Saturday, May 23, 2020

ఉషా పరిణయం - 8

( ఉషాకన్య స్వప్నంబు )

10.2-332-వ.
ఇట్లు విరహవేదనా దూయమాన మానసయై యుండె; నంత నెచ్చెలులు డాయం జనుదెంచినం దన మనంబునం బొడము మనోజవికారంబు మఱువెట్టుచు నప్పుడు.
10.2-333-చ.
పొరిఁబొరిఁ బుచ్చు నూర్పుగమిఁ బుక్కిటనుంచి కుచాగ్రసీమపై
బెరసిన సన్న లేఁజెమటబిందువు లొయ్యన నార్చుఁ గన్నులం
దొరఁగెడు బాష్పపూరములు దొంగలిఱెప్పల నాని చుక్కలం
దరుణులు రండు చూతమని తా మొగ మెత్తును గూఢరాగ యై.
10.2-334-వ.
ఇవ్విధంబునం జరియించుచుండె నట్టియెడ.
10.2-335-తే.
అంతకంతకు సంతాప మతిశయించి
వలుఁద చన్నులు గన్నీటి వఱదఁ దడియఁ
జెలులదెసఁ జూడఁ జాల లజ్జించి మొగము
వాంచి పలుకక యుండె న వ్వనరుహాక్షి.

భావము:
ఇలా ఆ ఉషాబాల విరహవేదనతో బాధపడుతున్నది. ఇంతలో చెలికత్తెలు ఆమె చెంతకు రాగా, తన మనోవికారాన్ని వాళ్ళకు తెలియకుండా దాచుతున్నది వస్తున్న నిట్టూర్పులను అణచుకున్నది. వక్షోజాలపై పొడసూపిన చిరుచెమటను తుడిచి వేసింది. నేత్రాల నుండి జారనున్న కన్నీటిని రెప్పల క్రింద ఆపి, నక్షత్రాలను చూద్దాం రండని స్నేహితురాండ్రను పిలిచి ఆ వంకతో ముఖం పైకెత్తింది. ఇలా తన అనురాగం బయటపడకుండా దాచుతున్నది. ఈ మాదిరిగా ఆ ఉషాబాల కాలం గడుపుతున్న సమయంలో ఆ పద్మాల వంటి కన్నులు గల కన్య అంతకంతకూ సంతాపం అధికమై వక్షోజాలపై కన్నీరు కాల్వలు కట్టగా చెలికత్తెల వైపు కన్నెత్తి చూడడానికి చాల సిగ్గుపడి ముఖం వంచుకుని మాట్లాడకుండా ఉండిపోసాగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=335

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: