Saturday, May 2, 2020

ధృవోపాఖ్యానము - 49


4-360-క.
విను రోషహృదయు చేతను
ననయము లోకము నశించు; నౌషధములచే
ఘనరోగములు నశించిన
యనువున; నది గాన రోష మడఁపు; మహాత్మా!
4-361-తే.
అనఘ! నీదు సహోదరహంత లనుచుఁ
బెనఁచి యీ పుణ్యజనులఁ జంపితి కడంగి
పరఁగ నిదియె సదాశివ భ్రాత యైన
యర్థవిభునకు నపరాధ మయ్యెఁ గాన.
4-362-క.
నతి నుతులచేత నీ విపు
డతనిఁ బ్రసన్నునిఁగఁ జేయు మని మనువు దయా
మతిఁ జెప్పి ధ్రువునిచే స
త్కృతుఁడై నయ మొప్పఁ జనియె ఋషియుక్తుండై.
4-363-వ.
అంత.

భావము:
మహాత్మా! మందులవల్ల రోగాలు నశించినట్లు కోపం కలవాని వలన లోకం నశిస్తుంది. కాబట్టి కోపాన్ని అణచివేసుకో. పుణ్యాత్మా! నీ తమ్ముని చంపినవాళ్ళు అని ఈ యక్షులను చంపావు. ఇది శివుని సోదరుడైన కుబేరుని పట్ల నీవు చేసిన అపరాధం. కావున నమస్కారాల చేత, స్తోత్రాల చేత కుబేరుని ప్రసనుని చేసుకో” అని చెప్పి ధ్రువునిచేత పూజ లందుకొని స్వాయంభువ మనువు ఋషులతో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడు…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=362

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: