Friday, March 13, 2020

ధ్రువోపాఖ్యానము - 7


4-236-వ.
నిజధర్మపరిశోభితంబైన యేకాగ్రచిత్తంబున నిలిపి సేవింపుము; అమ్మహాత్ముని కంటె నీ దుఃఖం బపనయించువాఁ డన్యుం డొక్కరుండు గలండే?" యని పలికినఁ బరమార్థ ప్రాప్తి హేతుకంబులైన తల్లివాక్యంబులు విని తన్నుఁ దాన నియమించుకొని పురంబు వెడలి చను నవసరంబున నారదుండు తద్వృత్తాంతం బెఱింగి, యచ్చటికిం జనుదెంచి, యతని చికీర్షితంబు దెలిసి, పాపనాశకరం బైన తన కరతలంబు నా ధ్రువుని శిరంబునం బెట్టి "మానభంగంబునకు సహింపని క్షత్రియుల ప్రభావం బద్భుతంబు గదా? బాలకుం డయ్యుఁ బినతల్లి యాడిన దురు క్తులు చిత్తంబునం బెట్టి చనుచున్నవాఁ" డని మనంబున నాశ్చర్యంబు నొంది “యో బాలక! సకల సంపత్సమృద్ధం బగు మందిరంబు దెగడి యొంటి నెందు నేగెదవు? స్వజన కృతం బగు నవమానంబుచే నిను సంతప్తుంగాఁ దలంచెద” ననిన ధ్రువుం డిట్లనియె;సపత్నీమాతృ వాగిషుక్షతం బగు వ్రణంబు భగవద్ధ్యానయోగ రసాయనంబున మాపి కొందు" ననిన విని ధ్రువునికి నారదుం డిట్లనియె.

భావము:
(హరిని) స్వధర్మాయత్తమైన ఏకాగ్రచిత్తంలో నిలిపి ఆరాధించు. ఆ మహాత్ముని కంటె నీ దుఃఖాన్నితొలగింప గలిగినవాడు మరొకడు లేడు.” అన్నది సునీతి. పరమార్థసిద్ధికి కారణాలైన తల్లి మాటలను ధ్రువుడు విని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చి పట్టణం నుండి బయలుదేరాడు. ఆ సమయంలో నారదమహర్షి ఆ వృత్తాంతాన్ని తెలుసుకొని ధ్రువుని దగ్గరకు వచ్చి, అతని కోరికను తెలుసుకొని, పాపాలన్నిటినీ పారద్రోలే తన చల్లని చేతితో అతని శిరస్సును స్పృశించాడు. ‘గౌరవహానిని సహింపని క్షత్రియుల తేజస్సు అద్భుతమైనది కదా! పసివాడై కూడ పినతల్లి పలికిన దుర్వాక్కులను మనస్సులో ఉంచుకొని నగరంనుండి వెళ్ళిపోతున్నాడు’ అని మనస్సులో ఆశ్చర్యపడి “నాయనా! సకల సంపదలు కలిగిన గృహాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావు? బంధువులు చేసిన అవమానంచేత బాధపడుతున్నట్లున్నావు” అని పలుకగా ధ్రువుడు ఇలా అన్నాడు “సవతితల్లి మాటల వల్ల అయిన గాయాన్ని భగవద్ధ్యానం అనే ఔషధంతో నయం చేసుకొంటాను”. ధ్రువుని మాటలు విన్న నారదుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=236

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: