Friday, March 13, 2020

ధ్రువోపాఖ్యానము - 8


4-237-క.
"విను పుత్రక! బాలుఁడవై
యనయంబును గ్రీడలందు నాసక్తమనం
బునఁ దిరిగెడు నిక్కాలం
బున నీ కవమానమానములు లే వెందున్.
4-238-తే.
కాన మనమునఁ దద్వివేకంబు నీకుఁ
గలిగెనేనియు సంతోషకలితు లయిన
పురుషు లాత్మీయకర్మ విస్ఫురణఁ జేసి
వితత సుఖదుఃఖము లనుభవింతు రెపుడు.
4-239-వ.
కావున వివేకంబు గల పురుషుండు దనకుం బ్రాప్తంబు లగు సుఖ దుఃఖంబులు దైవవశంబులుగాఁ దలంచి తావన్మాత్రంబునం బరితుష్టుం డగు; నీవును దల్లి చెప్పిన యోగమార్గ ప్రకారంబున సర్వేశ్వరానుగ్రహంబుఁ బొందెద నంటివేని.

భావము:
“నాయనా! విను. ఎల్లప్పుడు ఆటలందు ఆసక్తిని చూపవలసిన ఈ పసివయస్సులో గౌరవాగౌరవాలను పట్టించుకొనవలసిన పని లేదు. కనుక మంచి చెడులను నిర్ణయించే వివేకం నీకు ఉన్నా విచారించకు. మానవులు తమ పూర్వకర్మలను బట్టి కలిగే సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. కనుక తెలివి గల మానవుడు తనకు కలిగే సుఖదుఃఖాలను దైవసంకల్పం వల్ల కలిగినవని భావించి, వానితోనే తృప్తిపడతాడు. కాదు, నీవు నీ తల్లి చెప్పిన యోగమార్గాన్ని అనుసరించి భగవంతుని దయను పొందుతాను అన్నట్లయితే...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=238

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: