10.2-311-తే.
అనఘ! బలినందనులు నూర్వు రందులోన
నగ్రజాతుండు బాణుఁ డత్యుగ్రమూర్తి
చిర యశోహారి విహితపూజిత పురారి
యహిత తిమిరోష్ణకరుఁడు సహస్రకరుఁడు.
10.2-312-క.
బాణుఁడు విక్రమజిత గీ
ర్వాణుఁడు సని కాంచె భక్తి వశుఁ డై సగణ
స్థాణున్ నిర్దళి తాసమ
బాణుం దాండవధురీణు భక్తత్రాణున్.
10.2-313-క.
కని యనురాగ వికాసము
దన మనమునఁ గడలుకొనఁగ ధరఁ జాఁగిలి వం
దన మాచరించి మోదము
దనరఁగఁ దాండవము సలుపు తఱి నయ్యభవున్.
10.2-314-ఉ.
సంచిత భూరిబాహుబలసంపద పెంపున నారజంబు వా
యించి యనేకభంగుల నుమేశుఁ ద్రిలోకశరణ్యు నాత్మ మె
చ్చించి ప్రమోదియై నిజవశీకృత నిశ్చలితాంతరంగుఁ గా
వించి తదాననాంబురుహ వీక్షణుఁడై తగ మ్రొక్కి యిట్లనున్.
భావము:
“అనఘా! పరీక్షిత్తూ! బలిచక్రవర్తికి వంద మంది కొడుకులు వారిలో పెద్దవాడు బాణుడు. అతడు మిక్కిలి ఉగ్రుడు, శత్రుభయంకరుడు, గొప్ప కీర్తిమంతుడు. అతనికి వేయి చేతులు. త్రిపురసంహారి అయిన మహాశివుని పూజించుటలో ధురంధరుడు. పరాక్రమంతో దేవతలను ఓడించిన బాణాసురుడు, భక్తిభావంతో భక్తవశంకరుడు, శాశ్వతుడు, తాండవకేళీ శేఖరుడు, మన్మథుడిని మసిచేసిన వాడు అయిన పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆ దేవదేవుని దర్శించాడు, పరమేశ్వరుని దర్శించి భక్తిభావం పొంగిపొర్లుతుండగా తాండవ క్రీడ సలుపుతున్న సమయంలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసాడు. సంపాదించిన తన బహు బాహుబలం అంతా వాడి ఝంజ వాయించి, మఱియూ ఇంకా అనేక రకాలుగా ఆ త్రిలోకశరణ్యుడైన పరమేశ్వరుడిని మెప్పించాడు. ఆనంద పరవశుడైన ఆ దేవుడి ముఖపద్మం వైపు దృష్టి నిలిపి నమస్కరించి ఇలా స్తుతించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=31&padyam=313
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment