(బాణునకీశ్వర ప్రసాద లబ్ధి )
10.2-319-తే.
దర్పమునఁ బొంగి రుచిర మార్తాండ దీప్త
మండలముతోడ మార్పడు మహితశోణ
మణికిరీటము త్రిపురసంహరుని పాద
వనజములు సోఁక మ్రొక్కి యిట్లని నుతించె.
10.2-320-సీ.
"దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత! ;
వితతచారిత్ర! సంతత పవిత్ర!
హాలాహలాహార! యహిరాజకేయూర! ;
బాలేందుభూష! సద్భక్తపోష!
సర్వలోకాతీత! సద్గుణసంఘాత! ;
పార్వతీహృదయేశ! భవవినాశ!
రజతాచలస్థాన! గజచర్మపరిధాన! ;
సురవైరివిధ్వస్త! శూలహన్త!
10.2-320.1-తే.
లోకనాయక! సద్భక్తలోకవరద!
సురుచిరాకార! మునిజనస్తుతవిహార!
భక్తజనమందిరాంగణపారిజాత!
నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ!"
10.2-321-వ.
అని స్తుతియించి.
భావము:
ఆ బాణాసురుడు గర్వంతో ఉప్పొంగిపోతూ, సూర్యకాంతిని ధిక్కరించే తన మణికిరీటం త్రిపుర సంహారుడు అయిన శివుడి పాదపద్మాలకు సోకేలా నమస్కరించి ఇలా స్తుతించాడు. “ఓ దేవా! జగన్నాథా! దేవేంద్ర వందితా! పరిశుద్ధ చారిత్రా! పరమ పవిత్ర! హాలాహల భక్షకా! నాగభూషణ! చంద్రశేఖర! భక్తజనసంరక్షకా! సర్వలోకేశ్వరా! పార్వతీపతి! కైలాసవాసా! గజచర్మధారీ! రాక్షసాంతకా! త్రిశూలధారీ! భక్తజనుల ముంగిటి పారిజాతమా! జన్మరహితుడా! నిన్ను ఎవరు మాత్రం స్తుతించ గలరు?” ఈ విధంగా అనేక రకాల బాణుడు శివుడిని స్తుతించి...
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=31&padyam=320
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment