Thursday, March 19, 2020

ధ్రువోపాఖ్యానము - 11



4-247-క.
ఆ యమునా తటినీ శుభ
తోయములం గ్రుంకి నిష్ఠతో నచ్చట నా
రాయణునకును నమస్కృతు
లాయతమతిఁ జేసి చేయు యమనియమములన్.
4-248-వ.
మఱియు బాలుండ వగుటం జేసి వేదాధ్యయనా ద్యుచిత కర్మానర్హుండ వయ్యు నుచితంబులగు కుశాజినంబులం జేసి స్వస్తిక ప్రముఖాసనంబులం గల్పించుకొని త్రివృత్ప్రాణాయామంబులచేతం బ్రాణేంద్రియ మనోమలంబు లను చాంచల్య దోషంబులఁ బ్రత్యాహరించి స్థిరం బయిన చిత్తంబున.
4-249-సీ.
ఆశ్రిత సత్ప్రసాదాభి ముఖుండును;
స్నిగ్ధప్రసన్నాననేక్షణుండు
సురుచిర నాసుండు సుభ్రూయుగుండును;
సుకపోల తలుఁడును సుందరుండు
హరినీల సంశోభితాంగుండుఁ దరుణుండు;
నరుణావలోక నోష్ఠాధరుండుఁ
గరుణాసముద్రుండుఁ బురుషార్థ నిధియును;
బ్రణతాశ్రయుండు శోభనకరుండు
4-249.1-తే.
లలిత శ్రీవత్సలక్షణ లక్షితుండు
సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి
పురుష లక్షణ యుక్తుండుఁ బుణ్యశాలి
యసిత మేఘనిభశ్యాముఁ డవ్యయుండు.

భావము:
శుభాలను కలిగించే ఆ యమునానది నీటిలో స్నానం చేసి, నిశ్చలమైన బుద్ధితో నారాయణునికి నమస్కరించు. యమ నియమాలను అవలంబించు. ఇంకా పసివాడవు కనుక వేదాలను పఠించే అర్హత నీకు లేకున్నా దర్భలతోను, జింకచర్మంతోను స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని, పూరకము రేచకము కుంభకము అనే ఈ మూడు విధాలైన ప్రాణాయామాలతో ప్రాణేంద్రియ మనోమలాలను పొగొట్టుకొని, చాంచల్య దోషాలను తొలగించుకొని, స్థిరమైన మనస్సుతో హరిని ధ్యానించు. శ్రీహరి ఆశ్రితుల యెడ అపారమైన కృపారసం చూపేవాడు. సుప్రసన్నమైన ముఖం, చల్లని చూపులు, అందమైన ముక్కు, సొగసైన కనుబొమలు, చిక్కని చెక్కిళ్ళు కలిగిన చక్కనివాడు. ఇంద్రనీల మణులవలె ప్రకాశించే మేను కల పడుచువాడు. ఎఱ్ఱని నేత్రాలు, పెదవులు కలవాడు. దయాసముద్రుడు. పురుషార్థాలను ప్రసాదించేవాడు. నమస్కరించే వారికి ఆశ్రయ మిచ్చేవాడు. శుభాలను కలిగించేవాడు. శ్రీవత్సం అనే అందమైన పుట్టుమచ్చ కలవాడు. సర్వలోక రక్షకుడు. సర్వమూ చూచేవాడు. ఉత్తమ లక్షణాలు కలిగిన పురుషోత్తముడు. పుణ్యస్వరూపుడు. నీలమేఘశ్యాముడు. అవ్యయుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=249

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: