Monday, January 4, 2016

ప్రహ్లాదుని హింసించుట - హాలాపాన

7-215-శా.
హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లస
ద్బాలాలోకన శృంఖలానిచయ సంద్ధాత్ముఁడై లేశమున్
వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడుం గామినీ
హేలాకృష్ట కురంగశాబక మగున్ హీనస్థితిన్ వింటిరే.
టీకా:
          హాలా = కల్లు; పాన = తాగుటచే; విజృంభమాణ = చెలరేగిన; మద = మదము; గర్వ = గర్వము; అతీత = మితిమీరిన; దేహ = శరీరమందు; ఉల్లసత్ = ఎగసిన; బాలా = జవ్వనుల; ఆలోకన = చూపులనెడి; శృంఖలా = సంకెలల; నిచయ = సమూహములచే; సంబద్ధాత్ముడు = బాగా బంధింపబడినవాడు; ఐ = అయ్యి; లేశమున్ = కొంచముకూడ; వేలా = గట్టునకు; నిస్సరణంబు = తరించుటను; కానక = కనుగొనలేక; మహా = గొప్ప; విద్వాంసుండున్ = పండితుడుకూడ; కామినీ = స్త్రీ యొక్క; హేలా = విలాసముచే; ఆకృష్ట = ఆకర్షించబడిన; కురంగ = లేడి; శాబకము = పిల్ల; అగున్ = అయిపోవును; హీన = నీచమైన; స్థితిన్ = గతిని; వింటిరే = విన్నారా.
భావము:
            ఈ విషయం వినే ఉంటారు. ఎంత గొప్పపండితుడు అయినా మధువు త్రాగి, ఆ మత్తులో ఒళ్ళు మరచి కన్నులు తెరవ లేకుండా అయిపోతాడు; ఆడువారి వాలుచూపులు అనే సంకెళ్ళలో చిక్కి పోతాడు; ఆడుకొనే పెంపుడు లేడిపిల్లల లాగ ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాడు; అతి విలువైన తన జీవితకాలం వృథా అయిపోతున్నది కూడ గమనించలేడు. అలా ఉచ్ఛస్థితి నుండి హీనస్థితి లోకి దిగజారిపోతాడు. కోరికల వలన ఎంత దుర్గతి కలుగుతుందో చూసారు కదా.
७-२१५-शा.
हालापान विजृंभमाण मदगर्वातीत देहोल्लस
द्बालालोकन शृंखलानिचय संबद्धात्मुँडै लेशमुन्
वेलानिस्सरणंबु गानक महाविद्वांसुँडुं गामिनी
हेलाकृष्ट कुरंगशाबक मगुन् हीनस्थितिन् विंटिरे.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: