Saturday, August 31, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_41

మున్ను గ్రాటవిలో

ము న్ను గ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో
న్నాహంబునఁ గాలకేయుల ననిం క్కాడుచోఁ బ్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచోఁ
న్నీ రెన్నడుఁ దేవు తండ్రి! చెపుమా ల్యాణమే చక్రికిన్?
1-353-Saa.
mu nnu graaTavilO varaahamunakai mukkaMTitO@M bOruchO
sannaahaMbuna@M gaalakaeyula naniM jakkaaDuchO@M braabhava
skannuMDai chanu kauravaeMdru panikai gaMdharvulaM dOluchO@M
gannee rennaDu@M daevu taMDri! chepumaa kalyaaNamae chakrikin^?
          కృష్ణ నిర్యాణానంతరం ద్వారక నుండి విచారంగా తిరిగొచ్చిన అర్జునుని ధర్మరాజు ఏ మైందని అడుగుతున్నాడు - ఇదేమి టయ్యా? కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. పూర్వం భయంకర మైన ఆ అడవిలో పంది కోసం మూడు కళ్ళున్న ఆ పరమేశ్వరునితో పోరే టప్పుడు కాని, సర్వసన్నాహాలతో వెళ్ళి కాలకేయులను కదనరంగంలో చీల్చి చెండాడే టప్పుడు కాని, పరువు పోయి వైభవం కోల్పోయిన దుర్యోధనుని విడిపించే పనిలో గంధర్వులను తరిమే టప్పుడు కాని ఇంతకు ముందు ఎప్పుడు కంట నీరు పెట్టి ఎరుగవు కదా. ఇప్పుడే మయిం దయ్యా? కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా? చెప్పు. 
               ము న్ను గ్రాటవిలో - మున్ను = ఇంతకు ముందు; ఉగ్ర = భయంకరమైన; అటవి = అడవి; లోన్ = అందు; వరాహమునకై - వరాహమున = పంది; కై = కోసము; ముక్కంటితోఁ బోరుచో - ముక్కంటి = శివుని {ముక్కంటి - మూడు కన్నులు ఉన్నవాడు, శివుడు}; తోన్ = తో; పోరు చోన్ = యుద్ధము చేయు నప్పుడు కాని; సన్నాహంబునఁ గాలకేయుల ననిం జక్కాడుచోఁ బ్రాభవ స్కన్నుండై - సన్నాహంబునన్ = పోరుకు దిగి నప్పుడు; కాలకేయులన్ = కాలకేయులను రాక్షసులను; అనిన్ = యుద్ధములో; జక్కాడు చోన్ = చెండాడుచు నున్నప్పుడు కాని; ప్రాభవ = వైభవమును; స్కన్నుండు = కోల్పోయిన వాడు; = అయ్యి; చను - చను = పోతున్న; కౌరవేంద్రు పనికై - కౌరవేంద్రు = దుర్యోధనుని {కౌరవేంద్రుడు - కురువంశపు రాజు, దుర్యోధనుడు}; పని = పని; కై = కోసము; గంధర్వులం దోలుచోఁ గన్నీ రెన్నడుఁ దేవు - గంధర్వులన్ = గంధర్వులను; తోలు చోన్ = పారదోలు నప్పుడు కాని; కన్నీరు = కన్నీరు; ఎన్నడున్ = ఎప్పుడును; తేవు = తీసుకొని రాలేదు, కార్చ లేదు; తండ్రి - తండ్రి = నాయనా; చెపుమా - చెపుమా = చెప్పుము; కల్యాణమే - కల్యాణమే = శుభమేనా; చక్రికిన్ - చక్రి = కృష్ణుని {చక్రి - చక్రాయుధము ధరించు వాడు / కృష్ణుడు}; కిన్ = కి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: