Friday, January 1, 2016

ప్రహ్లాదుని హింసించుట - బాలకులార

7-211-వ.
అని రాజకుమారుండు గావునఁ గరుణించి సంగడికాండ్రతోడ నగియెడి చందంబునఁ గ్రీడలాడుచు సమానవయస్కులైన దైత్యకుమారుల కెల్ల నేకాంతంబున నిట్లనియె.
7-212-ఉ.
"బాకులార రండు మన ప్రాయపు బాలురు కొంద ఱుర్విపైఁ
గూలుట గంటిరే? గురుఁడు క్రూరుఁ డనర్థచయంబునందు దు
శ్శీత నర్థకల్పనముఁ జేసెడి గ్రాహ్యము గాదు శాస్త్రమున్
మే లెఱిఁగించెదన్ వినిన మీకు నిరంతర భద్ర మయ్యెడిన్.
టీకా:
          అని = అని; రాజ = రాజు యొక్క; కుమారుండు = పుత్రుడు; కావునన్ = కనుక; కరుణించి = దయచూపి; సంగటికాండ్ర = తోటివారి; తోడన్ = తోటి; నగియెడి = పరిహాసముల; చందంబునన్ = వలె; క్రీడలు = ఆటలు; ఆడుచున్ = ఆడుతూ; సమానవయస్కులు = ఒకేవయసువారు; ఐన = అయిన; దైత్య = రాక్షస; కుమారుల్ = బాలకుల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; ఏకాంతమున = రహస్యముగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
          బాలకులారా = పిల్లలూ; రండు = రండి; మన = మన; ప్రాయపు = వయసు కలిగిన, ఈడు; బాలురు = పిల్లలు; కొందఱు = కొంతమంది; ఉర్వి = భూమి; పైన్ = మీద; కూలుటన్ = మరణించుటను; కంటిరే = చూసితిరా; గురుడు = గురువు; క్రూరుడు = క్రూరమైనవాడు; అనర్థ = నివృత్తిశూన్యముల; చయంబున్ = సముదాయము; అందు = లో; దుశ్సీలతన్ = దుర్బుద్ధితో; అర్థ = ప్రయోజనముల; కల్పనమున్ = భ్రాంతిని; చేసెడిన్ = కలిగించుచున్నాడు; గ్రాహ్యములు = గ్రహింపదగినవి; కాదు = కాదు; శాస్త్రమున్ = విద్యను; మేలు = క్షేమమైనదానిని; ఎఱింగించెదన్ = తెలిపెదను; వినిన = విన్నచో; మీ = మీ; కున్ = కు; నిరంతర = ఎడతెగని; భద్రము = శ్రేయము; అయ్యెడిన్ = కలుగును.
భావము:
            రాజకుమారుడు కాబట్టి ప్రహ్లాదుడు తన దానవ సహాధ్యాయులతో చనువుగా, ధైర్యంగా ఇలా వారికి నచ్చచెప్పాడు. ఆడుతూ పాడుతూ వారితో కలిసిమెలిసి మెలగుతూ, వారందరికీ రహస్యంగా ఇలా బోధించాడు.
            పిల్లలూ! ఇలా రండి. పనికిమాలిన విషయాలన్నీ దుర్భుద్ధితో దయమాలిన మన గురువులు వాటికి ప్రయోజనాలు ఉన్నట్లు కల్పించి శాస్త్రాలు అంటూ గొప్పగా మనకు బోధిస్తున్నారు. అవి మనం నేర్చుకోదగ్గవి కావు. లోకంలో మన కళ్ళ ఎదుట మన ఈడు పిల్లలు కొందరు మరణించటం చూస్తూనే ఉన్నాం కదా. నేను చెప్పే విద్య వినండి మీకు ఎడతెగని క్షేమ స్థైర్యాలు కలుగుతాయి.
७-२११-व.
अनि राजकुमारुंडु गावुनँ गरुणिंचि संगडिकांड्रतोड नगियेडि चंदंबुनँ ग्रीडलाडुचु समानवयस्कुलैन दैत्यकुमारुल केल्ल नएकांतंबुन निट्लनिये.
७-२१२-उ.
"बालकुलार रंडु मन प्रायपु बालुरु कोंद र्रुर्विपैँ
गूलुट गंटिरे? गुरुँडु क्रूरुँ डनर्थचयंबुनंदु दु
श्शीलत नर्थकल्पनमुँ जेसेडि ग्राह्यमु गादु शास्त्रमुन्
मे लेर्रिँगिंचेदन् विनिन मीकु निरंतर भद्र मय्येडिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: