Thursday, January 14, 2016

ప్రహ్లాదుని జన్మంబు - నిర్భీతుండు

7-230-వ.
అని పలికిన వేల్పులఱేనికిం దపసి యిట్లనియె.
7-231-శా.
"నిర్భీతుండు ప్రశస్త భాగవతుఁడున్ నిర్వైరి జన్మాంతరా
విర్భూతాచ్యుతపాదభక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా
ర్భస్థుం డగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్
దుర్భావంబునఁ బొంది చావఁడు భవద్దోర్దండ విభ్రాంతుఁ డై."
టీకా:
          అని = అని; పలికిన = పలుకగా; వేల్పులఱేని = ఇంద్రున {వేల్పులఱేడు - వేల్పుల(దేవతల) ఱేడు (ప్రభువు), ఇంద్రుడు}; కిన్ = కు; తపసి = ముని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          నిర్భీతుండు = భయములేనివాడు; ప్రశస్త = శ్రేష్ఠుడైన; భాగవతుడున్ = భాగవతుడు; నిర్వైరి = శత్రుత్వములేనివాడు; జన్మాంతర = పూర్వజన్మలనుండి; ఆవిర్భూత = పుట్టిన; అచ్యుత = నారయణుని; పాద = పాదములందలి; భక్తి = భక్తి యొక్క; ప్రభావ = ప్రభావముతో; ఆవిష్టుండు = కూడినవాడు; దైత్య = రాక్షసుని; అంగన = భార్య యొక్క; గర్భస్థుడు = కడుపునగలవాడు; అగు = అయిన; బాలకుండు = పిల్లవాడు; బహు = అనేక విధములైన; సంగ్రామ = యుద్ధము; ఆది = మొదలగు; ఉపాయంబులన్ = ఉపాయములచేత; దుర్భావంబున్ = నికృష్టత్వమును; పొంది = పొంది; చావడు = మరణించడు; భవత్ = నీ యొక్క; దోర్దండ = బాహుబలమునకు; విభ్రాంతుడు = తికమకనొందినవాడు; ఐ = అయ్యి.
భావము:
            ఇలా పలికిన ఆ దేవతల రాజు దేవేంద్రుడితో మహా తపశ్శాలి అయిన నారదుడు ఇలా అన్నాడు.
            దానవేంద్రుడు హిరణ్యకశిపుని భార్య ఈ లీలావతి కడుపులో పెరుగుతున్న వాడు భయం అన్నది లేని వాడు. మహా భక్తుడు. పరమ భాగవతోత్తముడు. అతనికి ఎవరూ శత్రువులు కారు. అతను జన్మజన్మల నుంచీ హరిభక్తి సంప్రాప్తిస్తూ వస్తున్న మహా మహిమాన్వితుడు. కాబట్టి ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని ఉపాయాలు పన్నినా, నీకు ఎంత బలం ఉన్నా, నీ బాహుపరాక్రమం అతని మీద ఏమాత్రం పనిచేయదు, అతనిని చంపలేవు కనీసం ఏ విధమైన కష్టం కలిగించలేవు.”
७-२३०-व.
अनि पलिकिन वेल्पुलर्रेनिकिं दपसि यिट्लनिये.
७-२३१-शा.
"निर्भीतुंडु प्रशस्त भागवतुँडुन् निर्वैरि जन्मांतरा
विर्भूताच्युतपादभक्ति महिमाविष्टुंडु दैत्यांगना
गर्भस्थुं डगु बालकुंडु बहुसंग्रामाद्युपायंबुलन्
दुर्भावंबुनँ बोंदि चावँडु भवद्दोर्दंड विभ्रांतुँ डै."
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: