Tuesday, March 31, 2020

ధ్రువోపాఖ్యానము - 22

4-280-వ.
ఇట్లు దండప్రణామంబు లాచరించి కృతాంజలి యై స్తోత్రంబు చేయ నిశ్చయించియు స్తుతిక్రియాకరణ సమర్థుండుఁ గాక యున్న ధ్రువునకును సమస్త భూతంబులకు నంతర్యామి యైన యీశ్వరుం డాతని తలంపెఱింగి వేదమయం బయిన తన శంఖంబు చేత నబ్బాలుని కపోలతలం బంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుండును, భక్తిభావ నిష్ఠుండును నగు ధ్రువుండు నిఖిలలోక విఖ్యాత కీర్తిగల యీశ్వరుని భగవత్ప్రతిపాదితంబు లగుచు వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతియించె “దేవా! నిఖిలశక్తి ధరుండవు నంతఃప్రవిష్టుండవు నైన నీవు లీనంబు లైన మదీయ వాక్యంబులం బ్రాణేంద్రియంబులం గరచరణ శ్రవణత్వ గాదులను జిచ్ఛక్తిచేఁ గృపంజేసి జీవింపం జేసిన భగవంతుం డవును, బరమపురుషుండవును నైన నీకు నమస్కరింతు; నీ వొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేష విశ్వంబు మాయాఖ్యం బయిన యా త్మీయశక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబు లందు వసించుచుఁ దత్తద్దేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారువు లందున్న వహ్ని చందంబునం బ్రకాశింతువు; అదియునుం గాక.
4-281-చ.
వరమతి నార్తబాంధవ! భవద్ఝన బోధసమేతుఁడై భవ
చ్చరణముఁ బొంది నట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమం
దరయఁగఁ జూచురీతిఁ గనునట్టి ముముక్షు శరణ్యమైన నీ
చరణములం గృతజ్ఞుఁడగు సజ్జనుఁ డెట్లు దలంపకుండెడున్?

భావము:
ఈ విధంగా సాష్టాండ దండ ప్రణామం చేసి, చేతులు జోడించి శ్రీహరిని స్తుతించాలనుకొని, స్తుతి విధానం తెలియక మిన్నకున్నాడు ధ్రువుడు. సర్వాంతర్యామియైన భగవంతుడు ధ్రువుని తలంపు గ్రహించి తన చేతిలో ఉన్న వేదమయమైన పాంచజన్య శంఖంతో ఆ బాలుని చెక్కిలిని స్పృశించాడు. ఆ ప్రభావం వల్ల జీవేశ్వర నిర్ణయాన్ని గుర్తించిన ధ్రువుడు భక్తిభావంతో భగవంతుడు ప్రసాదించిన వేదవాక్కులతో విశ్వవిఖ్యాతుడైన ఈశ్వరుణ్ణి ఇలా స్తుతించాడు. “దేవా! నీవు అఖిల శక్తిసంపన్నుడవు. అంతర్యామివి. స్తంభించిపోయిన నా వాక్కులను, ప్రాణాలను, నా కరచరణాది సకలేంద్రియాలను దయతో జ్ఞానాత్మకమైన నీ శక్తివల్ల తిరిగి బ్రతికించిన భగవంతుడవు. పరమపురుషుడవైన నీకు నమస్కారం. నీవు ఒక్కడవే అయినప్పటికీ నీ మాయాశక్తిచేత ఈ సమస్త విశ్వాన్ని సృజిస్తావు. ఆ విశ్వంలో ప్రవేశిస్తావు. ఇంద్రియాలతో నివసిస్తావు. అగ్ని ఒక్కటే అయినా ఎన్నో దారువులలో ప్రకాశించే విధంగా నీవు ఆయా దేవతారూపాలలో ప్రవేశించి ప్రకాశిస్తావు. దీనబాంధవా! నిద్రనుండి మేలుకొన్నవాడు మళ్ళీ ప్రపంచాన్ని చూసినట్లుగా బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానంచేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శిస్తాడు. మోక్షం కోరే వారికి శరణాలైన నీ చరణాలను కృతజ్ఞుడైన సజ్జనుడు ఎలా మరచిపోగలడు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=281

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: