( ఉషాకన్య స్వప్నంబు )
10.2-336-వ.
అంత.
10.2-337-తే.
బలితనూభవుమంత్రి కుంభాండుతనయ
తన బహిఃప్రాణ మిది యనఁ దనరునట్టి
కామినీ మణి ముఖపద్మకాంతి విజిత
శిశిరకర చారు రుచిరేఖ చిత్రరేఖ.
10.2-338-వ.
కదియవచ్చి య బ్బాల నుపలక్షించి.
10.2-339-తే.
భామినీమణి! సొబగుని బయల వెదకు
విధమునను నాత్మ విభుఁ బాసి విహ్వలించు
వగను జేతికి లోనైనవానిఁ బాసి
భ్రాంతిఁ బొందిన భావంబు ప్రకటమయ్యె.
10.2-340-తే.
వనిత! నా కన్న నెనరైన వారు నీకుఁ
గలుగ నేర్తురె? నీ కోర్కిఁ దెలియఁ జెప్ప
కున్న మీయన్నతో డన్నఁ గన్నుఁగవను
నలరు నునుసిగ్గుతో నగ వామతింప.
10.2-341-వ.
ఇవ్విధంబునఁ జిత్రరేఖం గనుంగొని యిట్లనియె.
భావము:
ఆ సమయంలో బలికొడుకు బాణాసురుడి యొక్క మంత్రి అయిన కుంభాండకుని కుమార్తె చంద్రరేఖ ఉషాకన్యకు ప్రాణసఖి, బహిఃప్రాణం. ఆ మింటనున్న చంద్రరేఖను మించిన సౌందర్యవతి ఈ చిత్రరేఖ. ఆమె ఇదంతా గమనించి ఆ ఇష్టసఖి ఉషాబాల దగ్గరకు వచ్చి ఆమెతో ఇలా అన్నది. “ఓ యువతీ రత్నమా! నీ ప్రవర్తన చూస్తుంటే ప్రియుడి కోసం దిక్కులు చూస్తూ వెతుకుతున్నట్లూ, ప్రాణేశ్వరుడికి దూరమై బాధ చెందుతున్నట్లూ, చేతికి చిక్కిన వానిని కోల్పోయి భ్రాంతిలో మునిగినట్లూ కనబడుతోంది. సఖీ! నా కంటె దగ్గర వారు నీకు ఎవరు ఉన్నారు చెప్పు. నాకు నీ మనసులోని విషయం చెప్పకపోతే ఒట్టు” అని చిత్రరేఖ పలుకగా ఉషాసుందరి కళ్ళలో సిగ్గుతో కూడిన చిరునవ్వు దోబూచులాడగా....
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=340
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment