( ఉషాకన్య స్వప్నంబు )
10.2-341-వ.
ఇవ్విధంబునఁ జిత్రరేఖం గనుంగొని యిట్లనియె.
10.2-342-చ.
“చెలి కలలోన నొక్క సరసీరుహనేత్రుఁడు రత్నహార కుం
డల కటకాంగుళీయక రణన్మణినూపురభూషణుండు ని
ర్మల కనకాంబరుండు సుకుమారతనుండు వినీలదేహుఁ డు
జ్జ్వలరుచి నూతనప్రసవసాయకుఁ డున్నతవక్షుఁ డెంతయున్.
10.2-343-చ.
నను బిగియారఁ గౌఁగిట మనం బలరారఁగఁ జేర్చి మోదముం
దనుకఁగ నంచితాధరసుధారస మిచ్చి మనోజకేళికిం
బనుపడఁ జేసి మంజుమృదుభాషలఁ దేలిచి యంతలోననే
చనియెను దుఃఖవార్ధిఁ బెలుచన్ ననుఁ ద్రోచి సరోరుహాననా!”
భావము:
అలా చిరుసిగ్గుతో చూస్తూ, ఉష చిత్రరేఖతో ఇలా పలికింది. “సఖీ! నాకొక కలవచ్చింది. ఆ కలలో రత్నాల హరాలు, కర్ణకుండలాలూ, కంకణాలు, ఉంగరాలు, మణులు పొదగిన గలగలలాడే కాలి అందెలు మున్నగు వివిధాలంకార శోభితుడూ, స్వచ్ఛమైన బంగారు వస్త్రాలు ధరించిన వాడూ, సుకుమార శరీరుడూ, నీలవర్ణుడూ, ఉన్నత వక్షుడూ, అభినవ మన్మథుడూ అయిన ఒక నవయువకుడు కనిపించాడు. ఓ కలువల వంటి కన్నులున్న చెలీ! ఆ వన్నెకాడు నన్ను గాఢంగా కౌగలించుకుని, ఆనందంగా అధరామృతం అందించాడు. మృదువుగా సంభాషించాడు. మన్మథ విలాసంలో ముంచితేల్చి ఆనందం కలిగించి, అంతలోనే నన్ను దుఃఖసాగరంలో ముంచి మాయమయిపోయాడు.”
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=343
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment