తే.
మకరకుండల సద్భూషు, మంజుభాషు
నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు,
భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు,
విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు 

భావము:
నల్లకలువలవంటి శ్యామలవర్ణం వాడూ; దేవేంద్రునిచేత పొగడబడేవాడూ; కృపకు నిలయమైనవాడూ; ప్రకాశించే చెక్కిళ్ళు కలవాడూ; కౌస్తుభాన్ని ధరించిన వాడూ; ఆర్ధులకు కల్పవృక్షం వంటివాడూ; సౌందర్యమూర్తీ; దేవతలకు దిక్కయినవాడూ; సింహమధ్యముడూ; సకల లోకాల యందు పూజింపబడువాడూ; చక్రాయుధుడూ; జగత్తులో పేరెన్నిక గలవాడూ; గరుడవాహనుడూ; పీతాంబరధారీ; ఆదిశేషునిపై శయనించేవాడూ; అరవిందాక్షుడూ; మకరకుండల భూషణుడూ; మధుర భాషణుడూ; సాటిలేని మేటి సౌందర్యం కలవాడూ; పాలసముద్రంలో విహరించే వాడూ; సుగుణ సాంద్రుడూ; యాదవకుల మనే సాగరానికి చంద్రుడూ; సర్వ వ్యాపకుడూ; ప్రకాశ వంతుడూ; జయ శీలుడూ; సహన శీలుడు అయిన శ్రీకృష్ణుడు ఆయనకు కనిపించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=979 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Friday, January 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౬(456)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-978-సీ.
విశదమై యొప్పు షోడశసహస్రాంగనా;
కలితవిలాస సంగతిఁ దనర్చి
మహనీయ తపనీయ మణిమయగోపుర;
ప్రాసాద సౌధ హర్మ్యములు సూచి,
మనము బ్రహ్మానందమును బొందఁ గడు నుబ్బి;
సంతోషబాష్పముల్‌ జడిగొనంగఁ
బ్రకటమై విలసిల్లు నొక వధూమణి మంది;
రమున నింతులు చామరములు వీవఁ
10.2-978.1-తే.
దనరు మృదుహంసతూలికా తల్పమందుఁ
దానుఁ బ్రియయును బహు వినోదములఁ దనరి
మహితలావణ్య మన్మథమన్మథుండు
ననఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు 

భావము:
శ్రీకృష్ణుని పదహారువేల సతులతో ప్రకాశిస్తున్న సుందర సమున్నత మణిమయ స్వర్ణసౌధాలను చూసి కుచేలుడు పరమానందం చెందాడు. అతని కళ్ళలో ఆనందబాష్పాలు స్రవించాయి. ఒక అంగన మందిరంలో మగువలు వింజామరలు వీస్తుండగా హంసతూలికాతల్పం మీద శ్రీకృష్ణుడు సతీమణితో సరసాలాడుతున్నాడు. ఆ మన్మథమన్మథుడైన మనోహర సౌందర్యమూర్తిని పద్మాక్షుని దర్శించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=978 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Thursday, January 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౫(455)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-976-సీ.
"ద్వారకానగరంబు నే రీతిఁ జొత్తును? ;
భాసురాంతఃపురవాసి యైన
యప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగి;
దర్శింపఁ గలనొ? తద్ద్వారపాలు
"రెక్కడి విప్రుఁడ? విం దేల వచ్చెద?" ;
వని యడ్డ పెట్టిరే నపుడు వారి
కే మైనఁ బరిదాన మిచ్చి చొచ్చెద నన్న;
నూహింప నర్థశూన్యుండ నేను;
10.2-976.1-తే.
నయిన నా భాగ్య; మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండు గలదె? యాతఁ
డేల నన్ను నుపేక్షించు? నేటిమాట?"
లనుచు నా ద్వారకాపుర మతఁడు సొచ్చి.
10.2-977-వ.
ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జనిచని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట. 

భావము:
“ద్వారకలోనికి నేను ఎలా వెళ్ళగలను? అత్యంత ప్రభావవంత మైన అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణుడి దర్శనం ఎలా లభిస్తుంది? ఒకవేళ ద్వారపాలకులు “నీవెక్కడ బ్రాహ్మణుడవయ్యా! ఇక్కడకి ఎందుకు వచ్చావయ్యా” అని నన్ను అడ్డగిస్తే నేనేమి చేయగలను? వారికి ఏదయినా బహుమానం ఇద్దామన్నా నేను కటికదరిద్రుడినే. ఏమివ్వగలను? ఇంతకూ నా అదృష్టం ఎలా ఉందో? అయినా, ఆ శ్రీకృష్ణుని కృపాకటాక్షం తప్ప మరొక మార్గం ఏమున్నది? ఆయన నన్నెందుకు ఉపేక్షిస్తాడు?” ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారక ప్రవేశించాడు. ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారకాపట్టణం రాజమార్గాన ముందుకు సాగిపోయి, కొన్ని ప్రాకారాలు దాటాక అక్కడ.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=976 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Wednesday, January 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౪(454)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-973-తే.
"నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట
పరమశోభన మా చక్రపాణి కిపుడు
గాను కేమైనఁ గొంపోవఁ గలదె మనకు? "
10.2-974-తే.
అనిన నయ్యింతి "యౌఁగాక" యనుచు విభుని
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.
10.2-975-వ.
అట్లు సనుచుం దన మనంబున. 

భావము:
“నీ వన్నట్లు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం పరమ కల్యాణప్రదమే. కాని చక్రి దగ్గఱకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి కానుక ఏదయినా మన వద్ద ఉందా.” భర్త అభిప్రాయం అంగీకరించిన కుచేలుని భార్య “అలాగే కానివ్వండి” అంది. పిమ్మట అతని చినిగిన పైట కొంగులో కొన్ని అటుకులు ముడివేసి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవింద దర్శనం అవుతుందనే ఉత్సాహంతో బయలుదేరాడు. ద్వారకకు వెళుతూ దారిలోకుచేలుడు తనలో ఇలా అనుకోసాగాడు.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=974 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Tuesday, January 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౩(453)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-971-మ.
కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడై నట్టి దు
ర్బలుఁ డాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు లుల్లంబులోఁ
దలఁపన్నంతన మెచ్చి యార్తిహరుఁడై తన్నైన నిచ్చున్; సుని
శ్చలభక్తిన్ భజియించు వారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్‌? "
10.2-972-క.
అని చెప్పిన నమ్మానిని
సునయోక్తుల కలరి భూమిసురుఁ డా కృష్ణుం
గన నేఁగుట యిహపర సా
ధనమగు నని మదిఁ దలంచి తన సతితోడన్. 

భావము:
కలలోకూడా తన్నెన్నడూ స్మరించని పాపాత్ముడు అయినా, ఆపదలు చుట్టుముట్టి నప్పుడు, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ ఆశ్రిత రక్షకుడి పాదారవిందాలను మనసారా స్మరిస్తే చాలు. ఎలాంటి వాడిని అయినా కనికరిస్తాడు. అవసరమైతే తనను తానే అర్పించుకుంటాడు కదా. అంతటి మహానీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే మీవంటి వారికి విశేషమైన సంపదలు ఇవ్వకుండా ఉంటాడా?” ఈ మాదిరి చెప్తున్న ఆ ఇల్లాలి మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్ళడం ఇహపర సాధనమని మనసులో అనుకుని, తన భార్యతో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=972 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Monday, January 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౨(452)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-967-వ.
అని మఱియు నిట్లనియె.
10.2-968-తే.
"బాలసఖుఁడైన యప్పద్మపత్త్రనేత్రుఁ
గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను
లైన మము నుద్ధరింపుము; హరికృపా క
టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ! నీవు.
10.2-969-వ.
మఱియును.
10.2-970-చ.
వరదుఁడు సాధుభక్తజనవత్సలుఁ డార్తశరణ్యుఁ డిందిరా
వరుఁడు దయాపయోధి భగవంతుఁడు కృష్ణుఁడు దాఁ గుశస్థలీ
పురమున యాదవప్రకరముల్‌ భజియింపఁగ నున్నవాఁడు; నీ
వరిగిన నిన్నుఁ జూచి విభుఁ డప్పుడ యిచ్చు ననూన సంపదల్‌. 

భావము:
అని శోకంతో పలికి భర్తతో ఇంకా ఇలా అన్నది. “మహానుభావ! శ్రీకృష్ణుడు మీ బాల్యసఖుడు కదా. మీరు వెళ్ళి ఆ మహానుభావుడిని దర్శించండి. అతని కృపాకటాక్షం పొంది, దారిద్ర్యంతో తల్లడిల్లుతున్న పిల్లలను, నన్ను కాపాడండి. శ్రీకృష్ణుడు ఆశ్రితులను రక్షించేవాడు; సజ్జనుల ఎడ, భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు; దయాసాగరుడు; యాదవులు తనను సేవిస్తుండగా, కుశస్థలీపురములో ఉన్నాడు కదా. ఒక్కసారి, ఆ శ్రీపతిని దర్శించండి. మిమ్మల్ని చూస్తే చాలు వెంటనే ప్రభువు మీకు అనంతమైన సంపదలు అనుగ్రహిస్తాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=970 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Sunday, January 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౧(451)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-965-సీ.
అనుడు వేదవ్యాసతనయుఁ డా యభిమన్యు;
తనయునిఁ జూచి యిట్లనియెఁ బ్రీతి
"జనవర! గోవింద సఖుఁడు కుచేలుండు;
నా నొప్పు విప్రుండు మానధనుఁడు
విజ్ఞాని రాగాది విరహితస్వాంతుండు;
శాంతుండు ధర్మవత్సలుఁడు ఘనుఁడు
విజితేంద్రియుఁడు బ్రహ్మవేత్త దారిద్య్రంబు;
బాధింప నొరులఁ గార్పణ్యవృత్తి
10.2-965.1-తే.
నడుగఁ బోవక తనకుఁ దా నబ్బినట్టి
కాసు పదివేల నిష్కముల్‌ గాఁ దలంచి
యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష
యొక విధంబున నడుపుచు నుండు; నంత
10.2-966-సీ.
లలితపతివ్రతా తిలకంబు వంశాభి;
జాత్య తద్భార్య దుస్సహ దరిద్ర
పీడచేఁ గడు నొచ్చి పెదవులు దడుపుచు;
శిశువు లాఁకటి చిచ్చుచేఁ గృశించి
మలమల మాఁడుచు మానసం బెరియంగఁ;
బట్టెఁ డోరెము మాకుఁ బెట్టు మనుచుఁ
బత్త్రభాజనధృతపాణులై తనుఁ జేరి;
వేఁడిన వీనులుసూఁడినట్ల
10.2-966.1-ఆ.
యైన నొకనాఁడు వగచి నిజాధినాథుఁ
జేరి యిట్లని పలికె "నో జీవితేశ!
తట్టుముట్టాడు నిట్టి పేదఱిక మిట్లు
నొంప దీని కుపాయ మూహింప వైతి. " 

భావము:
ఇలా అడిగిన ఆ అభిమన్య పుత్రునితో, వేదవ్యాస మహర్షి పుత్రుడు శుకుడు సంతోషంతో ఇలా అన్నాడు. “ఓ మహారాజా! కుచేలుడు అని శ్రీకృష్ణునికి ఒక బాల్యమిత్రుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు, అభిమానధనుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన ఇంట దారిద్ర్యం దారుణంగా తాండవిస్తున్నా, ఎవరినీ దీనంగా యాచించి ఎరుగడు. తనంత తానుగా ప్రాప్తించిన కాసును కూడా పదివేలుగా భావించి, ఏదో ఒక విధంగా భార్యాపుత్రులను పోషిస్తూ వస్తున్నాడు. కుచేలుని భార్య మహాపతివ్రత. చక్కటి వంశంలో పుట్టిని సాధ్వి. బిడ్డలు ఆకలి మంట చేత కృశించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులూ గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నం పెట్టమని అడుగుతుంటే, ఆమె మనసు క్షోభ భరించలేకపోతోంది. అందుకని, ఆమె భర్తతో “ప్రాణేశ్వరా! ఇలా తాండవిస్తూ ఉన్న పేదరికం బాగా బాధిస్తోంది కదా. దీని గురించి మీరు ఆలోచించడం లేదు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=966 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, January 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౦(450)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-963-చ.
హరిభజియించుహస్తములుహస్తము; లచ్యుతుఁగోరి మ్రొక్కు త
చ్ఛిరము శిరంబు; చక్రధరుఁ జేరిన చిత్తము చిత్త; మిందిరా
వరుఁగను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య
క్షరుకథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుఁబో భువిన్.
10.2-964-క.
హరిపాదతీర్థ సేవా
పరుఁడై విలసిల్లునట్టి భాగవతుని వి
స్ఫురితాంగము లంగము; లా
పరమేశ్వరు నెఱుఁగ నాకుఁ బలుకు మునీంద్రా! " 

భావము:
హరిని పూజించే చేతులే చేతులు; అచ్యుతునికి నమస్కరించే శిరస్సే శిరస్సు; ఆ చక్రధారుని చూసే కన్నులే కన్నులు; ఆ లక్ష్మీపతిని పొగడే నోరే నోరు; ఆ శాశ్వతుని కథలను వినే చెవులే చెవులు. ఓ మునీశ్వరా! శ్రీహరి పాదపద్మాలు అనే తీర్థాలను సేవించి ధన్యుడైన భాగవతుని అంగములే అంగములు. ఆ పరమాత్ముని తెలుసుకొనే మార్గం నాకు విశదీకరించి చెప్పవలసినది.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=964 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Wednesday, January 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౯(449)


( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-960-క.
హలధరు డమర్త్య చరితుం
డలఘు భుజాబలుఁ డొనర్చు నద్భుత కర్మం
బులు పెక్కు నాల్గు మోములు
గల మేటియు లెక్క పెట్టఁ గలఁడె నరేంద్రా! "
10.2-961-చ.
అనిన మునీంద్రుఁ గన్గొని ధరాధిపుఁ డిట్లను "పద్మపత్త్రలో
చనుని యనంత వీర్యగుణ సంపద వేమఱు విన్న నైననుం
దనియదు చిత్త మచ్యుతకథావిభవం బొకమాటు వీనులన్
వినిన మనోజపుష్ప శరవిద్ధుఁడు నైన విరామ మొందునే?
10.2-962-వ.
అదియునుం గాక. 

భావము:
“ఓ మహారాజా! పరీక్షిత్తు! హాలాయుధుడూ, దివ్యచారిత్రుడూ, భుజబల సంపన్నుడూ అయిన బలరాముడి అద్భుత కార్యాలను పొగడడానికి నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడి కైనా సాధ్యంకాదు.” అలా చెప్పిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు “అంబుజాక్షుని అనంత గుణ సంపదలను గురించీ, పరాక్రమ ప్రాశస్త్యాలను గురించీ, ఎన్ని మార్లు విన్నా తనివితీరదు. ఒక్కసారి విష్ణు కథా వైభవాన్ని వింటే చాలు, ఎంత మన్మథ వికార పీడితు డైనా సరే మరీ మరీ వినకుండా ఉండ లేడు. అంతేకాకుండా.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=961 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Tuesday, January 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౮(448)

( బలుడు పల్వలుని వధించుట ) 

10.2-958-చ.
విలసిత మాల్య చందన నవీన విభూషణ రత్న వస్త్రముల్‌
పొలుపుగఁ దాల్చి యంచిత విభూతిఁ దలిర్చెను బూర్ణచంద్రికా
కలిత సుధాంశురేఖ నెసకం బెసఁగన్ నిజబంధులోచనో
త్పలచయ ముల్లసిల్లఁ బరిపాండుర చారు యశోవిలాసుఁడై.
10.2-959-వ.
ఇవ్విధంబున ననంతుండు నప్రమేయుండును మాయామానుష విగ్రహుండు నసంఖ్యబలశాలియు నైన బలదేవుం డతివైభంబున నిజపురంబు ప్రవేశించి సుఖంబుండె” నని చెప్పి యిట్లనియె. 

భావము:
బలరాముడు పూలదండలు వేసుకుని, చందనం అలదుకొని, వినూత్న వస్త్రాభరణాలను ధరించాడు. అప్పుడు బలరాముడు నిండు పున్నమి చంద్రుడిలా, పరిపూర్ణ యశోభిరాముడై, బందువుల నేత్రాలనే కలువలకు వికాసం కలిగించాడు. ఆ విధంగా అంతులేని మహాబలశాలీ, మాయా మానుష వేషధారీ, అనంతుడు, మేరలేని వాడు, ఆదిశేషుని అపర అవతారుడు అయిన బలరాముడు మిక్కిలి వైభవంతో ద్వారకానగరం ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. అని శుకబ్రహ్మ చెప్పి, మరల పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=959 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Monday, January 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౭(447)

( బలుడు పల్వలుని వధించుట ) 

10.2-957-వ.
ఎట్లుగావలయు నట్ల యయ్యెడుం గాక" యని; యచ్చోట నిలువక యుగ్రసేనాది బంధుప్రకరంబులు పరితోషంబున నెదుర్కొన ద్వారకాపురంబు సొచ్చి; యందుండి మగిడి నైమిశారణ్యంబు నకుం జని; యందుల మునిపుంగవు లనుమతింప నచ్చట నొక మఖంబు గావించి బహుదక్షిణ లొసంగి; యంచితజ్ఞానపరిపూర్ణు లగునట్లుగా వరంబిచ్చి; రేవతియునుం దానును బంధు జ్ఞాతి యుతంబుగా నవభృథస్నానం బాచరించి; యనంతరంబ. 

భావము:
“వీరు పోరు విడుచుట లేదు, శుభాశుభములు ఏమగునో? కానున్నది కాకమానదు కదా.” అని, అక్కడ నిలువలేక ద్వారకానగరానికి వెళ్ళిపోయాడు. ఉగ్రసేనాది బంధువులు అందరు బలరాముడికి ఆదరంగా స్వాగతం పలికారు. అతడు అక్కడ కొన్నాళ్ళుండి, మళ్ళీ నైమిశారణ్యానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞంచేసి భూరిదక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి పరచాడు. వారికి సుజ్ఞానులు కమ్మని వరం అనుగ్రహించాడు. పిమ్మట, భార్య రేవతితోనూ, బంధువులతోనూ కలసి అవభృథస్నానం చేసాడు. అటు తరువాత... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=957 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Sunday, January 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౬(446)

( బలుడు పల్వలుని వధించుట ) 

10.2-954-తే.
ధర్మనందనుఁ దనకు వందనము సేయు
కృష్ణు నరు మాద్రిసుతుల నీక్షించి యేమి
పలుక కుగ్ర గదాదండపాణు లగుచుఁ
గ్రోధమునఁ బోరు భీమ దుర్యోధనులను.
10.2-955-వ.
చూచి వారల డాయం జని యిట్లనియె.
10.2-956-సీ.
"వీరపుంగవులార! వినుఁడు; మీలోపల-
  భూరిభుజాసత్త్వమున నొకండు
ప్రకటితాభ్యాస సంపద్విశేషంబున-
  నొక్కండు యధికుఁడై యుంటఁ జేసి
సమబలు; లటు గాన చర్చింపఁగా నిందు-
  జయ మొక్కనికి లేదు సమరమందుఁ;
గాన యూరక పోరఁగా నేల మీ"కని-
  వారింప నన్యోన్య వైరములను
10.2-956.1-తే.
నడరి తొల్లింటి దుర్భాష లాత్మలందుఁ
దలఁచి తద్భాషణము లపథ్యములు గాఁగ
మొక్కలంబునఁ బోర నా ముష్టికాసు
రారి వీక్షించి "వీరి శుభాశుభములు, 

భావము:
అక్కడ ధర్మరాజుని మఱియు తనకు నమస్కరిస్తున్న శ్రీకృష్ణ, అర్జున, నకుల, సహదేవాదులను గమనించి కూడ మాట్లాడకుండా, భీకరమైన గదలు చేతబట్టి కయ్యానికి కాలు దువ్వుతున్న భీమదుర్యోధనులను చూసి అలా యుద్ధ సన్నధులు అయిన భీమదుర్యోధనుల వద్దకు బలరాముడు వెళ్ళి ఇలా అన్నాడు. “మేటివీరులారా! నా మాట వినండి. మీలోఒకడు భుజబలంలో అధికుడు; మరొకడు అభ్యాస నైపుణ్యంలో శ్రేష్ఠుడు. మీరిద్దరూ సమానులు మీలో ఎవరూ ఎవరినీ గెలువలేరు. అయినా ఊరక యుద్ధానికి పూనుకోవడం దేనికి” అంటూ బలరాముడు వారిని వారింప చూసాడు. కాని, పాత పగలను మనసులో ఉంచుకున్న భీమదుర్యోధనులు బలరాముడి హితవచనాలను ఆలకించ లేదు. వారు పౌరుషంతో పోరాడటానికే నిశ్చయించారు. అది గమనించిన బలరాముడు వారి గురించి... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=956 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Saturday, January 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౫(445)

( బలుడు పల్వలుని వధించుట ) 

10.2-953-వ.
అచ్చోటు వాసి వృషభాద్రి నెక్కి, హరిక్షేత్రంబు ద్రొక్కి, మధురాపురంబున కరిగి, సేతుబంధనంబు మెట్టి, యచటం బదివేల పాఁడిమొదవుల భూసురుల కిచ్చి, రామేశ్వరుం దర్శించి, తామ్రపర్ణికిం జని, మలయాచలంబెక్కి, యగస్త్యునింగని నమస్కరించి, దక్షిణసముద్రంబు దర్శించి, కన్యాఖ్యదుర్గాదేవి నుపాసించి, పంచాప్సరంబను తీర్థంబున నాప్లవనం బాచరించి, గోకర్ణంబున నిందుమౌళిని దర్శించి, ద్వీపవతి యైన కామదేవిని వీక్షించి, తాపింబయోష్ణిని దర్శించి, నిర్వింధ్యంబు గడచి, దండకావనంబున కరిగి, మాహిష్మతీపురంబున వసియించి, మనుతీర్థం బాడి, క్రమ్మఱం బ్రభాసతీర్థంబునకు వచ్చి యచ్చటి బ్రాహ్మణ జనంబుల వలనఁ బాండవధార్తరాష్ట్రుల భండనంబు నందు సకలరాజలోకంబు పరలోకగతు లగుటయు, వాయునందన సుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులై యుండుటయు నెఱింగి వారల వారించు తలంపున నచటికిం జని. 

భావము:
బలరాముడు అక్కడ నుండి వృషభాద్రికి వెళ్ళి, హరిక్షేత్రము, మధుర, సేతుబంధం దర్శించి, అక్కడ బ్రాహ్మణులకు పదివేల పాడిఆవులను దానం చేసాడు. రామేశ్వరం తామ్రపర్ణి చూసాడు. మలయాచలం ఎక్కి, అక్కడ అగస్త్యుడికి మ్రొక్కాడు. దక్షిణసముద్రము చేరి, కన్యాకుమారి పేర వెలసి ఉన్న దుర్గాదేవిని దర్శించి, గోకర్ణక్షేత్రంలో పరమేశ్వరుడిని దర్శించి, కామదేవి నదిని, తాపి యందలి పయోష్ణి నదిని దర్శించి. నిర్వింధ్యను దాటి, దండకాటవిని గడచి, మహిష్మతీ పురము ప్రవేశించాడు. మనుతీర్థంలో స్నానం చేసి పిమ్మట ప్రభాసతీర్థానికి వెళ్ళాడు. అక్కడి బ్రాహ్మణుల వలన కౌరవపాండవ సంగ్రామంలో రాజులు అందరూ హతులు అయ్యారనీ, భీమదుర్యోధనులు గదాయుద్ధానికి సన్నద్ధులు అవుతున్నారనీ తెలుసుకుని, వారిని చూడడానికి వెళ్ళాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=953 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Friday, January 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౪(444)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-950-ఆ.
కని నమస్కరించి కౌతుకం బలరార
నతని వీడుకొని హలాయుధుండు
గొమరుమిగిలి సప్తగోదావరికి నేఁగి
యందుఁ దీర్థమాడి యచటు గదలి.
10.2-951-వ.
వేణీపంపాసరస్సులంజూచి, భీమనదికేఁగి యందుఁ గుమారస్వామిని దర్శించి, శ్రీశైలంబునకుఁ జని, వేంకటాచలంబు దర్శించి, కామకోటి శక్తిని నిరీక్షించి, కాంచీపురంబుం గాంచి, కావేరికిం జని యమ్మహావాహిని నవగాహనంబు సేసి.
10.2-952-స్రగ్ద.
సేవించెన్ రంగధామున్ శ్రితనివహపయస్సింధుసంపూర్ణసోముం
గావేరీ మధ్యసీమున్ ఘనకలుష మహాకాలకూటోగ్ర భీమున్
దేవారిశ్రీ విరామున్ దివిజవినుత సందీపితానంత నామున్
ధీవిజ్ఞానాభిరాముం ద్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్. 

భావము:
పరశురాముడికి ప్రణామాలర్పించి, బలరాముడు అతడి వద్ద సెలవు తెలుసుకుని సప్తగోదావరికి వెళ్ళి అందులో స్నానం చేసాడు. అక్కడ నుండి బయలుదేరి బలరాముడు పిమ్మట వేణీనదిని పంపానదిని దర్శించాడు. భీమానది చేరి అక్కడ వెలసిన కుమారస్వామి దర్శనం చేసుకుని, శ్రీశైలం, తిరుమల దర్శించాడు. కాంచీపురం కామాక్షిని చూసాడు. అక్కడనుండి కావేరికి వెళ్ళి ఆ మహానదిలో స్నానం చేసాడు. బలరాముడు ఆ కావేరీ నదీమధ్యంలో వెలసిన శ్రీరంగం చేరాడు. ఆశ్రితులనే పాలసముద్రానికి పూర్ణచంద్రుని వంటివాడూ; కలుషాలను కబళించేవాడూ; రాక్షసుల సంపదలను హరించేవాడూ; జ్ఞానుల మనసులు అలరించేవాడు; అమరులు వినుతించే అనంత నామాలు కలవాడూ; ముల్లోకాల లోని సకల దేవతలకు అధినాథుడూ; అయిన శ్రీరంగనాథుడిని సేవించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=952 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Thursday, January 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౨(442)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-946-తే.
అంత నభిషిక్తుఁ జేసి యత్యంత సురభి
మంజులామ్లాన కంజాత మాలికయును
నంచితాభరణములు దివ్యాంబరములు
నర్థి నిచ్చినఁ దాల్చి యా హలధరుండు.
10.2-947-క.
దేవేంద్రుఁ బోలి యొప్పెను
ధీవిలసితుఁ డగుచు మునితతిన్ వీడ్కొని తన్
సేవించుచుఁ గతిపయ వి
ప్రావలి సనుదేరఁ గౌశికాఖ్యంబునకున్. 

భావము:
మునులు బలరాముడిని పవిత్ర తీర్ధజలాలతో అభిషిక్తుణ్ణి చేసారు. సుగంధాలు విరజిమ్మే సుందర సుకుమార పద్మమాలికతో అలంకరించారు. చక్కని ఆభరణాలనూ ప్రశస్తములైన వస్త్రాలనూ ప్రీతితో ఇచ్చారు బలరాముడు వాటిని ధరించాడు. ఆ ప్రతిభావంతుడైన బలరాముడు అనంతరం దేవేంద్రుడిలా ప్రకాశిస్తూ మునులవద్ద వీడ్కొని బ్రాహ్మణులు కొందరు వెంటరాగా కౌశికి అనే నదికి వెళ్ళి.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=947 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


శ్రీకృష్ణ విజయము - ౪౪౩(443)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-948-వ.
చని యమ్మహానదిం గృతస్నానుండై యచ్చోటు వాసి సరయువు నందుఁ గ్రుంకులిడి ప్రయాగ నవగాహనంబు సేసి దేవర్షి పితృతర్పణంబు లాచరించి పులస్త్యాశ్రమంబు సొచ్చి గోమతిం దర్శించి గండకీనది నుత్తరించి విదళితభవపాశయగు విపాశయందుఁదోఁగి శోణనదంబున నాప్లావితుండై గయనాడి గంగాసాగరసంగమంబు దర్శించి మహేంద్రనగంబున కరిగి.
10.2-949-క.
రాముఁడుఁ గనుఁగొనె భార్గవ
రామున్ రజనీశ కులధరావరనగ సు
త్రామున్ సన్నుత సుగుణ
స్తోముం గారుణ్యసీము సుజనలలామున్. 

భావము:
ఆ మహానదికౌశికీలో బలరాముడు స్నానం చేసాడు. అక్కడ నుండి బయలుదేరి సరయూనదిలోను స్నానం చేసి, పిమ్మట ప్రయాగలో స్నానం చేసాడు. దేవర్షి పితృతర్పణాలు కావించాడు. అటు తరువాత పులస్త్యాశ్రమం ప్రవేశించాడు. అటుపిమ్మట గోమతిని దర్శించి గండకీనదిని దాటి పరమపావని అయిన విపాశలో స్నానంచేసి, శోణనదిలోనూ తర్వాత గయలోనూ స్నానమాడి గంగాసాగరసంగమం సందర్శించి. పిమ్మట బలరాముడు మహేంద్రపర్వతం చేరాడు. ఆ మహేంద్రగిరి మీద క్షత్రియ కులాన్ని మట్టుపెట్టినవాడూ, స్తుతింపబడే సద్గుణాలు కలవాడూ, దయాశాలి, సత్ప్రవర్తక శ్రేష్ఠుడు అయిన పరశురాముడిని బలరాముడు దర్శించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=949 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Tuesday, January 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౧(441)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-943-చ.
గగనమునం జరించు సురకంటకు కంఠము చేఁతినాగటం
దగిలిచి రోఁక లెత్తి బెడిదం బడరన్ నడునెత్తి మొత్తినన్
బుగబుగ నెత్తు రొల్క నిలఁ బోరగిలం బడె వజ్రధారచేఁ
దెగి ధరఁ గూలు భూరి జగతీధరముం బురుడింప బెట్టుగాన్.
10.2-944-వ.
అట్లు పల్వలుండు మడిసిన.
10.2-945-క.
మునివరులు గామపాలుని
వినుతించిరి వేయువేల విధముల వృత్రుం
దునిమిన యింద్రుని నమరులు
వినుతించిన రీతి నపుడు విమలచరిత్రా! 

భావము:
ఆకాశంలో సంచరిస్తున్న దేవతల పాలిటి పీడగా ఉన్న పల్వలుడి కంఠానికి నాగలిని తగిలించి క్రిందకు లాగి, బలరాముడు రోకలితో వాడి నడినెత్తి మీద బలంగా మొత్తాడు. ఆ దెబ్బకు ఇంద్రుని వజ్రాయుధం వేటుకు విరిగిపడే పర్వతంలాగ, పల్వలుడు బుగబుగ నెత్తురు కక్కుకుంటూ భూమిపై బోరగిలా పడ్డాడు. ఆ విధంగా పల్వలుడు నేలకూలడం చూసి. వృత్రాసురుడిని సంహరించిన దేవేంద్రుడిని దేవతలు అందరు స్తుతించిన విధంగా మును లందరూ బలరాముణ్ణి అనేక విధములుగా స్తుతించారు 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=945 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Monday, January 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౦(440)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-940-మస్ర.
కనియెం దాలాంకుఁ డుద్యత్కటచటు; ల నటత్కాలదండాభశూలున్
జనరక్తాసిక్తతాలున్ సమధిక; సమరోత్సాహలోలుం గఠోరా
శనితుల్యోదగ్ర దంష్ట్రా జనిత శి; ఖకణాచ్ఛాదితాశాంతరాళున్
హననవ్యాపారశీలున్నతి; దృఢ ఘనమస్తాస్థిమాలుం గరాళున్
10.2-941-ఉ.
వెండియుఁ గ్రొమ్మెఱుంగు లుడువీథి వెలుంగఁగ నుల్లసద్గదా
దండముఁ గేలఁ ద్రిప్పుచు నుదారత రా బలభద్రుఁ డాసురో
ద్దండవిఘాతులౌ ముసలదారుణలాంగలముల్‌ దలంప మా
ర్తాండనిభంబులై యెదురఁ దత్‌క్షణమాత్రన తోఁచినన్ వెసన్.
10.2-942-వ.
అట్లు సన్నిహితంబులైన తన కార్యసాధనంబులగు నిజసాధనంబులు ధరియించి యప్పుడు. 

భావము:
చేతిలో చలిస్తూ ఉన్న భయంకరమైన శూలంతో; మానవ రక్తంతో తడిసి ఉన్న దౌడలుతో; రణోత్సవం అతిశయిస్తూ ఉన్న చిత్తంతో; దిక్కులనూ ఆకాశాన్నీ కప్పివేస్తు అగ్నికణాలు వెదజల్లుతున్న వజ్రాయుధం లాంటి వాడి కోరలతో; ప్రాణుల్ని చంపడమే వ్రతంగా ఆ దానవుడు తలకాయలనూ ఎముకలనూ హారంగా కట్టిమెడలో వేసుకుని; పరమ భయంకరంగా ఉన్న ఆ రాక్షసుడు పల్వలుడిని, జండాపై తాడిచెట్టు ఉండే బలరాముడు చూసాడు. అంతే కాకుండా ఆకాశంలో మెరుపులు మెరిసేలా చేతిలోని గదను త్రిప్పుతూ పల్వలుడు తన మీదకు రావడం చూసి, బలరాముడు రాక్షస సంహార సమర్థములైన రోకలినీ నాగలినీ స్మరించాడు. తక్షణమే అవి సూర్య సమాన తేజస్సుతో బలరాముడి ఎదుట ప్రత్యక్షమయ్యాయి. అలా సాక్షాత్కరించిన ఆయుధాలను అందుకుని ధరించాడు. అప్పుడు.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=941 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, January 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౩౯(439)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-938-వ.
కావున దుష్టదానవుం ద్రుంచుటయు మాకుం గరంబు సంతసం బగు; నంతమీఁద నీవు విమలచిత్తుండవై భారతవర్షంబునం గల తీర్థంబుల ద్వాదశమాసంబు లవగాహనంబు సేయు; మట్లయిన సర్వపాపనిష్కృతి యగు"నని పలుకునంతఁ బర్వసమాగమంబైన.
10.2-939-సీ.
మునులు యజ్ఞక్రియోన్ముఖు లౌటఁ గనుఁగొని-
  పఱతెంచి యసుర తద్భవనములను
రక్త విణ్మూత్ర సురామాంసజాలంబు-
  నించి హేయంబు గావించి పెలుచఁ
బెంధూళి ఱాలును బెల్లలు నురలెడు-
  చక్రానిలము వీఁచి చదల నపుడు
గాటుకకొండ సంగతిఁ బొల్చు మేను తా-
  మ్రశ్మశ్రు కేశ సమాజములును
10.2-939.1-తే.
నవ్యచర్మాంబరము భూరినాసికయును
గఱకు మిడి గ్రుడ్లు నిప్పులు గ్రక్కు దృష్టి
వ్రేలు పెదవులు దీర్ఘకరాళ జిహ్వి
కయును ముడివడ్డబొమలును గలుగువాని. 

భావము:
కనుక, దుర్మార్గుడైన ఆ పల్వల రాక్షసుడిని నీవు చంపితే మా కదే సంతోషదాయకం. పిమ్మట నీవు పండ్రెండు మాసాలు నిర్మలమైన హృదయంతో భారతదేశంలో ఉన్న సకల పుణ్యతీర్ధాలను పన్నెడు (12) నెలలు సేవించి వాటిలో స్నానం చెయ్యి. అలా చేస్తే సమస్త పాపాలూ తొలగిపోతాయి.” మునులు ఇలా అంటుండగానే పర్వము రానే వచ్చింది. యాగానికి మునులు ఉపక్రమించటం పల్వలుడు చూసాడు. వెంటనే అక్కడికి వచ్చి ఆ శాలలలో మలమూత్రాలు మద్యమాంసాలు కురిపించి నానా భీభత్సం చేసాడు. రాళ్ళతో, ధూళితో, మట్టిగడ్డలతో నిండిన సుడిగాలులు వీచేలా చేసాడు. కాటుకకొండలాంటి నల్లని శరీరమూ, ఎఱ్ఱని గడ్డమూ మీసాలూ, పెద్దముక్కూ, మిడిగ్రుడ్లూ, నిప్పులు చిమ్మే చూపులూ, వ్రేలాడే పెదవులూ, పొడవైన నాలుకా, ముడిపడ్డ కనుబొమలతో భయంకరంగా ఆకాశంలో సంచరిస్తున్న ఆ రాక్షసుడు పల్వలుడిని బలరాముడు కని. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=939 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, January 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౩౮(438)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-936-తే.
"ఏ నెఱుంగక చేసిన యీ యవజ్ఞ
శాంతి వొంద నేయది యభీష్టంబు మీకు
దానిఁ గావింతు" ననిన మోదంబు నొంది
పలికి రత్తాపసులు హలపాణిఁ జూచి.
10.2-937-చ.
"హలధర! యిల్వలుండను సురారితనూజుఁడు పల్వలుండు నాఁ
గలఁడొక దానవుండు బలగర్వమునం బ్రతిపర్వమందు న
చ్చలమున వచ్చి మా సవనశాలల మూత్ర సురాస్ర పూయ వి
ట్పలలము లోలిమైఁ గురిసి పాడఱఁ జేయును యజ్ఞవాటముల్‌. 

భావము:
“తెలియక నేను చేసిన ఈ అపరాధం శాంతించేలాగ మీకు ఇష్టమైన కార్యం చెప్పండి చేస్తాను.” అని పలికిన బలరాముడి మాటలకు ఋషులు పరమానందం చెంది, అతడితో “బలరామా! నాగలి ఆయుధంగా గలవాడా! ఇల్వలుడనే రాక్షసుడి కొడుకు పల్వలుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు బలగర్వితుడై ప్రతి పర్వం నాడూ వచ్చి యజ్ఞశాలల్లో మలమూత్రాలను, చీమునెత్తురులను, మద్యమాంసాలను చాటునుండి కురిపించి పాడుచేస్తున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=937 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :