Wednesday, January 20, 2016

ప్రహ్లాదుని జన్మంబు - అని నారదోక్త

7-237-వ.
అని నారదోక్త ప్రకారంబున బాలకులకుఁ బ్రహ్లాదుం డిట్లనియె; ఈశ్వరమూర్తి యైన కాలంబునం జేసి వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధనాపచయ క్షీణత్వ పరిపాక నాశంబులు ప్రాప్తంబు లయిన తెఱంగున దేహంబులకుం గాని షడ్భావవికారంబు లాత్మకు లేవు; ఆత్మ నిత్యుండు క్షయరహితుండు శుద్ధుండు క్షేత్రజ్ఞుండు గగనాదులకు నాశ్రయుండుఁ గ్రియాశూన్యుండు స్వప్రకాశుండు సృష్టిహేతువు వ్యాపకుండు నిస్సంగుండుఁ బరిపూర్ణుండు నొక్కండు నని వివేకసమర్థంబు లగు "నాత్మలక్షణంబులు పండ్రెండు" నెఱుంగుచు, దేహాదులందు మోహజనకంబు లగు నహంకారమమ కారంబులు విడిచి పసిండిగనులు గల నెలవున విభ్రాజమాన కనక లేశంబులైన పాషాణాదులందుఁ బుటంబుపెట్టి వహ్నియోగంబున గరంగ నూది హేమకారకుండు పాటవంబున హాటకంబుఁ బడయు భంగి నాత్మకృత కార్యకారణంబుల నెఱింగెడి నేర్పరి దేహంబునం దాత్మసిద్ధికొఱకు నయిన యుపాయంబునం జేసి బ్రహ్మభావంబుఁ బడయు; మూలప్రకృతియు మహదహంకారంబులును బంచతన్మాత్రంబులు నివి యెనిమిదియుం "బ్రకృతు" లనియును, రజ స్సత్త్వ తమంబులు మూఁడును "బ్రకృతిగుణంబు" లనియుఁ, గర్మేంద్రియంబు లయిన వాక్పాణి పాద పాయూపస్థంబులును జ్ఞానేంద్రియంబు లైన శ్రవణ నయన రసనా త్వగ్ఘ్ర్రాణంబులును మనంబును మహీ సలిల తేజో వాయు గగనంబులును నివి "పదాఱును వికారంబు" లనియును, గపిలాది పూర్వాచార్యులచేతఁ జెప్పబడియె; సాక్షిత్వంబున నీ యిరువదే డింటిని నాత్మగూడి యుండు; పెక్కింటి కూటువ దేహ; మదియు జంగమస్థావరరూపంబుల రెండువిధంబు లయ్యె; మూలప్రకృతి మొదలయిన వర్గంబునకు వేఱై మణిగణంబులఁ జొచ్చి యున్న సూత్రంబు చందంబున నాత్మ యన్నింటి యందునుం జొచ్చి దీపించు; ఆత్మకు జన్మ స్థితి లయంబులు గల వంచు మిథ్యాతత్పరులు గాక వివేకశుద్ధమైన మనంబునం జేసి దేహంబునం దాత్మ వెదకవలయు; ఆత్మకు "నవస్థలు" గలయట్లుండుఁ గాని యవస్థలు లేవు జాగరణ స్వప్న సుషుప్తు లను "వృత్తు" లెవ్వనిచేత నెఱుంగంబడు నతం డాత్మ యండ్రు; కుసుమ ధర్మంబు లయిన గంధంబుల చేత గంధాశ్రయు డయిన వాయువు నెఱింగెడు భంగిం ద్రిగుణాత్మకంబులయి కర్మ జన్యంబు లయిన బుద్ధి భేదంబుల నాత్మ నెఱుంగం దగు" నని చెప్పి.
[షోడశ వికారములు] - - - [షడ్వికారములు] - - - [ఆత్మ ద్వాదశ లక్షణములు] - - - [సప్తవింశతి తత్వములు]
టీకా:
          అని = అని; నారద = నారదునిచే; ఉక్త = చెప్పబడిన; ప్రకారంబునన్ = విధముగ; బాలకుల్ = పిల్లవాండ్ర; కున్ = కు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఈశ్వరుని = భగవంతుని యొక్క; మూర్తి = స్వరూపము; ఐన = అయిన; కాలంబునన్ = కాలము; చేసి = వలన; వృక్షంబులు = చెట్లు; కలుగుచుండన్ = ఉండగా; ఫలంబున్ = పండున; కున్ = కు; జన్మ = పుట్టుట, పిందెకాయుట; సంస్థాన = కాయగుట; వర్ధన = పెరుగుట; అపచయ = ముదురుట; క్షీణత = ఎండిపోవుట; పరిపాక = పండుట; నాశంబులు = నశించిపోవుటలు; ప్రాప్తంబులు = కలిగినవి; అయిన = ఐన; తెఱంగునన్ = విధముగ; దేహంబుల్ = శరీరములకే; కాని = కాని; షడ్వికారంబులు = పరివర్తనలారును {షడ్వికారములు - 1జన్మ(పుట్టుట) 2సంస్థాన (నిలబడుట) 3వర్ధన (పెరుగుట) 4అపక్షయ (బలియుట) 5పరిపాక (పరిక్వమగుట) 6నాశము (నశించుట) అనెడి ఆరు మార్పులు}; ఆత్మ = ఆత్మ; కున్ = కు; లేవు = లేవు; ఆత్మ = ఆత్మ; నిత్యుండు = శాశ్వతమైనవాడు; క్షయ = నాశము; రహితుండు = లేనివాడు; శుద్ధుండు = నిర్మలుడు; క్షేత్రజ్ఞుండు = మాయనెరిగినవాడు, జీవుడు; గగనాదుల్ = పంచభూతముల {పంచభూతములు - 1ఆకాశము 2భూమి 3నీరు 4వాయువు 5తేజము}; కున్ = కు; ఆశ్రయుండు = ఆధారమైనవాడు; క్రియా = కర్మములు; శూన్యుండు = లేనివాడు; స్వప్రకాశుండు = స్వయముగాప్రకాశించువాడు; సృష్టి = సృష్టికి; హేతువు = కారణమైనవాడు; వ్యాపకుండు = అంతటవ్యాపించువాడు; నిస్సంగుడున్ = తగులములులేనివాడు; పరిపూర్ణుండున్ = అంతటను నిండినవాడు; ఒక్కరుండును = కేవలుడు; అని = అని; వివేక = జ్ఞానమును; సమర్థంబులు = ఈయగలిగినవి; అగు = అయిన; ఆత్మ = ఆత్మ యొక్క; లక్షణంబులు = లక్షణములు; పండ్రెండును = పన్నిండింటిని; ఎఱుంగుచున్ = తెలిసుండి; దేహాదులు = దేహగేహపుత్రకళత్రాదులు; అందున్ = ఎడల; మోహ = తగులములను; జనకంబులు = పుట్టించునవి; అగు = అయిన; అహంకార = నేను యనెడి భావము; మమకారంబులు = నాది యనెడి భావములను; విడిచి = వదలిపెట్టి; పసిడి = బంగారు; గనులు = గనులు, పుట్టుచోటులు; కల = కలిగిన; నెలవునన్ = స్థానములను; విభ్రాజమాన = మెరుస్తున్న; కనక = బంగారము; లేశంబులు = కొద్దిపాటిది; ఐన = కలిగిన; పాషాణ = రాళ్ళు; ఆదులు = మొదలగువాని; అందున్ = అందు; పుటంబున్ = పుటములో; పెట్టి = పెట్టి; వహ్ని = అగ్నితో; యోగంబునన్ = కూడించుటద్వారా; కరంగన్ = కరిగిపోవునట్లు; ఊది = ఊది; హేమకారకుండు = స్వర్ణకారుడు; పాటవంబునన్ = నేరుపుతో; హాటకంబున్ = బంగారమును; పడయు = పొందెడి; భంగిన్ = వలె; ఆత్మ = ఆత్మ; కృత = కలిగిన; కార్య = కార్యములు; కారణంబులన్ = హేతువులు; ఎఱింగెడి = తెలియగల; నేర్పరి = ఉపాయశాలి; దేహంబున్ = శరీరము; అందున్ = లోని; ఆత్మ = ఆత్మయొక్క; సిద్ధి = తాదాత్మ్యముపొందుట; కొఱకున్ = కోసము; అయిన = ఐన; ఉపాయంబునన్ = ఉపాయములచేత; చేసి = వలన; బ్రహ్మభావంబున్ = బ్రహ్మత్వమును; పడయున్ = పొందును; మూలప్రకృతియున్ = మాయ; మహత్ = బుద్ధి; అహంకారంబులు = అహంకారములు; తన్మాత్రంబులున్ = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్ద 2స్పర్శ 3రూప 4రస 5గంధములు}; ఇవి = ఇవి; ఎనిమిదియున్ = ఎనిమిది (8); ప్రకృతులు = ప్రకృతులు {ప్రకృతులు - 1మాయ 2మహత్తు 3అహంకారము మరియు పంచతన్మాత్రలు ఐదు (5)}; అనియునున్ = అని; రజస్ = రజోగుణము; సత్త్వ = సత్త్వగుణము; తమంబులు = తమోగుణము లు; మూడును = మూడింటిని (3); ప్రకృతిగుణంబులు = ప్రకృతిగుణములు; అనియున్ = అని; కర్మేంద్రియంబులు = పనిచేయుటకైనసాధనములు {కర్మేంద్రియములు - 1నోరు 2చేతులు 3కాళ్ళు 4గుదము 5ఉపస్థు}; అయిన = ఐన; వాక్ = నోరు; పాణి = చేతులు; పాద = కాళ్ళు; పాయుః = గుదము; ఉపస్థంబులు = జననేంద్రియములు; జ్ఞానేంద్రియంబులు = తెలిసికొనెడి సాధనములు {జ్ఞానేంద్రియములు - 1చెవులు 2కళ్ళు 3నాలుక 4చర్మము 5ముక్కు}; ఐన = అయిన; శ్రవణ = చేవులు; నయన = కళ్ళు; రసన = నాలుక; త్వక్ = చర్మము; ఘ్రాణంబులును = ముక్కు లు; మనంబును = మనస్సు; మహి = భూమి {భూతపంచకము - 1భూమి 2నీరు 3నిప్పు 4గాలి 5ఆకాశము}; సలిల = నీరు; తేజస్ = నిప్పు; వాయు = గాలి; గగనంబులు = ఆకాశములు; ఇవి = ఇవి; పదాఱును = పదహారు (16); వికారంబులు = వికారములు {వికారములు - కర్మేద్రియములు (5) జ్ఞానేంద్రియములు (5) మనస్సు భూతపంచకము (5) మొత్తము 16 వికారములు}; అనియునున్ = అని; కపిల = కపిలుడు; ఆది = మొదలగు; పూర్వ = పూర్వకాలపు; ఆచార్యుల్ = సిద్ధాంతకర్తల, గురువుల; చేత = చేత; చెప్పబడియెన్ = చెప్పబడినది; సాక్షిత్వంబునన్ = తటస్థలక్షణముచేత; ఈ = ఈ; యిరువదేడింటిని = యిరవైయేడింటిని (27); ఆత్మ = ఆత్మ; కూడి = కలిసి; ఉండున్ = ఉండును; పెక్కింటి = అనేకమైనవాని; కూటువ = కూడినదియైన; దేహము = శరీరము; అదియున్ = అదికూడ; జంగమ = చలనముకలవి, చరములు; స్థావరములు = స్థిరముగనుండునవి; రూపంబులన్ = అనెడ రూపములతో; రెండు = రెండు (2); విధంబులు = రకములు; అయ్యె = అయ్యెను; మూలప్రకృతి = అవిద్య, మాయ; మొదలయిన = మొదలైనవాని; వర్గంబున్ = సమూహమున; కున్ = కు; వేఱై = విలక్షణమై, భిన్నమై; మణి = మణుల; గణంబులన్ = వరుసలలో; చొచ్చి = దూరి; ఉన్న = ఉన్నట్టి; సూత్రంబు = దారము; చందంబునన్ = వలె; ఆత్మ = ఆత్మ; అన్నిటన్ = అన్నిటి; అందున్ = లోను; చొచ్చి = అంతర్లీనమై యుండి; దీపించు = ప్రకాశించును; ఆత్మ = ఆత్మ; కున్ = కు; జన్మ = పుట్టుక; స్థితి = ఉండుట; లయంబులు = నాశనములు; కలవు = ఉన్నవి; అంచున్ = అనుచు; మిథ్యా = అసత్యమున; తత్పరులు = కూడినవారు; కాక = కాకుండ; వివేక = జ్ఞానముచేత; శుద్ధులు = నిర్మలమైనవారు; ఐన = అయిన; మనంబునన్ = మనసు; చేసి = వలన; దేహంబున్ = దేహము; అందున్ = లో; ఆత్మన్ = ఆత్మను; వెదుకవలయున్ = వెతకవలెను; ఆత్మ = ఆత్మ; కున్ = కు; అవస్థలు = అవస్థాత్రయము {అవస్థాత్రయము - స్థితి అభాసములు మూడు, 1జాగరణ(మెలకువ) 2స్వప్న(కల) 3సుషుప్తి (నిద్ర)}; కల = కలిగిన; అట్లు = విధముగ; ఉండున్ = ఉండును; కాని = కాని; అవస్థలు = అవస్థలు; లేవు = లేవు; జాగరణ = మెలకువ; స్వప్న = కల; సుషుప్తులు = నిద్రలు; అను = అనెడి; వృత్తులు = అవస్థలు, వ్యాపారములు; ఎవ్వని = ఎవని; చేతన్ = చేతను; ఎఱుంబడున్ = తెలిసికొనబడునో; అతండు = అతడు; ఆత్మ = ఆత్మ; అండ్రు = అంటారు; కుసుమ = పూవుల యొక్క; ధర్మంబులు = లక్షణములు; అయిన = ఐన; గంధంబుల్ = వాసనల; చేతన్ = వలన; గంధా = వాసనను; ఆశ్రయుండు = వహించువాడు; అయిన = ఐన; వాయువున్ = గాలిని; ఎఱింగెడు = తెలిసికొను; భంగిన్ = విధముగనే; గుణా = గుణత్రయము {గుణత్రయము - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; ఆత్మకంబులు = స్వరూపములగాగలవి; అయి = అయ్యి; కర్మ = కర్మములచేత; జన్యంబులు = పుట్టునవి; అయిన = ఐన; బుద్దిబేధంబులన్ = చిత్తవృత్తులచేత; ఆత్మన్ = ఆత్మను; ఎఱుంగన్ = తెలిసికొన; తగును = వచ్చును; అని = అని; చెప్పి = చెప్పి.
భావము:
            అని నారదమహర్షి బోధించినది అంతా అదే ప్రకారంగా తన సహాధ్యాయులైన దానవ బాలురకు ఇలా తెలియజెప్పాడు. కాలం భగవంతుని స్వరూపం. కాలక్రమంలో వృక్షం పుట్టి ఫలమిస్తుంది. ఆ ఫలానికి పుట్టటం, వృద్ధి పొందటం, పండటం, ఎండటం, కృశించటం, నశించటం అనే క్రమం తప్పదు. అలాగా షడ్వికారాలు అనబడు ఈ ఆరు (6) విధాలైన భావవికారాలు దేహానికి కూడా ఉంటాయి. అంతేకాని ఆత్మకు మాత్రం ఈ మార్పులు ఏమాత్రం ఉండవు. ఆత్మ శాశ్వతమైనది; నాశనం లేనిది; వికారాలు లేనిది; శుద్ధమైనది; జీవుల ఆత్మ యందుండునది; ఆకాశం మున్నగువానికి ఆశ్రయమైనది; క్రియాశూన్యత్వము; స్వయం ప్రకాశం; సృష్టికి కారణం; వ్యాపించు స్వభావం కలది; సంగం లేనిది; పరిపూర్ణమైనది. ఈ విధంగా ఈ పన్నెండు (12) ఆత్మ లక్షణాలు అని పెద్దలు చెప్తారు. 
            బంగారం గనులలో బంగారం రేణువు రాయి రప్పలతో కలిసి ఉంటాయి. ఆ రాళ్ళను స్వర్ణకారులు అగ్నిలో పుటం పెట్టి, కరగబెట్టి, నేర్పుగా వాటిలోంచి బంగారం వెలికి తీస్తారు. అదే విధంగా ఆత్మతత్వం తెలిసినవారు దేహం వంటి వాటిపై భ్రాంతిని కలిగించే అహంకారాలు, మమకారాలు విడిచిపెట్టి దేహాదుల కంటె ఆత్మను భిన్నంగా భావించి తెలివిగా బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందుతారు. 
(అ) మూలప్రకృతి, మహత్తు, అహంకారం, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఎనిమిది (8) “ప్రకృతులు” (అష్టప్రకృతులు) అంటారు.
(ఇ) సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ మూడు (3) “ప్రకృతి గుణాలు”. 
(ఉ) నోరు, చెయ్యి, కాలు, గుదం, మర్మావయవం అనే ఈ అయిదు (5) కర్మేంద్రియాలు; కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక అనే ఈ అయిదు (5) జ్ఞానేంద్రియాలు; నేల, నీరు, ఆకాశం, గాలి, అగ్ని అనే ఈ అయిదు (5) పంచభూతాలు; మనసు ఒకటి (1); మొత్తం ఈ పదహారు (16) వికారాలు అంటారని కపిల మహర్షి వంటి పూర్వాచార్యులు చెప్పారు.
ఈ మొత్తం ఇరవైఏడింటిలోను (27) ఆత్మ సాక్షీభూతంగా ఉంటుంది.
ఈ విధమైన అనేక పదార్థాలతో తయారైనది ఈ దేహం. ఈ దేహాన్ని స్థిరం అని, చరం అని రెండు విధాలుగా భావించవచ్చు. మూలప్రకృతి మొదలైన వాటికన్నా భిన్నమైన ఆత్మ, పూసలలో దారం లాగ, ఇన్నంటిలోనూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మకు జనన స్థితి మరణాలు ఉన్నాయని మాయలో పడకుండా వివేకంతో ఆలోచించాలి. దేహంలో ఆత్మను అన్వేషించాలి. ఆత్మకు అవస్థలు ఉన్నట్లు అనిపిస్తాయి. కాని నిజానికి ఆత్మకు ఏ అవస్థలు లేవు. జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు. పూలకు ఉండే సువాసనల ద్వారా వాయువును తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకములు, కర్మజన్యములు అయిన బుద్ధిభేదాల వలన ఆత్మను తెలుసుకోవచ్చు.” అని తెలిపి ఇంకా ఇలా అన్నాడు.
७-२३७-व.
अनि नारदोक्त प्रकारंबुन बालकुलकुँ ब्रह्लादुं डिट्लनिये; ईश्वरमूर्ति यैन कालंबुनं जेसि वृक्षंबु गलुगुचुंड फलंबुनकु जन्म संस्थान वर्धनापचय क्षीणत्व परिपाक नाशंबुलु प्राप्तंबु लयिन तेर्रंगुन देहंबुलकुं गानि षड्भावविकारंबु लात्मकु लेवु; आत्म नित्युंडु क्षयरहितुंडु शुद्धुंडु क्षत्रज्ञुंडु गगनादुलकु नाश्रयुंडुँ ग्रियाशून्युंडु स्वप्रकाशुंडु सृष्टिहतुवु व्यापकुंडु निस्संगुंडुँ बरिपूर्णुंडु नोक्कंडु ननि विवकसमर्थंबु लगु "नात्मलक्षणंबुलु पंड्रेंडु" नेर्रुंगुचु, दएहादुलंदु मोहजनकंबु लगु नहंकारमम कारंबुलु विडिचि पसिंडिगनुलु गल नेलवुन विभ्राजमान कनक लेशंबुलैन पाषाणादुलंदुँ बुटंबुपेट्टि वह्नियोगंबुन गरंग नूदि हमकारकुंडु पाटवंबुन हाटकंबुँ बडयु भंगि नात्मकृत कार्यकारणंबुल नेर्रिंगेडि नेर्परि देहंबुनं दात्मसिद्धिकोर्रकु नयिन युपायंबुनं जेसि ब्रह्मभावंबुँ बडयु; मूलप्रकृतियु महदहंकारंबुलुनु बंचतन्मात्रंबुलु निवि येनिमिदियुं "ब्रकृतु" लनियुनु, रज स्सत्त्व तमंबुलु मूँडुनु "ब्रकृतिगुणंबु" लनियुँ, गर्मेंद्रियंबु लयिन वाक्पाणि पाद पायूपस्थंबुलुनु ज्ञानेंद्रियंबु लैन श्रवण नयन रसना त्वग्घ्र्राणंबुलुनु मनंबुनु मही सलिल तजो वायु गगनंबुलुनु निवि "पदार्रुनु विकारंबु" लनियुनु, गपिलादि पूर्वाचार्युलचेतँ जेप्पबडिये; साक्षित्वंबुन नी यिरुवद डिंटिनि नात्मगूडि युंडु; पेक्किंटि कूटुव दह; मदियु जंगमस्थावररूपंबुल रेंडुविधंबु लय्ये; मूलप्रकृति मोदलयिन वर्गंबुनकु वर्रै मणिगणंबुलँ जोच्चि युन्न सूत्रंबु चंदंबुन नात्म यन्निंटि यंदुनुं जोच्चि दीपिंचु; आत्मकु जन्म स्थिति लयंबुलु गल वंचु मिथ्यातत्परुलु गाक विवेकशुद्धमैन मनंबुनं जेसि देहंबुनं दात्म वेदकवलयु; आत्मकु "नवस्थलु" गलयट्लुंडुँ गानि यवस्थलु लवु जागरण स्वप्न सुषुप्तु लनु "वृत्तु" लेव्वनिचेत नेर्रुंगंबडु नतं डात्म यंड्रु; कुसुम धर्मंबु लयिन गंधंबुल चत गंधाश्रयु डयिन वायुवु नेर्रिंगेडु भंगिं द्रिगुणात्मकंबुलयि कर्म जन्यंबु लयिन बुद्धि भेदंबुल नात्म नेर्रुंगं दगु" ननि चेप्पि.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: