( ఉషాకన్య స్వప్నంబు )
10.2-329-వ.
మఱియును.
10.2-330-చ.
సరసమృదూక్తులుం గుసుమసాయకకేళియు శాటికా కచా
కరషణముల్ నఖక్రియలుఁ గమ్రకపోల లలాట మేఖలా
కర కుచ బాహుమూలములుఁ గైకొని యుండుట లాదిగాఁ దలో
దరి మది గాఢమై తగిలె దర్పకుఁ డచ్చుననొత్తినట్లయై.
10.2-331-సీ.
కలికిచేష్టలు భావగర్భంబు లైనను;
బ్రియుమీఁది కూరిమి బయలుపఱుపఁ
బిదపిదనై లజ్జ మదిఁ బద నిచ్చినఁ;
జెలిమేనఁ బులకలు చెక్కు లొత్త
మదనాగ్ని సంతప్త మానస యగుటకు;
గురుకుచహారవల్లరులు గందఁ
జిత్తంబు నాయకాయత్తమై యుంటకు;
మఱుమాట లాడంగ మఱపు గదుర
10.2-331.1-తే.
నతివ మనమున సిగ్గు మోహంబు భయముఁ
బొడమ నునుమంచు నెత్తమ్మిఁ బొదువు మాడ్కిఁ
బ్రథమచింతాభరంబునఁ బద్మనయన
కోరి తలచీర వాటింప నేరదయ్యె.
భావము:
ఇంకా మృదుసరస సంభాషణలూ; మన్మథ లీలలూ; కొంగు, శిరోజాలు లాగటం; కపోల, లలాట, బాహుమూల, కుచాదుల మీద గోటిగుర్తులూ వంటివి అన్నీ ఆమె మనస్సులో గాఢ ముద్రవేశాయి. ఆ యువకుడు అచ్చంగా మన్మథుడిలాగా వచ్చి ఆమెను గ్రుచ్చి కౌగలించినట్లే ఆమెకు అనిపించింది. ఉషాబాల చేష్టలు ఎంతో భావగర్భితం కావడంతో, ప్రియునిపై ప్రేమ వ్యక్తమౌతూ ఉంది. మనస్సు లోపల లజ్జ పొడముతుంటే, శరీరం మీద పులకాంకురాలు మొలకలెత్తాయి. మదనాగ్నికి ఆమె హృదయం తపించినందుకు గుర్తుగా, వక్షస్థలం మీద ఉన్న హారాలు కందిపోయాయి. హృదయం నాయకాధీనము కావడంతో, నెచ్చెలులకు బదులు పలకడం మరచిపోయింది. ఆ ఉషాకన్య హృదయంలో మోహం, సిగ్గు, భయం, ఉద్భవించాయి. అందువల్ల ఆమె మంచు క్రమ్మిన పద్మంలాగ శోభించింది. ప్రియుని గూర్చిన శృంగార చేష్టలలో మొదటిదైన చింతతో ఆ బాల తలమీద మేలి ముసుగు కూడా ధరించటంలేదు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=331
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment