Sunday, May 3, 2020

ధృవోపాఖ్యానము - 50

4-364-తే.
యక్షచారణసిద్ధ విద్యాధరాది
జనగణస్తూయమానుఁడై ధనదుఁ డంతఁ
బుణ్యజన వైశస నివృత్తు భూరిరోష
రహితుఁ డైనట్టి ధ్రువునిఁ జేరంగ వచ్చె
4-365-సీ.
చనుదెంచి వెసఁ గృతాంజలి యైన ధ్రువుఁ జూచి;
తివుట నిట్లనియె క్షత్రియకుమార!
తగ భవదీయ పితామహాదేశంబు;
నను దుస్త్యజంబైన ఘనవిరోధ
ముడిగితి! వటు గాన నొనరంగ నిపుడు నీ;
యందుఁ బ్రసన్నుండనైతి, భూత
జనన లయంబుల కనయంబుఁ గాలంబె;
కర్త యై వర్తించుఁగాన యుష్మ
4-365.1-తే.
దనుజుఁ జంపినవార లీ యక్షవరులు
గారు! తలపోయ నీ యక్షగణము నిట్లు
నెఱి వధించిన వాఁడవు నీవు గావు
వినుతగుణశీల! మాటలు వేయునేల!

భావము:
కోపాన్ని తగ్గించుకొని, యక్షులను సంహరించడం మానుకొన్న ధ్రువుని దగ్గరకు యక్షులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైనవారు స్తుతిస్తుండగా కుబేరుడు వచ్చాడు. వచ్చి తనకు నమస్కరించిన ధ్రువునితో ఇలా అన్నాడు “రాకుమారా! నీ తాత ఆదేశించగా విడువరాని పగను విడిచావు. అందువల్ల నీపట్ల నేను ప్రసన్నుడనైనాను. జీవుల జనన మరణాలకు కాలమే కారణం. కావున ఓ సుగుణాత్మా! వేయి మాట లెందుకు? నీ తమ్ముణ్ణి చంపినవాడు యక్షుడు కాడు. యక్షులను చంపినది నీవు కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=365

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: