Sunday, May 3, 2020

ధృవోపాఖ్యానము - 51


4-366-వ.
అదియునుం గాక, యే బుద్ధింజేసి కర్మ సంబంధ దుఃఖాదికంబులు దేహాత్మానుసంధానంబునం జేసి సంభవించు, నట్టి యహంత్వమ్మను నపార్థజ్ఞానంబు స్వప్నమందుంబోలెఁ బురుషునకుం దోఁచు; నదిగావున సర్వభూతాత్మవిగ్రహుండును, నధోక్షజుండును, భవచ్ఛేదకుండును, భజనీయ పాదారవిందుండును, ననంతామేయశక్తి యుక్తుండును, గుణమయి యగు నాత్మమాయచే విరహితుండును నైన యీశ్వరుని సేవింపుము; నీకు భద్రం బయ్యెడు; భవదీయ మనోగతం బైన వరంబుఁ గోరుము; నీ వంబుజనాభ పాదారవింద సేవనంబుఁ దిరంబుగఁ జేయుదు వని యెఱుంగుదు” నని రాజరాజుచేత నట్లు మహామతియు, భాగవతోత్తముండునైన ధ్రువుండు ప్రేరేపింపంబడి “యే హరిస్మరణంబు చేత నప్రయత్నంబున దురత్యయంబైన యజ్ఞానంబుఁ దరియింతు రట్టి హరిస్మరణం బచలితం బగునట్లొసంగు” మని యడగిన “నట్లగాక” యని యంగీకరించి యంతం గుబేరుండు సంప్రీత చిత్తుండయి, ధ్రువునికి శ్రీహరిస్మరణం బట్ల యనుగ్రహించి యంతర్థానంబు నొందె; నంత ధ్రువుండు యక్ష కిన్నర కింపురషగణ సంస్తూయమాన వైభవుం డగుచు నాత్మీయ పురంబునకు మరలి చనుదెంచి.

భావము:
అంతేకాక కర్మ సంబంధాలైన దుఃఖం మొదలైనవి దేహాభిమానం కారణంగా మానవునికి కలుగుతూ ఉంటాయి. స్వప్నంలో వలె ‘నేను, నీవు’ అనే భేదబుద్ధి అజ్ఞానం వల్ల కలుగుతుంది. సర్వభూత స్వరూపుడు, అధోక్షజుడు, సంసార బంధ విమోచకుడు, పూజింపదగిన పాదపద్మాలు కలవాడు, అంతము లేని అపరిమితమైన శక్తి కలవాడు, త్రిగుణాలతో నిండిన మాయ లేనివాడు అయిన భగవంతుని సేవించు. నీకు మేలు కలుగుతుంది. నీ మనస్సులో ఉన్న కోరికను కోరుకో. నీవు విష్ణుదేవుని పాదపద్మాలను స్థిరంగా పూజించేవాడవని నాకు తెలుసు” అని కుబేరుడు బుద్ధిమంతుడు, భాగవతోత్తముడు అయిన ధ్రువుణ్ణి ప్రోత్సహించాడు. ధ్రువుడు “ఏ హరి స్మరణం వల్ల దురంతమూ దుస్తరమూ అయిన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలమో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో సుస్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించు” అని కోరుకొన్నాడు. కుబేరుడు సంతోషించి ధ్రువునికి ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత ధ్రువుడు యక్షులు, కిన్నరులు, కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా నిజ రాజధానికి మరలి వచ్చి…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=366

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: