Saturday, May 9, 2020

ధృవోపాఖ్యానము - 56


4-375-క.
సురదుందుభి పణ వానక
మురజాదులు మొరసె; విరుల ముసురు గురిసె; గి
న్నెర గంధర్వుల పాటలు
భరితములై చెలఁగె నపుడు భవ్యచరిత్రా!
4-376-వ.
అట్టి సమయంబున ధ్రువుండు దుర్గమంబగు త్రివిష్టపంబునకు నేగువాఁ డగుచు "దీన యగు జననిం దిగనాడి యెట్లు వోవుదు?" నని చింతించు వానిం బార్షదు లవలోకించి యగ్రభాగంబున విమానారూఢ యై యేగుచున్న జననిం జూపిన సంతుష్టాంతరంగుం డగుచు.
4-377-క.
జనని సునీతిని మును కనుఁ
గొని యవల విమాన మెక్కి గొనకొని విబుధుల్
దనమీఁదఁ బుష్పవర్షము
లనయముఁ గురియింప ధ్రువుఁడు హర్షముతోడన్.

భావము:
దేవతల నగారాలు, బేరీలు, డోళ్ళు, మద్దెలలు మొదలైనవి మ్రోగాయి. పూలవాన కురిసింది. దివ్యచరిత్ర కల విదురా! కిన్నరుల, గంధర్వుల పాటలు చెలరేగాయి. అటువంటి సమయంలో ధ్రువుడు ప్రవేశించడానికి సాధ్యం కాని దేవలోకానికి పోతూ "దీనురాలైన కన్నతల్లిని విడిచి ఎలా వెళ్ళను?" అని విచారిస్తుండగా విష్ణుభటులు చూచి, తమ ముందు విమానమెక్కి పోతున్న అతని తల్లిని చూపించగా తృప్తి పడుతూ తనకు ముందుగా వెళుతున్న తల్లియైన సునీతిని చూసి ధ్రువుడు విమానం ఎక్కి దేవతలు పూలవాన కురిపించగా సంతోషంతో…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=377

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: