7-241-వ.
కావున, రాగాదియుక్త మనస్కుం
డయిన శరీరికి సంసారచక్రనివర్తకం బయిన హరిచింతనంబు బ్రహ్మమందలి నిర్వాణసుఖం
బెట్టిదట్టి దని బుధులు దెలియుదురు; హరిభజనంబు దుర్గమంబుగాదు;
హరి సకల ప్రాణిహృదయంబుల యందు నంతర్యామియై యాకాశంబు భంగి నుండు;
విషయార్జనంబుల నయ్యెడిది లేదు; నిమిషభంగుర
ప్రాణు లయిన మర్త్యులకు మమతాస్పదంబులును జంచలంబులును నైన పుత్ర మిత్ర కళత్ర పశు
భృత్య బల బంధు రాజ్య కోశ మణి మందిర మంత్రి మాంతంగ మహీ ప్రముఖ విభవంబులు
నిరర్థకంబులు; యాగ ప్రముఖ పుణ్యలబ్దంబు లైన స్వర్గాదిలోక
భోగంబులు పుణ్యానుభవక్షీణంబులు గాని నిత్యంబులు గావు; నరుండు
విద్వాంసుండ నని యభిమానించి కర్మంబు లాచరించి యమోఘంబు లయిన విపరీత ఫలంబుల నొందు;
కర్మంబులు గోరక చేయవలయు; కోరి చేసిన దుఃఖంబులు
ప్రాపించు; పురుషుండు దేహంబుకొఱకు భోగంబుల నపేక్షించు;
దేహంబు నిత్యంబు కాదు తోడ రాదు; మృతం బైన దేహంబును
శునకాదులు భక్షించు; దేహి కర్మంబు లాచరించి కర్మబద్ధుండయి
క్రమ్మఱం గర్మానుకూలంబయిన దేహంబుఁ దాల్చు; అజ్ఞానంబునం జేసి
పురుషుండు కర్మదేహంబుల విస్తరించు; అజ్ఞాన తంత్రంబులు
ధర్మార్థ కామంబులు; జ్ఞాన లభ్యంబు మోక్షంబు; మోక్షప్రదాత యగు హరి సకల భూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; తన చేత నయిన మహాభూతంబులతోడ జీవసంజ్ఞితుండై యుండు; నిష్కాములై
హృదయగతుం డయిన హరిని నిజభక్తిని భజింపవలయు.
టీకా:
కావునన్ = కనుక; రాగాది = రాగద్వేషాదులతో {రాగద్వేషాదులు - 1రాగము 2ద్వేషము
3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము};
యుక్త = కూడిన; మనస్కుండు = మనసుగలవాడు;
అయిన = ఐన; శరీరి = జీవుని, దేహి; కిన్ = కి; సంసార = సంసారమనెడి;
చక్ర = చక్రమునుండి; నివర్తకంబు = మరలజేయునది;
అయిన = ఐన; హరి = నారాయణుని; చింతనంబు = ధ్యానము; బ్రహ్మము = పరబ్రహ్మము; అందలి = లోని; నిర్వాణ = మోక్షము యొక్క; సుఖంబున్ = సుఖము; ఎట్టిద = ఎలాంటిదో; అట్టిది = అలాంటిది; అని = అని; బుధులు = జ్ఞానులు; తెలియుదురు = తెలిసి యుందురు;
హరి = నారాయణుని {హరి - భక్తుల హృదయములను
ఆకర్షించువాడు, విష్ణువు}; భజనంబు =
సేవ; దుర్గమంబు = పొందరానిది; కాదు =
కాదు; హరి = విష్ణువు; సకల = అఖిలమైన;
ప్రాణి = జీవుల; హృదయంబుల్ = హృదయముల; అందున్ = లోను; అంతర్యామి = లోన వ్యాపించినవాడు;
ఐ = అయ్యి; ఆకాశంబు = ఆకాశము; భంగిన్ = వలె; ఉండున్ = ఉండును; విషయ = ఇంద్రియార్థముల, భోగముల; ఆర్జనంబులన్ = సంపాదించుటవలన; అయ్యెడిది = కలిగెడి లాభము;
లేదు = లేదు; నిమిష = రెప్పపాటులో; భంగుర = చెడిపోవు; ప్రాణులు = ప్రాణములుగలవారు;
అయిన = ఐన; మర్త్యుల్ = మానవుల {మర్త్యులు - మరణించెడి నైజముగలవారు, మనుషులు};
కున్ = కు; మమతా = నాదియనెడి మోహమునకు;
ఆస్పదంబులు = స్థానములైనవి; చంచలంబులు =
అస్థిరములు {చంచలములు - మిక్కిలి చలించెడివి, అస్థిరములు}; ఐన = అయిన; పుత్ర
= సంతానము; మిత్ర = స్నేహితులు; కళత్ర
= భార్యలు; పశు = గొడ్లు; భృత్య =
సేవకులు; బల = సైన్యము; బంధు =
చుట్టములు; రాజ్య = రాజ్యాధికారము; కోశ
= కోశాగారము; మణి = రత్నాదులు; మందిర =
భవనములు; మంత్రి = సచివులు; మాతంగ =
ఏనుగులు {మాతంగము - మతంగజము, మతంగుడను
ఋషివలన పుట్టినది, ఏనుగు}; మహీ =
రాజ్యము, భూములు; ప్రముఖ = మొదలగు
ముఖ్యమైన; విభవంబులు = వైభవములు; నిరర్థకంబులు
= ప్రయోజనములేనివి; యాగ = యజ్ఞములు; ప్రముఖ
= మొదలగు ముఖ్యమైన; పుణ్య = పుణ్యములవలన; లబ్దంబులు = దొరకునవి; ఐన = అయిన; స్వర్గ = స్వర్గవాసము; ఆది = మొదలగు; భోగంబులు = భోగములు; పుణ్య = పుణ్యములకు; అనుభవ = అనుభవించుటచే; క్షీణంబులు = తగ్గించెడివి;
కాని = తప్పించి; నిత్యంబులు = శాశ్వతములు;
కావు = కావు; నరుండు = మానవుడు; విద్వాంసుడను = తెలిసినవాడను; అని = అని; అభిమానించి = అహంకరించి; కర్మంబుల్ = కర్మములను;
ఆచరించి = చేసి; అమోఘంబులు = వ్యర్థముగానివి; అయిన = ఐన; విపరీత
= ప్రతికూలమైన; ఫలంబులన్ = ఫలితములను; ఒందు
= పొందును; కర్మంబులున్ = కర్మలను; కోరక = ఫలాపేక్షలేక; చేయవలయున్ = చేయవలయును; కోరి = ఫలమపేక్షించి; చేసినన్ = చేసినట్లయినచో;
దుఃఖంబులు = దుఃఖములు; ప్రాపించున్ = పొందును;
పురుషుండు = మానవుడు; దేహంబున్ = శరీరము;
కొఱకున్ = కోసము; భోగంబులన్ = స్రక్చందనాదులు {భోగాష్టకములు - 1పుష్పమాలిక 2గంధము
3వస్త్రము 4అన్నము 5శయ్య
6తాంబూలము 7స్త్రీ 8గానములు, స్రక్చందనాదులు}; అపేక్షించి
= కోరి; అపేక్షించును = కావాలని కోరును; దేహంబున్ = శరీరము; నిత్యంబు = శాశ్వతమైనది; కాదు = కాదు; తోడన్
= మరణించిన జీవుని వెంబడి; రాదు = రాదు; మృతంబు = ప్రాణములుబాసినది; ఐన = అయిన; దేహంబును = దేహమును; శునక = కుక్కలు; ఆదులు = మొదలగునవి; భక్షించున్ = తినును; దేహి = జీవుడు; కర్మంబులు = కర్మలను; ఆచరించి = చేసి, కూడిచరించి; కర్మ
= కర్మములకు; బద్ధుండు = కట్టబడినవాడు; అయి = అయ్యి; క్రమ్మఱన్ = మరల; కర్మా = కర్మములు చేయుటకు; అనుకూలంబు = తగినవి;
అయిన = ఐన; దేహంబున్ = శరీరమును; తాల్చున్ = ధరించును; అజ్ఞానంబునన్ = తెలియకపోవుట;
చేసి = వలన; పురుషుండు = మానవుడు; కర్మ = కర్మములను; దేహంబులన్ = శరీరములను; విస్తరించున్ = పెంచుకొనును; అజ్ఞాన
= అజ్ఞానముచేత; తంత్రంబులు = నడపబడునవి; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములు; జ్ఞాన = జ్ఞానముచేత; లభ్యంబు = దొరకునది; మోక్షంబు = ముక్తిపదము; మోక్ష = పరమపదమును; ప్రదాత = ఇచ్చువాడు; అగు = అయిన; హరి = విష్ణువు; సకల = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; కున్ = కు; ఆత్మేశ్వరుండు
= ఆత్మరూపుడైన ప్రభువు; ప్రియుండు = మిక్కిలి ఇష్ఠమైనవాడు;
తన = తన; చేతన్ = వలన; అయిన
= కల్పితములైన; మహాభూతంబుల్ = భూతపంచకంబు {మహాభూతములు - 1భూమి 2నీరు
3వాయువు 4అగ్ని 5 ఆకాశము
అనెడి ఐదు భూతములు}; తోడన్ = తోటి; జీవ
= జీవుడు యనెడి; సంజ్ఞితుండు = పేరుగలవాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; నిష్కాములు
= కోరికలులేనివారు; ఐ = అయ్యి; హృదయ =
హృదయమునందు; గతుండు = ఉన్నవాడు; అయిన =
ఐన; హరిని = విష్ణుని; నిజ = అచ్చపు;
భక్తిని = భక్తితో; భజింపవలయున్ = సేవింపవలయును.
భావము:
కాబట్టి, రాగాదులతో బద్ధుడై కోరికల
వలలో పడిన మానవుడికి ఈ సంసార చక్రాన్ని ఛేదించాలి అంటే విష్ణు సంకీర్తన ఒక్కటే
ఉపాయం. “పరబ్రహ్మంతో ఐక్యం అయితే అనుభవించే ఆనందం ఎంతటిదో, అంతటి
ఆనందాన్ని శ్రీహరి ఆరాధన అందిస్తుంది” అని పండితులు చెప్తారు. మాధవుడిని సేవించటం
కష్టమైన పని కాదు. విష్ణువు సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామి అయి ఆకాశం వలె
వ్యాపించి ఉంటాడు. సిరి సంపదలు సంపాదించటం వలన ఏమాత్రం సుఖం లేదు. మానవుల జీవితాలు
క్షణభంగురాలు. ఇలాంటి మానవులకు మమత, అనుబంధాలు, పెంచే భార్యాపిల్లలు, బంధుమిత్రులు, మడిమాన్యాలు, పాడిపంటలు, రాజ్య
కోశాలు, మణిమందిరాలు, మంత్రులు,
మత్తేభాలు మొదలైనవి అన్ని అనవసరమైనవి, అస్థిరమైనవి.
యజ్ఞ యాగాదుల వలన లభించే స్వర్గ సుఖాలు శాశ్వతాలు కావు, అవి
పుణ్యం క్షీణించగానే నశించేవే. తాను ఘనుడను అనుకుని, మానవుడు
తనపై తాను అభిమానం పెంచుకుని, వివిధ కర్మలు ఆచరించి
విపరీతమైన ఫలితాలు విశేషంగా పొందుతాడు. కోరికలతో చేసే కర్మలన్నీ దుఃఖాలనే
కలిగిస్తాయి. కనుక, ఎటువంటి కోరికలు లేకుండా కర్మలు
ఆచరించాలి. దేహం ధరించినవాడు దేహి, దేహి తన దేహం కోసం భోగాలు
కోరుకుంటాడు. కానీ, దేహం శాశ్వతమైనది కాదు, తనతో వచ్చేదీ కాదు. ప్రాణం పోగానే ఈ శరీరం కుక్కలు, నక్కలు
పాలవటానికి పనికి వస్తుంది అంతే. దేహం ధరించిన వ్యక్తి కర్మలను చేసి, ఆ కర్మలకు బద్ధుడు అయిపోతాడు. మరల ఆ చేసిన కర్మలకు అనుకూలమైన దేహం
ధరిస్తాడు. అజ్ఞానం వలన కర్మలు అధికంగా చేయటం, మరల మరల
దేహాలు ధరిస్తూ ఉండటం. ఇలా కర్మ దేహాలలో పురుషుడు సంచరిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో
కూడిన కర్మలు ధర్మార్థకామాలను మాత్రమే అందిస్తాయి. జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని
ప్రసాదిస్తుంది. ఆ మోక్షాన్ని అందించేవాడు విష్ణువు మాత్రమే. సర్వ ప్రాణికోటికి ఆ
మోక్షప్రదాత అయిన శ్రీహరే ఆత్మేశ్వరుడు, ప్రియుడు. తన చేత
సృష్టించబడిన పంచభూతాలతో కూడిన వాడై ఆ పరమాత్మే “జీవుడు” అనబడతాడు. కాబట్టి,
ప్రతి వ్యక్తీ తమ హృదయంలో ఉండే ఆ భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా
సేవించాలి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment