8-199-క.
విడు విడుఁ డని ఫణి పలుకఁగఁ
గడు భరమున మొదలఁ గుదురు గలుగమి గెడఁవై
బుడ బుడ రవమున నఖిలము
వడ వడ వడఁకఁగ మహాద్రి వనధి మునింగెన్.
అమృతమథన సమయంలో
వాసుకి “వదలండి వదలండి” అన్నాడు. మందర పర్వతం అడుగున కుదురు
లేకపోడంతో అధిక బరువు వలన పడిపోతూ సముద్రంలో “బుడ బుడ” మని మునిగింది.
దేవ రాక్షస సమూహం సమస్తం “వడ వడ” మని వణికింది.
విడు = విడిచి పెట్టండి; విడుఁ డని - విడుడు = విడిచి పెట్టండి; అని = అని; ఫణి = సర్పము; పలుకఁగఁ గడు - పలుకగన్ = అరుచుచుండగ; కడు = అధికమైన; భరమున - భరమునన్ = బరువువలన; మొదలఁ గుదురు గలుగమి గెడఁవై - మొదలన్ = క్రింద; కుదురు = కుదురు {కుదురు -
కుదురుగా నిలుచుటకు ఏర్పరచెడి పీఠము}; కలుగమి = లేకపోవుట చేత; కెడవు = ఒరిగినది, పతన మౌనది; ఐ = అయ్యి; బుడబుడ రవమున నఖిలము - బుడబుడ = బుడ బుడ యనెడి; రవమునన్ = శబ్దముతో; అఖిలమున్ = సర్వము; వడవడ = వడ వడ యని; వడఁకఁగ - వడకగన్ = వణికిపోగా; మహాద్రి - మహా = గొప్ప; అద్రి = కొండ; వనధి - వనధిన్ = సముద్రమునందు; మునింగెన్ = మునిగినది.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
No comments:
Post a Comment