Tuesday, May 5, 2020

ధృవోపాఖ్యానము - 52



4-367-సీ.
గణుతింప భూరిదక్షిణల చేఁ గడునొప్పు;
యజ్ఞముల్ చేయ నయ్యజ్ఞ విభుఁడు
ద్రవ్యక్రియా దేవతాఫల రూప స;
త్కర్మఫలప్రదాత యయి యొప్పు
పురుషోత్తముని నర్థిఁ బూజించి మఱియు స;
ర్వోపాధివర్జితుఁ డుత్తముండు
సర్వాత్మకుఁడు నగు జలజాక్షునందుఁ దీ;
వ్రంబై ప్రవాహరూపంబు నైన
4-367.1-తే.
భక్తి సలుపుచు నఖిల ప్రపంచమందు
నలరఁ దనయందు నున్న మహాత్ము హరినిఁ
జిదచిదానందమయుని లక్ష్మివరుఁ బరము
నీశ్వరేశ్వరుఁ బొడఁ గనె నిద్ధచరిత!
4-368-వ.
ఇట్లు సుశీలసంపన్నుండును, బ్రహ్మణ్యుండును, ధర్మసేతురక్షకుండును, దీనవత్సలుండు నయి యవని పాలించు ధ్రువుండు దన్నుఁ బ్రజలు దండ్రి యని తలంప నిరువదియాఱువే లేండ్లు భోగంబుల చేతం బుణ్యక్షయంబును, నభోగంబులైన యాగాదులచేత నశుభ క్షయంబునుం జేయుచు బహుకాలంబు దనుకఁ ద్రివర్గ సాధనంబుగా రాజ్యంబుచేసి కొడుకునకుఁ బట్టంబుగట్టి యచలితేంద్రియుండై యవిద్యారచిత స్వప్నగంధర్వ నగరోపమం బయిన దేహాదికం బగు విశ్వంబు భగవన్మాయారచితం బని, యాత్మం దలంచుచు వెండియు.

భావము:
ధ్రువుడు ఎంతో అధికమైన దక్షిణ లిస్తూ లెక్కలేనన్ని యజ్ఞాలు చేసాడు. యజ్ఞవిభుడు, కర్మఫలప్రదాత అయిన పురుషోత్తముణ్ణి పూజించాడు. జాతి గుణ క్రియా సంజ్ఞా రూపాలైన సమస్త ఉపాధులను వదలినవాడు, ఉత్తముడు, సర్వాత్మకుడు, కమలనయనుడు అయిన భగవంతునిపై తీవ్రమైన భక్తిని ప్రవాహరూపంగా ప్రసరింప జేశాడు. తనలోని మహాత్ముడు, చరాచరములన్నింట ఉండేవాడు, లక్ష్మీపతి, పరాత్పరుడు, దేవదేవుడు అయిన హరిని సర్వజీవులయందు సందర్శించాడు. ఈ విధంగా శీలసంపన్నుడు, వేదబ్రహ్మనిష్ఠుడు, ధర్మసేతు రక్షకుడు, దీనవత్సలుడు అయి రాజ్యాన్ని పాలించే ధ్రువుడు ప్రజలు తనను తండ్రిగా భావించగా, భోగాలచేత పుణ్యం వ్యయం కాగా అభోగాలైన యజ్ఞయాగాలచేత పాపాలను నాశనం చేసుకొంటూ ధర్మార్థకామాలనే త్రివర్గాలను సాధింపజేసే రాజ్యాన్ని 26 వేల సంవత్సరాలు పాలించి, కొడుకుకు రాజ్య పట్టాభిషేకం చేసి ఇంద్రియ నిగ్రహం కలవాడై అవిద్య వల్ల సృష్టించబడిన స్వప్నంలోని గంధర్వనగరంతో సమానమైన దేహము మొదలైన ప్రపంచం భగవంతుని మాయచేత కల్పింపబడిందని తన మనస్సులో భావిస్తూ…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=368

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: