Sunday, May 31, 2020

ఉషా పరిణయం - 12

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-346-వ.
అని యొడంబఱిచి మిలమిలని మంచుతోడం బురుడించు ధళధళ మను మెఱుంగులు దుఱంగలిగొను పటంబు నావటంబు సేసి, వజ్రంబున మేదించి, పంచవన్నియలు వేఱువేఱ కనక రజత పాత్రంబుల నించి కేలం దూలిక ధరించి యొక్క విజనస్థలంబునకుం జని ముల్లోకంబులం బేరు గలిగి వయో రూప సంపన్నులైన పురుషముఖ్యుల నన్వయ గోత్ర నామధేయంబులతోడ వ్రాసి, యాయితంబయిన యప్పటంబు దన ముందటఁ దెచ్చి పెట్టి, “యిప్పటంబునం దగులని వారు లేరు; వారిం జెప్పెద, సావధానంబుగ నాకర్ణింపు” మని యిట్లనియె.

భావము:
ఈ మాదిరిగా ఉషాకన్యకు చెప్పి ఒప్పించిన చిత్రరేఖ, మంచువలె కాంతివంతమైన తెల్లని పటాన్ని పొందుపరచింది. ఐదు రంగులను బంగారు వెండి పాత్రలలో నింపుకున్నది. కుంచెను చేత పట్టి, ఏకాంతప్రదేశానికి వెళ్ళి ముల్లోకాలలో ప్రసిద్ధిగాంచిన సౌందర్యవంతుల చిత్రాలను, వారి వారి గోత్రనామాలతోపాటు సిద్ధం చేసింది. ఆ పటాన్ని ఉషకు తెచ్చి చూపించి "ఈ చిత్రపటంలో లేనివాడు ఈ లోకంలో లేడు వీరిని గూర్చి వివరిస్తాను విను". అని చిత్రరేఖ ఇలా చెప్పనారంభించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=346

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: