Saturday, May 9, 2020

ధృవోపాఖ్యానము - 57

4-378-క.
చనిచని వెస గ్రహమండల
మును ద్రైలోక్యంబు సప్తమునిమండలమున్
ఘనుఁ డుత్తరించి యవ్వలఁ
దనరెడు హరిపదము నొందెఁ దద్దయుఁ బ్రీతిన్.
4-379-వ.
అది మఱియు నిజకాంతిచేతం ద్రిలోకంబులం బ్రకాశింపంజేయుచు నిర్దయాగమ్యంబును శాంతులు సమదర్శనులు శుద్దులు సర్వ భూతానురంజనులు నచ్యుతభక్తబాంధవులు నయిన భద్రాచారులకు సుగమ్యంబును నయి గంభీరవేగంబు ననిమిషంబు నగు జ్యోతిశ్చక్రంబు సమాహితంబై గోగణంబు మేధి యందుం బోలె నెందుఁ బరిభ్రమించుచుండు నట్టి యచ్యుతపదంబునుం బొంది, విష్ణుపరాయణుండైన ధ్రువుండు త్రిలోకచూడామణియై యొప్పుచుండె; నప్పుడు భగవంతుండైన నారదుండు ధ్రువుని మహిమం గనుంగొని ప్రచేతస్సత్త్రంబునందు వీణ వాయించుచు.

భావము:
వెళ్ళి వెళ్ళి ధ్రువుడు గ్రహమండలాన్ని, ముల్లోకాలను, సప్తర్షి మండలాన్ని దాటి ఆపైన ఉన్న విష్ణుపదాన్ని చేరుకున్నాడు. ఆ విష్ణుపదం తన కాంతిచేత ముల్లోకాలను ప్రకాశింపజేస్తున్నది. నిర్దయులకు పొందరానిది. శాంతస్వభావులు, సర్వజీవుల పట్ల సమదృష్టి కలవారు, పవిత్రులు, భూతదయ కలవారు, విష్ణుభక్తుల బంధువులైన సదాచారాలు కలవారు ఆ విష్ణుపదాన్ని సులభంగా పొందగలుగుతారు. కట్టుగుంజ చుట్టు పశువులు తిరిగే విధంగా జ్యోతిశ్చక్రం మహావేగంతో రెప్పపాటు కాలం కూడా ఆగకుండా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి విష్ణుపదాన్ని పొంది విష్ణుభక్తుడైన ధ్రువుడు ముల్లోకాలకు చూడామణియై విలిసిల్లుతూ ఉన్నాడు. అప్పుడు పూజ్యుడైన నారదుడు ధ్రువుని మాహాత్మ్యాన్ని చూచి ప్రచేతసుల యాగంలో వీణ వాయిస్తూ…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=378

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: