Sunday, May 31, 2020

ఉషా పరిణయం - 11

( ఉషాకన్య స్వప్నంబు  )

10.2-344-వ.
అనుచు నమ్మత్తకాశిని చిత్తంబు చిత్తజాయత్తంబయి తత్తరంబున విరహానలం బుత్తలపెట్టఁ గన్నీరుమున్నీరుగా వగచుచు విన్ననైన వదనారవిందంబు వాంచి యూరకున్నఁ జిత్రరేఖ దన మనంబున న య్యింతి సంతాపంబు చింతించి యిట్లనియె.
10.2-345-చ.
సరసిజనేత్ర! యేటికి విచారము? నా కుశలత్వ మేర్పడన్
నర సుర యక్ష కింపురుష నాగ నభశ్చర సిద్ధ సాధ్య కి
న్నరవర ముఖ్యులం బటమునన్ లిఖియించినఁ జూచి నీ మనో
హరుఁ గని వీడె పొమ్మనిన నప్పుడె వానిని నీకుఁ దెచ్చెదన్.

భావము:
ఇలా చెలికి చెప్పిన ఉషాసుందరి తన మనస్సు మన్మథ వేదనతో, విరహనలం అధికం కాగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తలవంచుకుని ఊరకున్నది. చిత్రరేఖ ఉషాకుమారి సంతాపాన్ని గ్రహించి ఇలా పలికింది. “ఓ పద్మాక్షీ! ఉషా! ఎందుకు విచారిస్తావు. నా నేర్పరితనం అంతా చూపిస్తాను. దేవ, మానవ, యక్ష, కిన్నర, సిద్ధ, సాధ్య శ్రేష్ఠుల చిత్రపటాలను వ్రాసి నీకు చూపిస్తాను. వారిలో నీ మనసు దోచుకున్నవాడు ఎవరో నీవు గుర్తిస్తే, ఆ వెంటనే వాడిని నీ చెంతకు తీసుకుని వస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=325

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: