Friday, January 15, 2016

ప్రహ్లాదుని జన్మంబు - అని దేవముని

7-232-వ.
అని దేవముని నిర్దేశించిన నతని వచనంబు మన్నించి తానును హరిభక్తుండు గావున దేవేంద్రుండు భక్తి బాంధవంబున మా యవ్వను విడిచి వలగొని సురలోకంబునకుం జనియె; మునీంద్రుండును మజ్జనని యందుఁ బుత్రికాభావంబు జేసి యూఱడించి; నిజాశ్రమంబునకుం గొనిపోయి "నీవు పతివ్రతవు, నీ యుదరంబునఁ బరమభాగవతుండయిన ప్రాణి యున్నవాఁడు తపోమహత్త్వంబునం గృతార్థుండై నీ పెనిమిటి రాఁగలం; డందాక నీ విక్కడ నుండు" మనిన సమ్మతించి.
టీకా:
          అని = అని; దేవముని = దేవర్షి; నిర్దేశించినన్ = చెప్పగా; అతని = అతని; వచనంబులు = మాటలు; మన్నించి = గౌరవించి; తానును = తను కూడ; హరి = నారాయణుని; భక్తుండు = భక్తుడు; కావునన్ = కనుక; దేవేంద్రుండు = ఇంద్రుడు; భక్తి = భక్తిమూలకమైన; బాంధవంబునన్ = బంధుత్వముతో; మా = మా యొక్క; అవ్వను = తల్లిని; విడిచి = వదలి; వలగొని = ప్రదక్షిణముచేసి; సురలోకంబున్ = స్వర్గలోకమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; ముని = మునులలో; ఇంద్రుండును = శ్రేష్ఠుడు; మత్ = నా యొక్క; జనని = తల్లి; అందు = ఎడల; పుత్రికా = కుమార్తె యనెడి; భావంబున్ = తలంపు; చేసి = చేసి; ఊఱడించి = ఊరుకోబెట్టి; నిజ = తన; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; కొనిపోయి = తీసుకెళ్ళి; నీవు = నీవు; పతివ్రతవు = పతిభక్తిగల యిల్లాలువి; నీ = నీ యొక్క; ఉదరంబునన్ = కడుపులో; పరమ = అతిపవిత్రమైన; భాగవతుండు = భాగవతుడు; అయిన = ఐనట్టి; ప్రాణి = జీవుడు; ఉన్నవాడు = ఉన్నాడు; తపస్ = తపస్సుయొక్క; మహత్వంబునన్ = గొప్పదనముచేత; కృతార్థుండు = నెరవేరినపనిగలవాడు; ఐ = అయ్యి; నీ = నీ యొక్క; పెనిమిటి = భర్త; రాగలండు = వచ్చును; అందాక = అప్పటివరకు; నీవు = నీవు; ఇక్కడ = ఇక్కడ; ఉండుము = ఉండుము; అనినన్ = అనగా; సమ్మతించి = అంగీకరించి.
భావము:
            ఇంద్రుడు నారదమహర్షి చెప్పిన ఆ మాటలను ఆమోదించాడు. మా అమ్మకు నమస్కారం చేసి, విడిచిపెట్టాడు. తాను కూడ విష్ణుభక్తుడే కాబట్టి ఆ భక్తి బంధుత్వంతో మా అమ్మకు ప్రదక్షిణ చేసి తన దేవలోకానికి వెళ్ళిపోయాడు. నారదమహర్షి మా తల్లిని కూతురుగా భావించి, ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. “అమ్మా! నువ్వు పరమ పతివ్రతవు. నీ కడుపులో మహాభక్తుడు అయిన జీవుడు ఒకడు పెరుగుతున్నాడు. నీ భర్త తపస్సు చేసి తప్పక వరాలు పొంది తిరిగి వస్తాడు. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు” అని నారదుడు ధైర్యం చెప్పాడు. మా అమ్మ అంగీకరించింది.
७-२३२-व.
अनि देवमुनि निर्देशिंचिन नतनि वचनंबु मन्निंचि तानुनु हरिभक्तुंडु गावुन देवेंद्रुंडु भक्ति बांधवंबुन मा यव्वनु विडिचि वलगोनि सुरलोकंबुनकुं जनिये; मुनींद्रुंडुनु मज्जननि यंदुँ बुत्रिकाभावंबु जेसि यूर्रडिंचि; निजाश्रमंबुनकुं गोनिपोयि "नीवु पतिव्रतवु, नी युदरंबुनँ बरमभागवतुंडयिन प्राणि युन्नवाँडु तपोमहत्त्वंबुनं गृतार्थुंडै नी पेनिमिटि राँगलं; डंदाक नी विक्कड नुंडु" मनिन सम्मतिंचि.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: