Friday, December 31, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౭(437)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-933-క.
ధాత్రీవర సమధిక చా
రిత్రుఁడు హలపాణి పలికె ధృతి "నాత్మా వై
పుత్రక నామాసి యను ప
విత్రశ్రుతి వాక్యసరణి విశదం బగుటన్.
10.2-934-క.
ఈ సూతసూనుఁ డిపుడు మ
హాసత్త్వము నాయువును ననామయమును వి
ద్యా సామర్థ్యము గలిగి సు
ధీసత్తములార! యీక్షితిన్ విలసిల్లున్."
10.2-935-వ.
అని సూతుం బునర్జీవితుంగాఁ జేసి మునులం జూచి యిట్లనియె. 

భావము:
ఓ రాజా! “ఆత్మా వైపుత్ర నామాసి”, (తానే పుత్రరూపంలో తిరిగి జన్మిస్తాడు) అనే వేదవచనానికి తగినట్లు మహానుభావుడైన బలరాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షులారా! ఇప్పుడు ఈ సూతుని కుమారుడు ఆయువు, ఆత్మశక్తి, రోగం లేని తనువు, విద్యాదక్షత పొంది ఈ లోకంలో విరాజిల్లుతాడు.” ఇలా అనుగ్రహించి బలరాముడు, సూతుడిని బ్రతికించి మునులతో మరల ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=934 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, December 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౬(436)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-932-వ.
అదియునుం గాక పరమపావనుండవైన నీవు ధర్మంబుదప్పిన నెవ్వరు మాన్పంగలరు? కావునఁ బ్రాయశ్చిత్తంబు గైకొని నడపకున్న ధర్మంబు నిలువ; దట్లుగావున దీనికిఁ బ్రతీకారంబు పుట్టింపు” మనిన నతండు వారలం గనుంగొని “తామసంబున నిట్టి పాపంబు సేయంబడియె; దీనికి ముఖ్యపక్షంబునఁ బ్రతికృతి యెఱింగింపుండు, వీనికి నాయువును బహుసత్త్వంబును నొసంగిన మీకిష్టంబగునే నట్లు నాయోగమాయచేఁ గావింతు” నన నమ్మునులు "నీయస్త్రమాహాత్మ్యంబునకు మృత్యువునకు మాకు నెవ్విధంబున వైకల్యంబు నొందకుండునట్లు గావింపు"మనిన నతం డందఱం జూచి యప్పుడు. 

భావము:
అంతే కాకుండా, పరమ పవిత్రుడవైన నీవే ధర్మం తప్పితే, అధర్మాన్ని ఎవరు అడ్డుకుంటారు? దీనికి ప్రాయశ్చిత్తం చేయకపోతే ధర్మం మనుగడకే ప్రమాదం. కనుక, నీవు ఆ ప్రాయశ్చిత కార్యం తలపెట్టాలి.” ఇలా పలుకుతున్న మహర్షుల మాటలు వినిన బలరాముడు వారితో “తొందరపాటు వలన ఇంతటి పాపం చేశాను. దీనికి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి. మీకు ఇష్టం అయితే, నా యోగమాయా ప్రభావంతో సూతుణ్ణి బ్రతికించి, అతడిని మహాశక్తిమంతునిగా చేస్తాను.” అన్నాడు. అంతట “నీ అస్త్రమహాత్మ్యానికి, మృత్యు నియమానికి, మాకు ఎలాటి ధర్మవిఘాతం కలుగకుండా, బలరామ! నీ ఇష్ట ప్రకారం చేయుము” అని ఋషులు బలరాముడితో అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=932 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, December 28, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౫(435)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-930-క.
“అనఘా! యితనికి బ్రహ్మా
సన మే మిచ్చుటను నీవు సనుదే నితఁ డా
సనము దిగఁడయ్యె నింతయు
మును నీమది నెఱుఁగ నర్థముం గలదె? హలీ!
10.2-931-క.
ఎఱిఁగెఱిఁగి బ్రహ్మహత్యా
దురితంబున నీమనంబు దూకొనెఁ బాపో
త్తరణప్రాయశ్చిత్తము
దొరఁకొని కావింపు మయ్య దుర్జనహరణా! 

భావము:
“మహాత్మా! బలరామ! ఈ సూతునికి మేము అధ్యక్ష స్థానము ఇచ్చి ఈ ఉన్నతాసనంపై కూర్చుండబెట్టాము. అందుకనే నీవు వచ్చినప్పుడు ఇతడు లేవ లేదు. ఇదంతా నీకు తెలియని విషయం కాదు. నీకు తెలియని ధర్మం అంటూ ఉందా? ఓ బలరామా! దుష్టశిక్షణ చేసే నీవే, తెలిసి తెలిసి బ్రహ్మహత్యా పాపానికి ఒడిగట్టావు. ఈ పాపం నిష్కృతి కావడానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవలెను. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=931 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, December 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౪(434)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-928-క.
ఆ నెఱిఁ దనుఁ గని ప్రత్యు
త్థాన నమస్కారవిధులు దగ నడపక పెం
పూనిన పీఠముపై నా
సీనుండగు సూతు శేముషీవిఖ్యాతున్.
10.2-929-వ.
కనుంగొని యతని సమీపంబున నున్న విప్రవరులం జూచి రాముండు రోషించి “వీఁడు నన్నుఁ గని లేవకుండుటకు హేతు వెయ్యదియొకో? ఈ ప్రతిలోమజాతుండు మునిగణ సభాస్థలంబునఁ దానొక్క ముఖ్యుండ పోలె దురభిమానంబున శక్తిమనుమని వలనంగొన్ని కథలు గాథలు గఱచి విద్వద్గణ్యుని విధంబున విఱ్ఱవ్రీఁగెడును; నీచాత్ముం డభ్యసించు విద్య లెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు గాని సత్త్వగుణగరిష్ఠంబులు గావు; ధర్మసంరక్షణంబు సేయ నవతరించిన మాకు నిట్టి దుష్టమర్దనం బవశ్యకర్తవ్యం, బని తలఁచి హస్తంబున ధరించిన కుశాగ్రంబున నా సూతుని వధించిన నక్కడి మునీంద్రు లెల్ల హాహాకారంబులతోడం దాలాంకునిఁ జూచి యిట్లనిరి. 

భావము:
కాని ప్రజ్ఞాసమేతుడైన సూతుడు తక్కిన మునులలాగ బలరామునికి ఎదురువచ్చి స్వాగతమిచ్చి అతిధి పూజలు చేయకుండా ఉన్నతాసనంమీద కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్న సూతుని బలరాముడు కనుగొని. తనను పూజించక ఉన్న సూతునిపై బలరాముడు ఆగ్రహించాడు. అతడు అక్కడ ఉన్న ఋషులతో “వీడు నన్ను చూసి కూడా ఎందుకు లేవలేదో? ఈ సూతుడు మహర్షులున్న సభలో తానే పెద్దను అని అనుకుంటూ దురభిమానంతో ప్రవర్తించాడు. వ్యాసమహర్షి దగ్గర కొన్ని కథలు గాథలు నేర్చుకున్నాడు. దానికే విద్వాంసుడను అని విఱ్ఱవీగుతున్నాడు. నీచులు అభ్యసించే విద్య వారిలో మదాన్నే పెంచుతుంది కానీ సాత్వికగుణాన్ని పెంచదు. మేము ధర్మ సంరక్షణ కోసం పుట్టాము. ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం మా కర్తవ్యం.” అని పలుకుతూ, తన చేతిలోని దర్భపుల్లతో ఆ సూతుడిని వధించాడు. అది చూసి అక్కడి మునీశ్వరులు అందరు హాహాకారాలు చేశారు. వారు బలరాముడితో ఇలా అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=929 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, December 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౩(433)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-927-వ.
అట్లు సని మొదలం ప్రభాసతీర్థంబున నవగాహంబు సేసి, యందు దేవర్షిపితృతర్పణంబులు సంప్రీతిం గావించి విమలతేజోధను లగు భూసురప్రవరులు దనతో నరుగుదేరం గదలి చని క్రమంబున సరస్వతియు బిందుసరోవరంబును వజ్రతీర్థంబును విశాలానదియు సరయువును యమునయు జాహ్నవీతీర్థంబును గనుంగొనుచు నచటనచట నవగాహన దేవర్షిపితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబు లను భూసుర యుక్తుండై నడపుచుం జని సకలలోకస్తుత్యంబును నిఖిలముని శరణ్యంబు నగు నైమిశారణ్యంబు సొచ్చి; యందు దీర్ఘసత్త్రంబు నడపుచున్న ముని జనంబులం గనుం గొనిన; వారును ప్రత్యుత్థానంబు సేసి రామునకు వినతులై యాసన పూజా విధానంబులు గావించిన నతండును బ్రముదిత మానసుం డగుచు సపరివారంబుగాఁ గూర్చున్న యెడ. 

భావము:
అలా తీర్ధయాత్రలకు అని బయలుదేరిన బలరాముడు, ప్రభాసతీర్ధానికి వెళ్ళి స్నానం చేసి ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు కూడా వస్తుండగా అతడు అక్కడ నుండి బయలుదేరాడు. క్రమముగా సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరయువు, యమున, గంగ మున్నగు పుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలు సమర్పించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసాడు. పిమ్మట బలరాముడు లోకములు సమస్తము నందు స్తుతిపాత్రము, మునీంద్రులకు నివాసస్థానము అయిన నైమిశారణ్యం ప్రవేశించాడు. అప్పుడు అక్కడి మునులు దీర్ఘసత్రయాగం జరుపుతూ ఉన్నారు. వారందరూ బలరాముడికి ఎదురేగి వినయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=926 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, December 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౨(432)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-924-క.
పురసతులు విరులు లాజలు
గురుసౌధాగ్రములనుండి కురియఁగ వికచాం
బురుహాక్షుం డంతఃపుర
వర మర్థిం జొచ్చె వైభవం బలరారన్.
10.2-925-వ.
అట్లు యోగీశ్వరేశ్వరుండును, షడ్గుణైశ్వర్యసంపన్నుండును, నిఖిలజగదీశ్వరుండును నైన పురుషోత్తముండు సుఖంబుండె; నంత.
10.2-926-క.
కౌరవ పాండవ పృథు సమ
రారంభ మెఱింగి తీర్థయాత్ర నెపముగా
సీరాంకుఁ డుభయకులులకు
నారయ సముఁ డగుటఁ జేసి యరిగె నరేంద్రా! 

భావము:
ఆ సమయంలో నగరంలోని స్త్రీలు మేడలమీద నుండి శ్రీకృష్ణుడిమీద పూలు అక్షతలు కురిపిస్తుండగా, శ్రీకృష్ణుడు మహావైభవంతో అంతఃపురం ప్రవేశించాడు. మహాయోగులకు ఈశ్వరుడు, షడ్గుణైశ్వర్యములు సమృద్ధిగా కలవాడు, సకల జగత్తులకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడు అలా నగరం ప్రవేశించి, ద్వారకలో సుఖంగా ఉన్నాడు. ఓ పరీక్షిన్మహారాజా! కౌరవ పాండవులకు యుద్ధం ప్రారంభం కానున్నదని తెలుసుకుని ఇరుపక్షాలకూ కావలసిన వాడు కనుక, బలరాముడు బయలుదేరి తీర్ధయాత్ర నెపంతో వెళ్ళిపోయాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=926 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, December 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౧(431)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-920-చ.
జలరుహలోచనుండు నిజసాధనమై తనరారు చక్రమున్
వలనుగఁ బూన్చి వైవ నది వారక వాని శిరంబు ద్రుంచె న
బ్బలియుఁడు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోదరా
వలుల వధించి తత్కులము వారి ననేకులఁ ద్రుంచె నీ గతిన్.
10.2-921-వ.
అయ్యవసరంబున.
10.2-922-క.
నర ముని యోగి సురాసుర
గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ
శ్చర కిన్నర కింపురుషులు
హరిమహిమ నుతించి రద్భుతానందములన్. 

భావము:
కృష్ణుడు తన చక్రాయుధం పూని వేయడంతో, అది వాని శిరస్సును ఖండించింది. అలా బలవంతుడైన శ్రీకృష్ణుడు సౌభకంతో పాటు, సాల్వుణ్ణీ, శిశుపాలుణ్ణీ, వాని తమ్ముడు విదూరథుణ్ణీ, వారి సోదరులతో సహా సంహరించాడు. ఇంతేకాక, వారి వంశం వారిని చాలా మందిని చంపాడు. అలా సాల్వాదులను అంతమొందించిన సమయంలో మానవులు, మునులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఖేచరులు మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని ప్రభావాన్ని స్తుతించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=922 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, December 23, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౦(430)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-918-చ.
పెనుగదఁ బూన్చి కృష్ణుతల బెట్టుగ మొత్తిన నంకుశాహతిం
గనలెడి గంధసింధురముకైవడి సింధురభంజనుండు పెం
పున పవిభాసమానగదఁ బూని మహోగ్రతఁ ద్రిప్పి దంతవ
క్త్రుని యురముంబగిల్చినఁగుదుల్కొనుచున్రుధిరంబు గ్రక్కుచున్
10.2-919-వ.
తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో నొఱలుచు నేలంగూలి కేశపాశంబులు సిక్కువడఁ దన్నుకొనుచుఁ బ్రాణంబులు విడిచె; నప్పుడు నిఖిల భూతంబులు నాశ్చర్యంబు వొందఁ దద్గాత్రంబున నుండి యొక్క సూక్ష్మతేజంబు వెలువడి గోవిందునిదేహంబుఁ బ్రవేశించె; నయ్యవసరంబున నగ్రజు మరణంబు గనుంగొని కుపితుండై కనుఁగవల నిప్పులుప్పతిల్ల విదూరథుండు గాలానల జ్వాలాభీలకరాళంబైన కరవాలంబును బలకయుం గేలందాల్చి దామోదరు దెసకుఁ గవయుటయుం గనుంగొని. 

భావము:
దంతవక్త్రుడు తన గదాదండంతో కృష్ణుడి తలమీద మోదాడు. అంకుశం పోటుకి కోపించెడి మదగజంలా, శ్రీకృష్ణుడు ఆగ్రహించి వజ్రాయుధంలాంటి గదతో వాడి వక్షస్థలాన్ని పగులకొట్టడంతో, వాడు రక్తం కక్కుతూ నేలకూలాడు. తక్షణమే పర్వతంవంటి దేహంతో దంతవక్త్రుడు నేలపడి శిరోజాలు విడివడి చిక్కులు పడేలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు, వాడి దేహం లోంచి ఒక సూక్ష్మతేజం వెలువడి శ్రీకృష్ణుడి శరీరంలో ఐక్యం అయింది. సకల జీవులూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విదూరథుడు అను వాడు అన్న మరణం చూసి అతి కోపంతో ప్రళయకాలపు అగ్నిజ్వాలవంటి భయంకరమైన కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుడి పైకి దూకాడు. చక్రి అది చూసి..... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=919 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, December 21, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౯(429)

( దంతవక్త్రుని వధించుట) 
10.2-916-చ.
వడిఁ జనుదేరఁ జూచి యదువల్లభుఁ డుల్లము పల్లవింప న
ప్పుడు గదఁ గేలఁబూని రథమున్ రయమొప్పఁగ డిగ్గి యుగ్రతం
గడఁగి విరోధికిన్నెదురుగాఁ జన వాఁ డతినీచవర్తియై
యడరుచు నట్టహాసముఖుడై వలచే గదఁ ద్రిప్పుచున్ హరిన్.
10.2-917-వ.
కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె, “నీవు మదీయభాగ్యంబునం జేసి నేఁడు నా దృష్టిపథంబునకు గోచరుండవైతివి; మిత్రద్రోహివైన నిన్ను మాతులేయుండ వని మన్నింపక దేహంబు నందు వర్తించు నుగ్రవ్యాధి నౌషధాదిక్రియల నివర్తింపఁజేయు చికిత్సకుని చందంబున బంధురూపశాత్రవుండవు గావున నిన్ను దంభోళి సంరంభ గంభీరంబైన మదీయ గదాదండహతిం బరేత నివాసంబున కనిచి మున్ను నీచేత నిహతులైన నాదు సఖుల ఋణంబుఁ దీర్తు” నని దుర్భాషలాడుచు డగ్గఱి. 

భావము:
ఆ విధంగా తన మీదకి వస్తున్న దంతవక్త్రుడిని చూసిన శ్రీకృష్ణుడు వికసించిన హృదయంతో గద చేత పట్టి రథం దిగాడు. పూని ఉగ్రంగా విరోధికి ఎదురు నడిచాడు. దంతవక్త్రుడు అట్టహాసంగా గద త్రిప్పుతూ నీచంగా మురారిని ఎగతాళి చేస్తూ ఇలా అన్నాడు. “ఓ కృష్ణా! ఈనాడు నీవు నా భాగ్యవశం వలన నాకు ఎదురుగా కనపడ్డావు. నువ్వు బంధువు రూపంలో ఉన్న విరోధివి. శరీరంలో ప్రవేశించిన భయంకరవ్యాధిని మందులతో పోగొట్టే వైద్యుడిలా, మేనమామ కొడుకువు అనే అభిమానం లేకుండా వజ్రాయుధం లాంటి నా గదాయుధంతో మిత్రద్రోహివైన నిన్ను యమలోకానికి పంపిచేస్తాను. నిన్ను చంపి నీవు చంపిన నా మిత్రుల ఋణాన్ని తీర్చుకుంటాను.” అంటూ దంతవక్త్రుడు శ్రీకృష్ణుణ్ణి దుర్భాషలాడుతూ దగ్గరకు వచ్చి.. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=917 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, December 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౮(428)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-914-వ.
ఇట్లు మాయావి యైన సాల్వుండును సౌభకంబును గృష్ణుచేతం బొలియుటఁ గనుంగొని నిజసఖులగు సాల్వ పౌండ్రక శిశుపాలురకుఁ బారలౌకికక్రియలు మైత్రిం గావించి దంతవక్త్రుం డతి భీషణాకారంబుతో నప్పుడు.
10.2-915-చ.
పెట పెటఁ బండ్లు గీఁటుచును బెట్టుగ మ్రోయుచుఁ గన్నుగ్రేవలం
జిటచిట విస్ఫులింగములు సింద మహోద్ధతపాదఘట్టన
న్నటనిటనై ధరిత్రి వడఁకాడ వడిన్ గద కేలఁ ద్రిప్పుచున్
మిటమిట మండు వేసవిని మించు దివాకరుఁ బోలి యుగ్రతన్. 

భావము:
ఆ విధంగా శ్రీకృష్ణుడు సాల్వుడిని సౌభకవిమానాన్నీ ధ్వంసం చేయటం చూసిన దంతవక్త్రుడు తన మిత్రులైన సాళ్వ, పౌండ్రక, వాసుదేవ, శిశుపాలురకు ఉత్తరక్రియలు పూర్తి చేసి; మిక్కిలి భయంకరాకారంతో కృష్ణుడి మీదకు వచ్చాడు. పండ్లు పట పట కొరుకుతూ, కళ్ళనుండి నిప్పుకణాలు రాలుస్తూ, పాదఘట్టనలతో భూమివణికేలా అడుగులు వేస్తూ, గద గిరగిర త్రిప్పుతూ, ఎండాకాలపు సూర్యుడిలాగా మండిపడుతూ దంతవక్త్రుడు కృష్ణుడిని వచ్చి తాకాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=915 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, December 19, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౭(427)

( సాల్వుని వధించుట) 

10.2-912-క.
అంతం బోవక కినుక న
నంతుఁడు విలయార్కమండలాయతరుచి దు
ర్దాంతంబగు చక్రంబు ని
తాంతంబుగఁ బూన్చి సాల్వధరిణిపుమీఁదన్.
10.2-913-క.
గురుశక్తి వైచి వెస భా
సురకుండలమకుటరత్నశోభితమగు త
చ్ఛిరము వడిఁ ద్రుంచె నింద్రుఁడు
వరకులిశముచేత వృత్రు వధియించు క్రియన్. 

భావము:
అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుడు ప్రళయకాల సూర్యమండల ప్రభలను వెదజల్లే సుదర్శన చక్రాన్ని సాల్వుడి మీద ప్రయోగించాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుని చంపినట్లుగా, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వేసి మకరకుండల రత్నాలతో విరాజిల్లుతున్న సాల్వుడి తలను ఖండించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=66&Padyam=913 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, December 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౬(426)

( సాల్వుని వధించుట) 

10.2-910-వ.
అట్లు కృష్ణుం డమ్మయనిర్మిత మాయావిమానంబు నిజగదాహతి నింతింతలు తునియలై సముద్రమధ్యంబునం దొరంగం జేసిన సాల్వుండు గోఱలు వెఱికిన భుజంగంబు భంగి గండడంగి విన్ననై విగతమాయాబలుం డయ్యునుఁ బొలివోవని బీరంబున వసుధా తలంబునకు డిగ్గి యాగ్రహంబున.
10.2-911-క.
కరమునఁ బవినిభ మగు భీ
కర గద ధరియించి కదియఁగాఁ జనుదేరన్
మురహరుఁ డుద్ధతి సాల్వుని
కరము గదాయుక్తముగను ఖండించె నృపా! 

భావము:
ఆ విధంగా మయడు నిర్మించిన మాయావిమానాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో ముక్కలు చేసి సముద్రమధ్యంలో పడేలా చేసాడు. అప్పుడు సాల్వుడు కోరలు తీసిన క్రూరసర్పంలా దీనుడై మాయాబలం నశించి కూడ, మొక్కపోని పరాక్రమంతో భూమికి దిగాడు. ఓ రాజా నరేంద్రా! సాల్వుడు వజ్రాయుధంతో సమానమైన భయంకర గదను చేతబట్టి కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ గదతో సహితంగా వాడి చేతిని ఖండించివేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=66&Padyam=911 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, December 15, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౫(425)

( సాల్వుని వధించుట) 

10.2-908-క.
హరి దనమీఁద ఘోరనిశితాశుగజాలము లేయు సాల్వభూ
వరు వధియింపఁ గోరి బహువారిద నిర్గతభూరివృష్టి వి
స్ఫురణ ననూన తీవ్రశరపుంజములన్ గగనంబుఁ గప్పి క్ర
చ్చఱ రిపు మౌళిరత్నమునుఁ జాపము వర్మముఁ ద్రుంచి వెండియున్.
10.2-909-మ.
వితతక్రోధముతోడఁ గృష్ణుఁడు జగద్విఖ్యాతశౌర్యక్రియో
ద్ధతశక్తిన్ వడిఁ ద్రిప్పి మింట మెఱుఁగుల్‌ దట్టంబుగాఁ బర్వ ను
గ్రతఁ జంచద్గద వైచి త్రుంచె వెసఁ జూర్ణంబై ధరన్ రాల నా
యతభూరిత్రిపురాభమున్ మహితమాయాశోభమున్ సౌభమున్. 

భావము:
అప్పుడు తన మీద పదునైన బాణాలను గుప్పిస్తున్న సాల్వుడిని చంపటానికి శ్రీకృష్ణుడు నిశ్చయించుకొని, తన తిరుగులేని తీవ్రమైన బాణాలను వర్షధారలవలె ప్రయోగిస్తూ ఆకాశాన్ని కప్పివేసి శత్రువు కిరీటాన్నీ ధనుస్సునూ కవచాన్నీ ఛేదించి వేశాడు. మహాక్రోధంతో శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాతమైన వీరవిజృంభణంతో ఆకాశంనిండా మెరుపులు వ్యాపించేలా గదాదండాన్ని విసిరి త్రిపురాల వంటిదీ గొప్ప మాయతో విరాజిల్లుతున్నది అయిన సాల్వుడి సౌభకవిమానాన్ని తుత్తునియలు చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=66&Padyam=909 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, December 14, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౪(424)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-906-క.
మును లపుడు గొంద ఱచటికిఁ
జనుదెంచి విమోహియైన జలజదళాక్షుం
గనుఁగొని సమధికభక్తిన్
వినయంబునఁ బలికి రంత విష్ణున్ జిష్ణున్.
10.2-907-సీ.
“కమలాక్ష! సర్వలోకములందు సర్వ మా-
  నవులు సంసార నానావిధైక
దుఃఖాబ్ధిమగ్నులై తుదిఁ జేరనేరక-
  వికలత్వమునఁ బొందు వేళ నిన్నుఁ
దలఁచి దుఃఖంబులఁ దరియింతు రట్టి స-
  ద్గుణనిధి వై దేవకోటికెల్లఁ
బట్టుగొమ్మై పరబ్రహ్మాఖ్యఁ బొగడొంది-
  పరమయోగీశ్వర ప్రకరగూఢ
10.2-907.1-తే.
పరచిదానంద దివ్యరూపమున వెలుఁగు
దనఘ! నీ వేడ? నీచజన్మాత్మ జనిత
ఘన భయస్నేహ మోహశోకంబు లేడ?"
ననుచు సంస్తుతి సేసి వారరిగి రంత. 

భావము:
ఆ సమయంలో, మునులు కొంతమంది వచ్చి, మాయా మోహితుడైన కృష్ణుడిని చూసి, చిక్కని భక్తితో వినయంగా సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన వాడు, జయశీలుడు అయిన ఆయనతో ఇలా పలికారు. “ఓ పుండరీకాక్షా! పురుషోత్తమా! సమస్తమైన లోకాలలో ఉన్న మానవులు అందరు రకరకాలుగా సంసారం అనే దుఃఖసముద్రంలో మునిగి దరి చేరలేక కొట్టుమిట్టాడుతున్న దశలో నిన్ను స్మరించి ఆ దుఃఖాలను పోగొట్టుకొంటారు. అలాంటి సద్గుణాలకు నిధివై; దేవతాసమూహానికి ఆధారభూతుడవై; పరబ్రహ్మ స్వరూపుడవై; పరమయోగీశ్వరులకు కూడా అందనివాడవై; చిదానందరూపంతో ప్రకాశించే నీ వెక్కడ? అజ్ఞాన సంజాతాలు అయిన శోక, మోహ, భయాదు లెక్కడ? అవి నిన్ను అంట లేవు.” అని ఈ విధంగా ప్రస్తుతించి ఆ మునీశ్వరులు వెళ్ళిపోయారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=907 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, December 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౩(423)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-905-వ.
తన మాయాబలంబునఁ గ్రమ్మఱం దోఁచి కృతక వసుదేవునిం గల్పించి యతనిం బంధించి కొనితెచ్చి “పుండరీకాక్ష! నిరీక్షింపు భవజ్జనకుండు వీఁడె; యిప్పుడు నీవు గనుంగొన వీని తలఁద్రుంతు నింక నెవ్వనికింగా మనియెదు? కావంగల శక్తిగలదేనిం గావు” మని దురాలాపంబు లాడుచు మృత్యుజిహ్వాకరాళంబైన కరవాలంబు గేలంబూని జళిపించుచు నమ్మాయావసుదేవుని శిరంబు దునిమి తన్మస్తకంబు గొని వియద్వర్తి యై చరియించు సౌభక విమానంబు సొచ్చె; నంత గోవిందుండు గొంతతడవు మనంబున ఘనంబగు శోకంబునం గుందుచుండి యాత్మసైనికులు దెలుపం దెలివొంది యది మయోదితంబైన సాల్వుని మాయోపాయం బని యెఱింగె; నంతం దనకు వసుదేవుండు పట్టువడె నని చెప్పిన దూతయు నమ్మాయాకళేబరంబును నా క్షణంబ విచిత్రంబుగా మాయంబై పోయె; ననంతరంబ. 

భావము:
ఆ దూత మళ్ళీ కనిపించి మాయావసుదేవుడిని కల్పించి, అతనిని బంధించి తీసుకు వచ్చి “ఓ కృష్ణా! పుండరీకముల వంటి కన్నులు ఉన్నాయి కదా చూడు. వీడే నీ తండ్రి నీ కన్నుల ముందే వీడి తల నరికేస్తాను. ఇక ఎవరి కోసం బ్రతుకుతావు? ఇక చాతనైతే రక్షించుకో.” అని దుర్భాషలు పలుకుతూ, భీకరమైన పెద్ద కత్తి జళిపిస్తూ, ఆ మాయావసుదేవుడి తల తరిగి, ఆ శిరస్సు పట్టుకుని సౌభకవిమానం లోనికి వెళ్ళిపోయాడు. అది చూసిన శ్రీకృష్ణుడు కొంతసేపు బాగా దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తన సైనికులచే గుర్తు చేయబడి, అది సాల్వుడు ప్రయోగించిన మయ నిర్మిత మాయ అని కృష్ణుడు గ్రహించాడు. ఆ క్షణం లోనే వసుదేవుడు పట్టుబడ్డాడు అని చెప్పిన దూత, ఆ మాయాకళేబరం అదృశ్యం అయిపోయాయి. పిమ్మట.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=905 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, December 12, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౨(422)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-902-క.
నర గంధర్వ సురాసుర
వరులకు నిర్జింపరాని వాఁడు బలుం డే
మఱ కరయ హీనబలుచేఁ
బరికింపఁగ నెట్లు పట్టువడు నొకొ యనుచున్
10.2-903-వ.
మఱియును.
10.2-904-క.
భావంబు గలఁగ "నాహా!
దైవకృతం బెవ్వరికినిఁ దప్పింపఁగ రా
దే విధి నైనను" నని శో
కావిలమతిఁ బలుకుచున్న నత్తఱి వాఁడున్. 

భావము:
“మానవ గంధర్వ దేవరాక్షసాదులకు అయినా జయింప సాధ్యం కాని బలరాముడు జాగరూకతతో రక్షిస్తూ ఉండగా, బలహీనుడైన సాల్వుడి చేత వసుదేవుడు ఎలా పట్టుబడతాడు.” అని శ్రీకృష్ణుడు ఇలా అనుకుంటూ మనస్సు వికలం అయి, “దైవనిర్ణయాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యంకాదు కదా.” అని శ్రీకృష్ణుడు దుఃఖంతో బాధపడ్డాడు. ఇంతలో.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=904 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, December 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౧(421)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-900-తే.
గగన మందుండి యొకఁ డార్తుఁ డగుచు వచ్చి
నందనందను పాదారవిందములకు
వందనము సేసి యానకదుందుభిని మ
హోగ్రుఁడై పట్టితెచ్చె సాల్వుండు గడఁగి.
10.2-901-తే.
దేవ! మీ కెఱిఁగింపఁగాఁ దివిరి యిటకు
దేవకీదేవి నన్నుఁ బుత్తెంచె ననఁగ
విని సరోరుహనాభుఁడు ఘన విషాద
మగ్నుఁ డయ్యెను గురుమీఁది మమతఁ జేసి. 

భావము:
ఒకడు ఆకాశంలో నుండి దుఃఖిస్తూ దిగి వచ్చి, ఆ నందుని నందనుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించి సాల్వుడు మహా ఉగ్రతతో పూని వచ్చి ఆనకదుందుభి అని పిలువబడే నందమహారాజుని బంధించి తెచ్చాడు. ప్రభూ! శాల్వుడు మీతండ్రి వసుదేవుడిని బంధించి తెచ్చిన వార్త మీకు చెప్పవలసిందిగా దేవకీదేవి నన్ను మీ దగ్గరకు పంపించారు.” అది వినిన శ్రీకృష్ణుడు తండ్రిమీద ఉన్న మమకారం వలన విషాదంలో మునిగిపోయాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=901 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, December 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౦(420)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-896-చ.
అనిన మురాంతకుండు దరహాసము మోమునఁ దొంగలింప సా
ల్వునిఁ గని "యోరి! లావు బలుపుంగల పోటరి వోలెఁ బ్రేలె దే
మనినను బాటు సన్నిహితమౌట యెఱుంగవు మూఢచిత్త! వొ
"మ్మని గదఁ గేలఁ ద్రిప్పి యభియాతిని శత్రుని వ్రేసె నుద్ధతిన్.
10.2-897-వ.
అట్లు వ్రేసిన.
10.2-898-క.
పెనుమూర్ఛ నొంది వెస ము
క్కున వాతను నెత్తురొల్కఁ గొంతవడికి నొ
య్యన తెలిసి నిలువరింపక
చనె వాఁడు నదృశ్యుఁ డగుచు సౌభముఁ దానున్.
10.2-899-వ.
అయ్యవసరంబున. 

భావము:
ఇలా అంటున్న సాల్వుడితో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. “ఓరోరి! మూర్ఖుడా! గొప్ప బలము, పరాక్రమం కల వీరుడిలా వాగుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు.” అని పలికి తన గధాయుధాన్ని గిరగిర త్రిప్పి ఎదురుగా వస్తున్న సాల్వుడి మీదకు విసిరాడు. అలా శ్రీకృష్ణుడు గదను వేయగా శ్రీకృష్ణుని గదాఘాతంచేత సాల్వుడి నోటినుండి ముక్కునుండి రక్తం కారుతుండగా స్పృహ తప్పాడు. కొంతసేపటికి తేఱుకుని తెలివి తెచ్చుకున్నాడు. వెనువెంటనే సౌభకంతోపాటు అదృశ్యమయి. అలా సౌభకంతో సాల్వుడు అదృశ్యమై మాయలు పన్నిన ఆ సమయంలో... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=898 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, December 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౯(419)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-893-క.
హాహా యని భూతావళి
హాహాకారములు సేయ నంతట దేఱ
న్నాహరిఁ గనుఁగొని యతఁ డు
త్సాహంబునఁ బలికె బాహుశౌర్యస్ఫూర్తిన్.
10.2-894-చ.
"నళినదళాక్ష! మత్సఖుఁడు నాఁ దగు చైద్యుఁడు గోరినట్టి కో
మలి నవినీతిమైఁ దగవుమాలి వరించితి; వంతఁ బోక దో
ర్బలమున ధర్మనందును సభాస్థలి నేమఱి యున్న వాని న
చ్చలమునఁ జంపి తట్టి కలుషంబున నేఁడు రణాంగణంబునన్. 

భావము:
సకల భూతాలు హాహాకారాలు చేసాయి. అ సమయంలో రథంలోని కృష్ణుడు తెప్పరిల్లడం చూసి, బాహుబలశాలి సాల్వుడు ఉత్సాహంతో ఇలా అన్నాడు. “ఓ పద్మాక్షా! కృష్ణా! నా మిత్రుడు నా వాడు అయిన చైద్యరాజు శిశుపాలుడు కోరుకున్న కన్యకను నీవు నీతిహీనుడవు అయి పరిగ్రహించావు. అది చాలక ధర్మరాజు యాగ సభలో ఏమరుపాటుగా ఉన్న అతడిని పగబట్టి చంపావు. అంతటి తప్పుచేసిన నీవు ఇప్పుడు రణరంగంలో.. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=894 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, December 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౮(418)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-891-చ.
గురుభుజుఁ డంతఁ బోవక యకుంఠిత శూరత శత్రుసైన్యముల్‌
దెరలఁగ నుగ్రతం గొఱవిఁ ద్రిప్పిన కైవడి మింట దిర్దిరం
దిరుగుచు దుర్నిరీక్ష్యమగు దీపితసౌభము సాల్వుఁ జండభా
స్కర కిరణాభ షోడశ నిశాతశరంబులఁ గాఁడ నేసినన్.
10.2-892-చ.
కడు వడి నల్గి వాఁడు నిజకార్ముకమున్ జలదస్వనంబుకై
వడి మొరయించుచున్ వెడఁద వాతి శరంబులఁ బద్మలోచను
న్నెడమభుజంబు గాఁడ వడి నేసినఁ దెంపఱి చేతి శార్‌ఙ్గమున్
విడిచె రథంబుపై గగనవీథి సురల్‌ భయమంది చూడఁగన్. 

భావము:
మహాభుజబల సంపన్నుడు, వీరాధివీరుడు అయిన కృష్ణుడు అంతటితో శాంతించకుండా మొక్కవోని పరాక్రమంతో కొఱవి త్రిప్పుతున్నట్లు ఆకాశంలో గిరగిర తిరుగుతూ దుర్నరీక్ష్యంగా ఉన్న ఆ సౌభకాన్నీ అందులోని సాల్వుడిని తీక్షణమైన సూర్యకిరణాలతో సమానమైన పదహారు బాణాలను గుప్పించి నొప్పించాడు. సాల్వుడు కోపంతో తన ధనుస్సును మేఘగర్జనలా మ్రోగిస్తూ కృష్ణుని ఎడమ భుజంలో దిగబడేలా వాడి బాణాలు వేసాడు. అ దెబ్బకు కృష్ణుడు శార్ఙ్గము అనే పేరు కల తన ధనుస్సును రథంమీద జారవిడిచాడు. ఆకాశంలో దేవతలు భయపడుతూ చూడసాగారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=892 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, December 7, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౭(417)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-889-చ.
మిణుఁగుఱు లెల్లెడం జెదర; మింటను మంటలు పర్వ; ఘంటికా
ఘణఘణ భూరినిస్వన నికాయమునన్ హరిదంతరాళముల్‌
వణఁక; మహోగ్రశక్తిఁ గొని వారక దారుకుమీఁద వైవ దా
రుణగతి నింగినుండి నిజరోచులతోఁ బడు చుక్కకైవడిన్.
10.2-890-క.
వడిఁ జనుదేరఁగఁ గని య
ప్పుడు నగధరుఁ డలతి లీలఁ బోలెన్ దానిం
బొడిపొడియై ధరఁ దొరఁగఁగఁ
నడుమన వెసఁ ద్రుంచె నొక్క నారాచమునన్. 

భావము:
నిప్పురవ్వలు అంతటా చెదరిపడేలా; అకాశం అంతా మంటలు వ్యాపించేలా; గంటలశబ్దంతో దిగ్గజాలు వణికేలా; సాల్వుడు భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని కృష్ణుడి రథసారథి అయిన దారుకుడి మీద ప్రయోగించాడు. అది ఆకాశం నుండి రాలిపడే కాంతిమంతమైన నక్షత్రంలా దూసుకు వస్తోంది అలా నింగినుండి దూసుకు వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడు ఒక్క బాణంతో మార్గం మధ్యలోనే పొడిపొడి చేసి నేలరాల్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=890 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, December 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౬(416)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-887-శా.
కంటే దారుక! దుర్నిమిత్తము లనేకంబుల్‌ మహాభీలముల్‌
మింటన్ మేదినిఁ దోఁచుచున్నయవి; నెమ్మిన్ ఖాండవప్రస్థ మే
నుంటం జైద్యహితక్షితీశ్వరులు మాయోపాయులై మత్పురిం
గెంటింపం జనుదేరఁ బోలుదురు; పోనీ తేరు వేగంబునన్."
10.2-888-వ.
అని యతిత్వరితగతిం జనుదెంచి తత్పురంబు డగ్గఱి మహాబల పరాక్రమంబులం బ్రతిపక్షబలంబులతోడం దలపడి పోరు యదు బలంబులును నభోవీథి నభేద్య మాయా విడంబనంబునం బ్రతివీరు లెంతకాలంబునకు నే యుపాయంబునను సాధింప నలవి గాని సౌభకవిమానంబు నందున్న సాల్వునిం గని తద్విమానంబు డాయం దన తేరు దోల సారథిని నియమించి కదియంజను మురాంతకుని వీక్షించి యదు సైనిక ప్రకరంబులు పరమానందంబునం బొందిరి; మృతప్రాయంబులై యున్న సైన్యంబులం గనుంగొని సౌభకపతి విక్రమక్రియాకలాపుం డగుచు నురవడించి. 

భావము:
చూడు దారుకా! అపశకునాలు ఆకాశంలోను, భూమి మీద అతిభీకరంగా కనబడుతున్నాయి. నేను ఇంద్రప్రస్థంలో ఉన్న విషయం తెలుసుకొని శిశుపాలుడి మిత్రులైన రాజులు మన పట్టణం మీద యుద్ధానికి తలపడినట్లు తోస్తున్నది. రథాన్ని వేగంగా పోనియ్యి. ఈ విధంగా శ్రీకృష్ణుడు పలుకగా, దారుకుడు మిక్కిలి వేగంతో రథం పోనిచ్చాడు. అలా శీఘ్రమే ద్వారకను సమీపించి, వాసుదేవుడు బలపరాక్రమాలతో శత్రుసైన్యంతో తలపడి యుద్ధం చేసే యాదవసైన్యాన్ని, ఆకాశమార్గంలో మాయాప్రభావంతో మోసం చేస్తూ యాదవవీరులను; ఎంత కాలానికి భేదింప సాధ్యం కాకుండా తిరుగుతున్న సౌభక విమానాన్నీ, అందులో ఉన్న సాల్వుడిని చూసాడు. వాని సమీపానికి రథాన్ని తోలించాడు. శ్రీకృష్ణుడిని వీక్షించిన యదుసైన్యాలు పరమానందం పొందాయి. చైతన్యం కోల్పోయి దైన్యంగా ఉన్న తన సైన్యాన్ని చూసి సాల్వుడు పరాక్రమించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=887 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, December 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౫(415)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-884-వ.
మఱియు నొక్కయెడ.
10.2-885-సీ.
ఖండిత శుండాల గండముల్‌ నక్రముల్‌-
  భూరితుండంబులు భుజగ సమితి;
పదతలంబులు గచ్ఛపంబులు; దంతముల్‌-
  శుక్తులు; గుంభనిర్ముక్త మౌక్తి
కములు రత్నములు; వాలములు జలూకముల్‌-
  మెడలు భేకంబులు; మెదడు రొంపి;
ప్రేవులు పవడంపుఁ దీవెలు; నరములు-
  నాఁచు; మజ్జంబు ఫేనంబు; లస్థి
10.2-885.1-ఆ.
సైకతములు; రక్తచయము తోయంబులు;
నొరగు నెడల నొరలు మొఱలు ఘన త
రంగరవముగా మతంగజాయోధన
స్థలము జలధిఁ బోల్పఁ దగె నరేంద్ర!
10.2-886-వ.
ఇవ్విధంబున యదుసాల్వబలంబులు చలంబునఁ బరస్పర జయకాంక్షలం దలపడి పోరు పూర్వపశ్చిమ సముద్రంబుల వడువున నిరువదియేడు దినంబు లతిఘోరంబుగాఁ బోరునెడ నింద్రప్రస్థపురంబు నుండి ద్వారకానగరంబునకు నగధరుండు సనుదేర ముందటం గానవచ్చు దుర్నిమిత్తంబులం గనుంకొని కృష్ణుండు దారుకునిం జూచి యిట్లనియె. 

భావము:
ఆ సంగ్రామరంగంలో ఆ సమయంలో.... ఓ రాజా! ఆ రణరంగం సముద్రంలా మారింది ఖండించబడిన ఏనుగుల గండస్థలాలే మొసళ్ళుగా; తొండాలే పాములుగా; ఆ యేనుగుల కాళ్ళు తాబేళ్ళుగా; దంతాలు ముత్యపుచిప్పలుగా; వాటి కుంభస్థలాల నుండి రాలిపడిన ముత్యాలు రత్నాలుగా; తోకలు జలగలుగా; మెడలు కప్పలుగా; మెదడు బురదగా; ప్రేగులు పగడపుతీగలుగా; నరాలు నాచుతీవలుగా; క్రొవ్వు నురుగులా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; రక్తము నీరుగా; మరణిస్తూ చేసే ఘీంకారాలు తరంగ శబ్దాలుగా; ఇలా ఆ రణభూమి సముద్రంతో పోల్చతగి పోలుపారింది. ఈ విధంగా యాదవ బలాలూ, సాల్వ సైన్యాలూ ఒకరిని ఒకరు జయించాలనే కోరికతో ఇరవైఏడు దినాలు పాటు తూర్పు పడమర సముద్రాలు తలపడి పోరుతున్నాయా అన్నట్లు భీకరంగా యుద్ధం చేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థం నుండి శ్రీకృష్ణుడు ద్వారకకు వస్తూ మార్గమధ్యంలో కనపడ్డ చెడ్డ శకునాలను కనుగొని సారథి యైన దారుకుడితో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=885 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౪౧౪(414)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-881-మ.
కని సాంబప్రముఖాది యోధవరు లుత్కంఠాత్ములై మీన కే
తను నగ్గించి సువర్ణపుంఖ నిశితాస్త్రశ్రేణి సంధించి సా
ల్వుని సైన్యావలి మస్తముల్‌ వెరవు లావున్ మీఱఁగా నొక్క యె
త్తున వేత్రుంచిరి తాటిపండ్లు ధరఁ దోడ్తో రాల్చు చందంబునన్.
10.2-882-వ.
అట్టి యెడ.
10.2-883-స్రగ్ద.
కూలున్ గుఱ్ఱంబులేనుంగులు ధరఁగె; డయుంగుప్పలై; నుగ్గునూచై
వ్రాలున్దేరుల్‌; హతంబై వడిఁబడుసు; భటవ్రాతముల్‌; శోణితంబుల్‌
గ్రోలున్, మాంసంబునంజుంగొఱకు, నెము; కలన్గుంపులైసోలుచున్బే
తాలక్రవ్యాదభూతోత్కరములు, జ; తలై తాళముల్‌ దట్టి యాడున్. 

భావము:
అది చూసిన సాంబుడు మున్నగు యదు యోధులు ప్రద్యుమ్నుడిని ప్రస్తుతించారు. పదునైన బంగారు పింజలు గల బాణాలతో తాటిపండ్లను నేల రాల్చినట్లు సాల్వుని సైనికుల తలలు ఉత్తరించారు. ఆ యాదవులు సాల్వ యుద్ధ సమయంలో కుప్పలు తెప్పలుగా గుఱ్ఱాలు కూలాయి; ఏనుగులు నేల మీద వ్రాలాయి; రథాలు నుగ్గనుగ్గు అయి కూలాయి; భటులు చచ్చి పడిపోయారు; బేతాళాలూ పిశాచాలూ భూతాలూ ఆనందంతో రక్తాన్ని త్రాగుతూ, మాంసం నంజుకుంటూ, ఎముకలు కొరుకుతూ. చప్పట్లతో తాళాలు చరుస్తూ, పారవశ్యంగా నృత్యాలు చేసాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=883 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, December 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౩(413)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-878-ఉ.
సంచితభూరిబాహుబల శౌర్యుఁడు సారథిమాట కాత్మ మో
దించి యుదాత్తకాండ రుచిదీపితచాపముఁ దాల్చి మౌర్వి సా
రించి గుణధ్వనిన్ బృహదరిప్రకరంబుల భీతి ముంచి తో
లించె రథంబు మేదిని చలింపఁగ నా ద్యుముమీఁద నేర్పునన్.
10.2-879-వ.
అట్లు డగ్గఱి.
10.2-880-చ.
అరితను వష్ట బాణముల నాగ్రహవృత్తిఁ బగిల్చి నాల్గిటం
దురగములన్ వధించి యొక తూపున సారథిఁ ద్రుంచి రెంటని
ష్ఠురతర కేతుచాపములు చూర్ణముచేసి యొకమ్మునన్ భయం
కరముగఁ ద్రుంచె నా ద్యుమునికంఠ మకుంఠిత విక్రమోద్ధతిన్. 

భావము:
మహాశూరుడు, అపార బలసంపన్నుడు అయిన ప్రద్యుమ్నుడు సారథి మాటలకు సంతోషించాడు. ధనుష్టంకారంతో శత్రువులను భయభ్రాంతులను చేస్తూ గొప్ప నేర్పుతో ద్యుముడి మీదకి తిరిగి రథాన్ని తోలించాడు. అలా శత్రువు ద్యుముడిని సమీపించి మిక్కిలి ఆగ్రహంతో ప్రద్యుమ్నుడు అవక్రపరాక్రమం ప్రదర్శిస్తూ ఎనిమిది బాణాలను వేసి శత్రువు శరీరాన్ని పగులకొట్టాడు. నాలుగు బాణాలు వేసి అతని గుఱ్ఱాలను కూల్చాడు. రెండు బాణాలతో వాడి పతాకాన్నీ ధనుస్సునూ నుగ్గునుగ్గుచేసాడు. ఒక బాణంతో భయంకరంగా అతని సారథిని సంహరించాడు. పిమ్మట విక్రమించి ప్రద్యుమ్నుడు ఒక అమ్ముతో ద్యుముని కంఠాన్ని భీకరంగా నరికాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=880 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౪౧౨(412)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-874-ఉ.
సారిథిఁ జూచి యిట్లనియె "శాత్రవవీరులు సూచి నవ్వఁగాఁ
దేరు రణక్షితిన్ వెడలఁ దెచ్చితి తెచ్చితి దుర్యశంబు పం
కేరుహనాభుఁడున్ హలియు గేలికొనన్ యదువంశసంభవుల్‌
బీరము దప్పి యిప్పగిదిఁ బెల్కుఱి పోవుదురే రణంబునన్. "
10.2-875-వ.
అనిన నతం డతని కిట్లనియె.
10.2-876-క.
"రథి రిపుచే నొచ్చిన సా
రథియును, సారథియు నొవ్వ రథియును గావం
బృథుసమర ధర్మ; మిఁక న
వ్యధచిత్తుఁ డవగుచుఁ గడఁగు వైరుల గెలువన్."
10.2-877-వ.
అనిన విని. 

భావము:
సారథిని, తేరుకున్న ప్రద్యుమ్నుడు ఇలా మందలించాడు. “కృష్ణుడూ బలరాముడూ ఎగతాళి చేసేలా, శత్రువులు నవ్వేలా రణక్షేత్రం నుండి రథాన్ని తప్పించి, అపకీర్తి తెచ్చావు. యదువంశంలో పుట్టిన వీరకుమారులు పరాక్రమహీనులై ఈ మాదిరి యుద్ధరంగం నుంచి తొలగిపోరు కదా.” ఇలా అంటున్న ప్రద్యుమ్నుడితో సారథి ఇలా అన్నాడు. “యుద్ధధర్మం ప్రకారం శత్రువుల వలన రథికుడు నొచ్చినపుడు సారథి, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ పరస్పరం రక్షించుకోవాలి, కాబట్టి. నేను ఇలా చేసాను. నీవు బాధపడక విరోధులను గెలవడానికి ప్రయత్నించు.” ఇలా సారథి చెప్పగా విని... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=876 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, December 1, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౧(411)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-872-చ.
వెరవును లావుఁ జేవయును వీరముఁ బీరము గల్గి డాసి యా
సరసిజనాభనందను విశాలభుజాంతరముం బగిల్చినన్
విరవిరవోయి మేను నిడువెండ్రుక వెట్టఁగఁ జేతిఁ సాధనో
త్కరములు దేరిపై వదలి కన్నులుమూయుచు మూర్ఛనొందినన్
10.2-873-ఆ.
సమరధర్మ వేది సమధిక నయవాది
దారుకుని సుతుండు ధైర్యయుతుఁడు
రథముఁ దోలికొనుచు రణభూమి వెడలి వే
చనియె మూర్ఛదేఱి శంబరారి. 

భావము:
నేర్పూ బలపరాక్రమాలూ ప్రదర్శిస్తూ ద్యుముడు గదతో కృష్ణకుమారుడు ప్రద్యుమ్నుడి వక్షం పగిలేలా మోదాడు. ఆ దెబ్బకి అతడు మేను గగుర్పడంతో చేతిలోని అస్త్రశస్త్రాలను రథంమీదనే వదిలి కనులు మూతలు పడి మూర్ఛపోయాడు. సారథి దారకుని కుమారుడు; యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు; నీతిశాస్త్ర పారంగతుడు; కనుక, రథాన్ని మళ్ళించి యుద్ధభూమినుండి ప్రక్కకు తోలుకుని పోయాడు. కొంతసేపటికి ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=873 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :