4-371-వ.
మఱియు; విగత క్లేశుండును, ముక్తలింగుండునునై, ధ్రువుండు తన్నుఁదా మఱచి యుండు సమయంబున దశదిక్కుల నుద్యద్రాకానిశానాయకుండునుం బోలె వెలింగించుచు నాకాశంబున నుండి యొక్క విమానంబు చనుదేర నందు దేవశ్రేష్ఠులును, జతుర్భుజులును, రక్తాంబుజేక్షణులును, శ్యామవర్ణులును, గదాధరులును, సువాసులును, గిరీటహారాంగదకుండలధరులును, కౌమారవయస్కులును, నుత్తమశ్లోక కింకరులు నయిన వారల నిద్దఱం గని; సంభ్రమంబున లేచి మధుసూదను నామంబులు సంస్మరించుచు వారల భగవత్కింకరులంగాఁ దలంచి దండప్రణామంబు లాచరించినం గృష్ణపాదారవింద విన్యస్తచిత్తుండుఁ, గృతాంజలియు, వినమితకంధరుండు నైన ధ్రువునిం గనుంగొని పుష్కరనాభభక్తు లైన సునందనందులు ప్రీతియుక్తులై మందస్మితు లగుచు నిట్లనిరి.
4-372-ఉ.
"ఓ నృప! నీకు భద్ర మగు; నొప్పగుచున్న మదీయవాక్యముల్
వీనులయందుఁ జొన్పుము; వివేకముతో నయిదేండ్లనాఁడు మే
ధానిధివై యొనర్చిన యుదాత్త తపోవ్రతనిష్ఠచేతఁ దే
జోనయశాలి యైన మధుసూదనుఁ దృప్తి వహింపఁ జేయవే!
భావము:
ఇంకా దుఃఖాన్ని విస్మరించి, శరీరాభిమానాన్ని విడిచి, తనను తాను మరచి ఉన్న సమయంలో పది దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉదయించిన పున్నమ చంద్రుని వలె ఒక విమానం ఆకాశంనుండి వచ్చింది. అందులో దేవతాశ్రేష్ఠులు, చతుర్భుజులు, ఎఱ్ఱ తామరల వంటి కన్నులు కలవారు, నల్లని రంగు కలవారు, గదాధరులు, మంచి వలువలు ధరించినవారు, కౌమార వయస్సులో ఉన్నవారు, కిరీటాలు హారాలు భుజకీర్తులు చెవికుండలాలు ధరించినవారు అయిన విష్ణుసేవకులు ఇద్దరున్నారు. వారిని చూచి ధ్రువుడు తటాలున లేచి మనస్సులో విష్ణునామాన్ని స్మరిస్తూ వారిని విష్ణుకింకరులుగా భావించి దండప్రణామాలు చేసాడు. విష్ణు పాదపద్మాల యందు లగ్నం చేసిన మనస్సు కలవాడు, భక్తుడు అయిన ధ్రువుణ్ణి చూచి సునందుడు, నందుడు అనే ఆ ఇద్దరు విష్ణుసేవకులు ఆనందంతో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. “రాజా! నీకు శుభం కలుగుగాక! మా హిత వాక్యాలను శ్రద్ధగా ఆలకించు. అయిదేండ్ల చిరుత ప్రాయంలోనే నీవు ఎంతో గొప్ప తపస్సు చేసి భగవంతుడైన శ్రీహరికి సంతృప్తి కలిగించావు కదా!
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=371
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment