1-269-సీ.
తిలక మేటికి లేదు తిలకనీతిలకమా!; పువ్వులు దుఱుమవా
పువ్వుఁబోఁడి!
కస్తూరి యలఁదవా కస్తూరికాగంధి!; తొడవులు
దొడవవా తొడవుతొడవ!
కలహంసఁ బెంపుదే కలహంసగామిని!; కీరముఁ
జదివింతె కీరవాణి!
లతలఁ బోషింతువా లతికాలలిత దేహ!; సరసి
నోలాడుదే సరసిజాక్షి!
ఆ. మృగికి మేఁత లిడుదె
మృగశాబలోచన!
గురుల నాదరింతె గురువివేక!
బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి!"
యనుచు సతుల నడిగె నచ్యుతుండు.
శ్రీకృష్ణులవారు ద్వారాకకి తిరిగొచ్చి తను నగరంలో లేక పోడంతో బహు
ఉదాసీనంగా ఉన్న తన ప్రియకాంతలను చూసి. “ నుదుటి
బొట్టంత ఉన్నతురాలా! నుదట బొట్టు ఎందుకు పెట్టుకోలేదు. పువ్వు అంతటి సుకుమారి! తలలో పూలు
పెట్టుకోవే. కస్తూరి పరిమాళాలు వెదజల్లే తన్వీ! కస్తురి
రాసుకోవే. అలంకారాలకే అందాన్నిచ్చే శోభనాంగి! ఆభరణాలు
అలంకరించుకోవే. హంసనడకల చిన్నదాన! కలహంసని పెంచుతున్నావా. చిలుకపలుకుల చిన్నారి! చిలుకకి మాటలు
నేర్పుతున్నావా లేదా. పూతీగె అంతటి సుకుమారమైన లతాంగి!
పూలమొక్కలు పెంచుతున్నావా. పద్మాక్షి! కొలనులో ఈతకొడు
తున్నావు కదా. లేడికన్నుల సుందరి! లేళ్ళకి
మేత మేపుతున్నావు కదా. గొప్ప వివేకవంతురాలా! పెద్దలను చక్కగా
గౌరవిస్తున్నావు కదా. బందుప్రేమకి
పెరుపొందిన పడతీ! బంధువుల నందరిని ఆదరిస్తున్నావు కదా.” అంటూ
ప్రియకాంతల నందరినీ పరామర్శించాడు.
తిలక మేటికి
- తిలకము = నుదిటి
బొట్టు;
ఏటి = ఎందుల; కిన్ = కు; లేదు
- లేదు = లేదు; తిలకనీతిలకమా
- తిలకనీ = తిలకము
ధరించువారిలో / స్త్రీలలో; తిలకమా = గౌరవింపదగినదానా; పువ్వులు దుఱుమవా
- పువ్వులున్ = పువ్వులను; తుఱుమవా = ధరింపవా; పువ్వుఁబోఁడి
- పువ్వున్ = పువ్వుల వంటి; బోఁడి = శరీరము
కలదానా;
కస్తూరి యలఁదవా - కస్తూరి = కస్తూరి
అనే శ్రేష్ఠ మైన సుగంధం; అలఁదవా = రాయవా; కస్తూరికాగంధి
- కస్తూరి కా = కస్తూరివంటి; గంధి = వాసన కలదానా; తొడవులు దొడవవా
- తొడవులు = ఆభరణములు; తొడవవా = ధరింపవా; తొడవుతొడవ
- తొడవు = ఆభరణములకే; తొడవ = ఆభరణమా; కలహంసఁ బెంపుదే
- కలహంసన్ = (మధుర
కంఠధ్వని) కలహంసలను; పెంపుదే = పెంచుతున్నావా; కలహంసగామిని
- కలహంస = చక్కటిహంస; గామిని = నడక కలదానా; కీరముఁ జదివింతె
- కీరమున్ = చిలుకలకు; చదివింతె = మాటలు చెప్పుతావా; కీరవాణి
- కీర = చిలుకపలుకుల
వంటి;
వాణి = కంఠము కలదానా; లతలఁ బోషింతువా
- లతలన్ = లతలను; పోషింతువా = పెంచుతావా; లతికాలలితదేహ
- లతికా = పూలతీగవలె; లలిత = సుకుమార; దేహ = దేహము కలదానా; సరసి నోలాడుదే
- సరసిన్ = కొలనులో; ఓలాడుదే = జలకాలాడుదే; సరసిజాక్షి
- సరసిజ = పద్మముల
వంటి;
అక్షి = కన్నులు
ఉన్నదానా;
మృగికి
- మృగి = లేడి; మేఁత లిడుదె
- కిన్ = కి; మేఁతల్ = గడ్డి / మేతలు; ఇడుదె = ఇచ్చెదవా; మృగశాబలోచన
- మృగ = లేడి; శాబ = పిల్లకి
వంటి;
లోచన = కన్నులు
ఉన్నదానా; గురుల నాదరింతె - గురులన్ = గురువులను / పెద్దలను; ఆదరింతె = ఆదరించెదవా; గురువివేక
- గురు = గొప్ప; వివేక = వివేకము
కలదానా;
బంధుజనులఁ బ్రోతె - బంధుజనులన్ = బంధువులను; ప్రోతె = రక్షింతువా; బంధుచింతామణి
- బంధు = బంధువులకు; చింత = తలచినవి; ఆమణి = ఇచ్చుదానా; యనుచు
- అనుచున్ = అంటూ; సతుల నడిగె నచ్యుతుండు
- సతులన్ = భార్యలను; అడిగెన్ = అడిగెను; అచ్యుతుండు = కృష్ణుడు {అచ్యుతుడు - నాశము లేని వాడు, విష్ణువు}.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
No comments:
Post a Comment