Thursday, March 19, 2020

ధ్రువోపాఖ్యానము - 12


4-250-వ.
మఱియును.
4-251-సీ.
హార కిరీట కేయూర కంకణ ఘన;
భూషణుం డాశ్రిత పోషణుండు
లాలిత కాంచీకలాప శోభిత కటి;
మండలుం డంచిత కుండలుండు
మహనీయ కౌస్తుభమణి ఘృణి చారు గ్రై;
వేయకుం డానంద దాయకుండు
సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ;
హస్తుండు భువన ప్రశస్తుఁ డజుఁడు
4-251.1-తే.
కమ్ర సౌరభ వనమాలికా ధరుండు
హతవిమోహుండు నవ్యపీతాంబరుండు
లలిత కాంచన నూపురాలంకృతుండు
నిరతిశయసద్గుణుఁడు దర్శనీయతముఁడు.
4-252-క.
సరసమనోలోచన ము
త్కరుఁడును హృత్పద్మ కర్ణికా నివసిత వి
స్ఫుర దురునఖ మణిశోభిత
చరణ సరోజాతుఁ డతుల శాంతుఁడు ఘనుఁడున్.

భావము:
ఇంకా ఆ శ్రీహరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతూ ఉంటాడు. ఆయన ఆశ్రితులను పోషించేవాడు. అతని కటిప్రదేశం అందమైన మొలత్రాడుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలను ధరిస్తాడు. కౌస్తుభం అనే మణికాంతులతో అందమైన కంఠమాలను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖ చక్ర గదా పద్మాలను నాలుగు చేతులలో ధరించి ఉంటాడు. ఆయన లోకప్రసిద్ధుడు. కమ్మని సువాసన గల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆయన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుంటాడు. మేలిమి బంగారు అందెలు ఆయన కాళ్ళకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. దర్శించవలసినవాడు. ఆ శ్రీహరి ఆశ్రితుల మనస్సులకు, కన్నులకు ఆనందాన్ని కలిగించేవాడు. భక్తుల హృదయ పద్మాలలో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు. సాటిలేని శాంత స్వభావుడు. మహానుభావుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=252

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 



No comments: