Saturday, May 16, 2020

ఉషా పరిణయం - 2


10.2-315-ఉ.
"శంకర! భక్తమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా
శంకర! పాండునీలరుచిశంకరవర్ణ నిజాంగ! భోగి రా
ట్కంకణ! పార్వతీహృదయకైరవ కైరవమిత్ర! యోగిహృ
త్పంకజ పంకజాప్త! నిజతాండవఖేలన! భక్తపాలనా! "
10.2-316-వ.
అని వినుతించి.
10.2-317-ఉ.
"దేవ! మదీయ వాంఛితము తేటపడన్నిటు విన్నవించెదన్
నీవును నద్రినందనయు నెమ్మిని నా పురి కోటవాకిటం
గావలియుండి నన్నుఁ గృపఁ గావుము భక్తఫలప్రదాత! యో
భావభవారి! నీ చరణపద్మము లెప్పుడు నాశ్రయించెదన్. "
10.2-318-వ.
అని యభ్యర్థించినం బ్రసన్నుండై భక్తవత్సలుం డగు పురాంతకుండు గౌరీసమేతుండై తారకాంతక గజాననాది భూతగణంబుల తోడ బాణనివాసం బగు శోణపురంబు వాకిటం గాఁపుండెఁ; బదంపడి యొక్కనాఁడ బ్బలినందనుండు.

భావము:
“శంకరా! భక్తవశంకరా! దుష్ట మదోన్మత్త రాక్షసులను నశింపచేయువాడా! ధవళాంగా! నీలకంఠా! సర్పభూషణా! పార్వతీ ప్రాణవల్లభా! యోగిజనుల హృదయ పంకజాలకు సూర్యునివంటివాడా! తాండవ కేళీ ప్రియా! భక్తపరిపాలకా!” అంటూ స్తుతించి.... ఇంకా ఇలా అన్నాడు. “ఓ దేవా! భక్తుల కోరికలు తీర్చువాడ! నాకోరిక విన్నవిస్తాను, విను. నీవు పార్వతీ సమేతంగా, నా కోట ముందర రక్షకుడివై ఉండి నన్ను రక్షించుతూ ఉండు. నా మనోవాంఛ ఇదే. కాముని భస్మం చేసినవాడా! నీ పాదపద్మాలను ఎప్పుడూ ఆశ్రయించుకొని ఉంటాను. దయజూడు.” బాణాసురుడు ఇలా ప్రార్థంచగా భక్తవత్సలుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై బాణుడి పట్టణం శోణపురం చేరాడు. భూతగణాలతో వేంచేసిన శంకరుడు కోట ద్వారం చెంత కాపలా ఉన్నాడు. అటుపిమ్మట, ఒకసారి ఆ బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=31&padyam=315

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: