4-380-సీ.
"పతియె దైవంబుగా భావంబులోపలఁ;
దలఁచు సునీతినందను తపః ప్ర
భావము క్రియ ధర్మభవ్య నిష్ఠలఁ బొందఁ;
జాలరు బ్రహ్మర్షి జనము లనిన
క్షత్రియకులు నెన్నఁగా నేల? యెవ్వఁడు;
పంచసంవత్సర ప్రాయమునను
సురుచి దురుక్త్యుగ్ర శరభిన్న హృదయుఁడై;
మద్వాక్యహిత బోధమతిఁ దనర్చి
4-380.1-తే.
వనమునకు నేగి హరిభక్తి వశత నొంది
యజితుఁ డగు హరిఁ తన వశుఁడై చరింపఁ
జేసి వెసఁ దత్పదంబును జెందె, నట్టి
హరిపదంబును బొంద నెవ్వరికిఁ దరము?"
4-381-క.
అని పాడె"ననుచు విదురున
కనఘుఁడు మైత్రేయుఁ డనియె నంచిత భక్తిన్
వినుతోద్దామయశస్కుం
డనఁగల యా ధ్రువుని చరిత మార్యస్తుత్యా!
4-382-సీ.
మహితసత్పురుష సమ్మతమును ధన్యంబు;
స్వర్గప్రదంబు యశస్కరంబు
నాయుష్కరంబుఁ బుణ్యప్రదాయకమును;
మంగళకర మఘమర్షణంబు
సౌమనస్యముఁ బ్రశంసాయోగ్యమును బాప;
హరమును ధ్రువపదప్రాపకంబు
నై యొప్పు నీ యుపాఖ్యానంబుఁ దగ నీకు;
నెఱిఁగించితిని; దీని నెవ్వఁడేని
4-382.1-తే.
తివుట శ్రద్ధాగరిష్ఠుఁడై తీర్థపాద
చరణ సరసీరుహద్వయాశ్రయుఁడు నైన
భవ్యచరితు దినాంత ప్రభాతవేళ
లను సినీవాలి పూర్ణిమ లందు మఱియు.
భావము:
“పతివ్రత అయిన సునీతి కొడుకు ధ్రువుడు తపస్సు చేసి సాధించిన మహాఫలాన్ని బ్రహ్మర్షులు కూడా పొందలేరంటే ఇక క్షత్రియుల మాట చెప్పేదేముంది? అతడు ఐదేండ్ల వయస్సులో సవతితల్లి సురుచి పలికిన దుర్వాక్కులు అనే బాణాలు మనస్సుకు నొప్పింపగా నా ఉపదేశాన్ని పాటించి అడవికి పోయి భక్తిపారవశ్యంతో మెప్పించరాని శ్రీహరిని మెప్పించి విష్ణుపదాన్ని పొందాడు. ఆ విధంగా విష్ణుపదాన్ని సాధించడం ఎవరి తరమౌతుంది?” ఇలా అంటూ విదురుడికి పుణ్యాత్ముడు అయిన మైత్రేయుడు గొప్ప కీర్తి కలవాడు అనదగిన ధ్రువుని వృత్తాంతం కీర్తించాడు మహానుభావ!
ధ్రువుని చరిత్ర సజ్జన సమ్మతం, ధన్యం, స్వర్గప్రదం, కీర్తికరం, ఆయుష్కరం, పుణ్యప్రద, శుభకరం, పాపహరం, సుజనత్వప్రదం, ప్రశంసాయోగ్యం, ధ్రువపదాన్ని కలిగించేది అయిన ధ్రువోపాఖ్యానాన్ని నీకు చెప్పాను.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=382
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment