4-240-సీ.
అనఘాత్మ! యోగీంద్రు లనయంబు ధరఁ బెక్కు;
జన్మంబు లందు నిస్సంగమైన
మతినిఁ బ్రయోగ సమాధినిష్ఠలఁ జేసి;
యైనను దెలియ లే రతని మార్గ;
మది గాన నతఁడు దురారాధ్యుఁ డగు నీకు;
నుడుగుము నిష్ఫలోద్యోగ మిపుడు
గాక నిశ్శ్రేయస కాముఁడ వగుదేనిఁ;
దండ్రి! వర్తించు తత్కా లమందుఁ
4-240.1-తే.
బూని సుఖదుఃఖములు రెంటిలోన నెద్ది
దైవవశమునఁ జేకుఱు దానఁ జేసి
డెందమునఁ జాల సంతుష్టి నొందువాఁడు
విమలవిజ్ఞాని యన భువి వెలయుచుండు.
4-241-వ.
మఱియు గుణాఢ్యుం డగువానిం జూచి సంతోషించుచు నాభాసుం డగు వానిం జూచి కరుణించుచు సమానుని యెడ మైత్రి సలుపుచు వర్తించుచున్నవాఁడు తాపత్రయాదికంబులం దొఱంగు" నని నారదుండు పలికిన విని ధ్రువుం డిట్లనియె; “అనఘా! యీ శమంబు సుఖదుఃఖ హతాత్ము లగు పురుషులకు దుర్గమం బని కృపాయత్తుండవైన నీ చేత వినంబడె; అట్లయినం బరభయంకరం బగు క్షాత్త్ర ధర్మంబు నొందిన యవినీతుండనగు నేను సురుచి దురుక్తులను బాణంబుల వలన వినిర్భిన్నహృదయుండ నగుట మదీయచిత్తంబున శాంతి నిలువదు; కావునం ద్రిభువనోత్కృష్టంబు ననన్యాధిష్ఠితంబు నగు పదంబును బొంద నిశ్చయించిన నాకు సాధుమార్గంబు నెఱింగింపుము; నీవు భగవంతుం డగు నజుని యూరువు వలన జనించి వీణావాదన కుశలుండవై జగద్ధితార్థంబు సూర్యుండునుం బోలె వర్తింతువు;" అనిన విని.
భావము:
పుణ్యాత్మా! యోగీంద్రులు పెక్కు జన్మలలో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించి కూడ ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆ హరిని ఆరాధించడం నీకు చాల కష్టం. కాబట్టి వ్యర్థమైన ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. మోక్షాన్ని కోరుకున్నట్లయితే ముసలితనంలో దానికోసం ప్రయత్నించు. దైవవశాన సుఖదుఃఖాలలో ఏది కలిగినా మనస్సులో సంతోషించేవాడు విజ్ఞాని అనిపించుకుంటాడు. ఇంకా గుణవంతుని చూసి సంతోషిస్తూ, గుణహీనుని చూసి జాలిపడుతూ, తనతో సమానుడైనవానితో స్నేహం చేస్తూ ప్రవర్తించేవాని దరికి తాపత్రయాలు చేరవు” అన్న నారదుని మాటలు విన్న ధ్రువుడు ఇలా అన్నాడు. “పుణ్యాత్మా! సుఖదుఃఖాల వల్ల తెలివి కోల్పోయిన వారికి శాంతి లభించదని అన్నావు. శత్రువులకు భయం కలిగించే క్షాత్రధర్మాన్ని నేను అవలంబించాను. కనుక నాకు వినయం ఎక్కడిది? సురుచి పలికిన దుర్భాషలు అనే బాణాలచేత బ్రద్దలైన నా హృదయంలో శాంతికి తావు లేదు. కాబట్టి ముల్లోకాలలోను శ్రేష్ఠమైనది, ఇతరు లెవ్వరూ పొందనిది అయిన స్థానాన్ని నేను పొందాలని ఆశపడుతున్నాను. అందుకు నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు. నీవు బ్రహ్మ ఊరువునుండి జన్మించి, నేర్పుతో వీణను మ్రోగిస్తూ, లోకాలకు మేలును కూర్చే నిమిత్తం సూర్యభగవానిని వలె సంచరించే మహానుభావుడివి” అని చెప్పగా (నారదుడు) విని...
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=241
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment