4-242-క.
నారదుఁ డిట్లను "ననఘ! కు
మారక! విను నిన్ను మోక్షమార్గంబునకున్
బ్రేరేచినవాఁ డిప్పుడు
ధీరజనోత్తముఁడు వాసుదేవుం డగుటన్.
4-243-వ.
నీవు నమ్మహాత్ముని నజస్రధ్యాన ప్రవణ చిత్తుండవై భజియింపుము.
4-244-క.
పురుషుఁడు దవిలి చతుర్విధ
పురుషార్థశ్రేయ మాత్మఁ బొందెద ననినన్
ధరఁ దత్ప్రాప్తికి హేతువు
హరిపదయుగళంబు దక్క నన్యము గలదే?
4-245-వ.
కావున.
4-246-క.
వర యమునానదితటమునఁ
హరి సాన్నిధ్యంబు శుచియు నతిపుణ్యమునై
పరఁగిన మధువనమునకును
సరసగుణా! చనుము మేలు సమకుఱు నచటన్.
భావము:
నారదు డిలా అన్నాడు “పుణ్యాత్మా! నాయనా! విను. నిన్ను మోక్షమార్గాన్ని పొందడానికి ప్రేరేపించినవాడు పురుషోత్తముడైన వాసుదేవుడే. కనుక నీవు ఆ మహాత్ముని ఏకాగ్రమైన చిత్తంతో సేవించు. ధర్మార్థకామమోక్షాలు అనబడే నాలుగు పురుషార్థాలను శ్రేయస్సును పొందాలి అని అనుకునే మానవునికి హరి పాదపద్మాలు తప్ప మరొక ఉపకరణము లేదు. అందుచేత సుగుణనిధీ! యమునానది ఒడ్డున హరికి నివాసస్థానమూ, పవిత్రమూ, పుణ్యప్రదమూ అయిన మధువనానికి వెళ్ళు. అక్కడ నీకు మేలు కలుగుతుంది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=246
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment