Thursday, May 14, 2020

ధృవోపాఖ్యానము - 59

4-383-తే.
ద్వాదశినిఁ బద్మ బాంధవ వాసరమున
శ్రవణ నక్షత్రమున దినక్షయమునందుఁ
బరఁగ సంక్రమణవ్యతీపాత లందు
సభల భక్తిని వినునట్టి సజ్జనులకు.
4-384-వ.
క్లేశనాశనంబును మహాప్రకాశంబును నైన భగవద్భక్తియు శీలాది గుణంబులును గలుగు; మఱియుఁ దేజఃకామునకుఁ దేజంబును, మనః కామునకు మనంబును, నిష్కామునకుఁ దత్త్వవిజ్ఞానంబును గలుగు; దీని వినిపించువారికి దేవతానుగ్రహంబు గలుగు: నిట్టి యుపాఖ్యానంబు నీ కెఱింగించింతి” నని మైత్రేయుండు విదురునకుఁ జెప్పిన క్రమంబున శుకయోగి పరీక్షితున కెఱింగించిన తెఱంగున సూతుండు శౌనకాదులకు వినిపించి వెండియు నిట్లనియె "నట్లు చెప్పిన మైత్రేయునిం గని విదురుం డిట్లనియె.

భావము:

ఎవరైనా దీనిని కోరికతో, శ్రద్ధతో పుణ్యతీర్థాలకు స్థానమైన విష్ణుపాదాలను ఆశ్రయించి, ఉదయ సాయంకాలాలందు, సినీవాలి పూర్ణిమలందు, ఇంకా ద్వాదశినాడు, శ్రవణనక్షత్రంనాడు, దినక్షయము (ఒక అహోరాత్రమున మూడు తిథులు వచ్చిన దినము), మకర సంక్రమణాది సంక్రమణకాలంలో, వ్యతీపాతములలో (పూర్ణిమ తిథితో కూడిన సోమవారం లేదా అమావాస్యతో కూడిన ఆదివారం), సభలలో భక్తిశ్రద్ధలతో వినే సజ్జనులకు క్లేశాలు నాశనం అవుతాయి. ప్రకాశవంతం అయిన భగవద్భక్తి, మంచి శీలం అలవడుతాయి. తేజస్సు కోరేవానికి తేజస్సు, మానసిక శక్తిని కోరేవానికి మానసిక శక్తిని, కోరికలు లేనివానికి తత్త్వజ్ఞానం కలుగుతాయి. ఈ కథను వినిపించేవారికి దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఇటువంటి ధ్రువోపాఖ్యానాన్ని నీకు వినిపించాను” అని మైత్రేయుడు విదురునికి వినిపించాడని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలిపిన విధానాన్ని సూతుడు శౌనకాది మునులకు చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “ఆ విధంగా చెప్పిన మైత్రేయుని చూచి విదురుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=384

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: