Tuesday, May 5, 2020

ధృవోపాఖ్యానము - 53


4-369-చ.
మను నిభుఁ డంత భృత్యజన మంత్రి పురోహిత బంధు మిత్ర నం
దన పశు విత్త రత్న వనితా గృహ రమ్యవిహార శైల వా
రినిధి పరీత భూతల హరిద్విప ముఖ్య పదార్థ జాలముల్
ఘనమతిచే ననిత్యములుగాఁ దలపోసి విరక్తచిత్తుఁడై.
4-370-సీ.
పురము వెల్వడి చని పుణ్యభూ బదరికా;
ఘన విశాలానదీకలిత మంగ
ళాంబుపూరంబుల ననురక్తిమైఁ గ్రుంకి;
కమనీయ పరిశుద్ధ కరణుఁ డగుచుఁ
బద్మాసనస్థుఁడై పవనుని బంధించి;
నెలకొని ముకుళితనేత్రుఁ డగుచు
హరిరూపవైభవ ధ్యానంబు చేయుచు;
భగవంతు నచ్యుతుఁ బద్మనేత్రు
4-370.1-తే.
నందు సతతంబు నిశ్చలమైన యట్టి
భక్తిఁ బ్రవహింపఁ జేయుచుఁ బరమమోద
బాష్పధారాభిషిక్తుండు భవ్యయశుఁడుఁ
బులకితాంగుండు నగుచు నిమ్ములఁ దనర్చి.

భావము:
మనువులతో సమానుడైన ధ్రువుడు సేవకులు, మంత్రులు, పురోహితులు, బంధువులు, మిత్రులు, పుత్రులు, పశువులు, ధనం, రత్నాలు, స్త్రీలు, భవనాలు, క్రీడా పర్వతాలు, సముద్ర పరివేష్ఠితమైన రాజ్యం, గుఱ్ఱాలు, ఏనుగులు మొదలైన పదార్థాలన్నీ తన బుద్ధికౌశలంతో అశాశ్వతాలని భావించి, విరక్తి చెంది తన నగరంనుండి బయలుదేరి పుణ్యభూమి అయిన బదరికాశ్రమం వెళ్ళి, అక్కడి విశాల అనే పేరు కలిగిన పవిత్ర నదిలోని నీటిలో ప్రీతితో స్నానం చేసి, శుచియై పద్మాసనం కల్పించుకొని, వాయువును బంధించి, కనులు మూసికొని, భగవంతుని రూపాన్ని ధ్యానించాడు. ఆ విశాలయశోధనుడు ఆనందబాష్పాలతో తడిసిపోతూ మేను పులకించగా అచంచలమైన భక్తితో అచ్యుతుడు, కమలనేత్రుడు అయిన భగవంతుని ఆరాధించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=370

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: