నిరయంబైన, నిబంధమైన . . . .
8-593-మ.
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణంబైనఁ, గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
హరుఁ డైనన్, హరి యైన, నీరజభవుం డభ్యాగతుం డైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?
వామనుడు
దానం పట్ట బోతున్నాడు. శుక్రాచార్యుల వారు వారించారు. బలి చక్రవర్తి తన నిర్ణయం
చెప్తున్నాడు. ఇక్కడ చూడండి మన సహజ కవి పోతనామాత్యుల వారి కవితా ఝరి వడి.
మిగతావి
అన్నీ అనవసరమయ్య! నే బంధింప బడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకం
దాపురించటం కాని, నా కులమే నాశనం కావటం కాని, భూమండలం బద్దలవటం కాని, నిజంగానే వస్తే రానియ్యి; జరుగుతే జరగనీ; ఏమైనా సరే నేను
మాత్రం అబద్దమాడ లేను. దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమ శివుడే
అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం
రాదు. పరమ విఙ్ఞాన స్వరూప శుక్రాచార్య! నా నిర్ణయం విన వయ్య!
నిరయం బైన - నిరయంబు = నరకము దాపురించినది; ఐనన్ = అయిన సరే; నిబంధ మైన
- నిబంధము = కట్టివేయబడుట; ఐనన్ = జరిగిన సరే; ధరణీ నిర్మూలనం
బైన - ధరణీ = రాజ్యము; నిర్మూలనంబు = నాశనము; ఐనన్ = అయినా సరే; దుర్మరణం
బైనఁ గులాంత మైన - దుర్మరణంబు = దుర్మరణము; ఐనన్ = సంబవించిన సరే; కుల = వంశము; అంతము = నాశనము; ఐనన్ = జరిగిన సరే; నిజమున్ = సత్యమునే; రానిమ్ము = ఒప్పుకొనెదను; కానిమ్ము
పో - కానిమ్ము = జరిగెడిది జరగ నిమ్ము; పో = భయం లేదు; హరుఁ డైనన్
- హరుడు = శివుడు; ఐనన్ = అయినా; హరి యైన
- హరి = విష్ణువు; ఐనన్ = అయినా; నీరజభవుం
డభ్యాగతుం డైన నౌఁ దిరుగన్ - నీరజభవుండు = బ్రహ్మదేవు
డయినా; అభ్యాగతుండు = అతిథిగా వచ్చినవాడు; ఐనన్ = అయిన; ఔ = సరే; తిరుగన్ = వెనుతిరుగుట; నేరదు = చేయ లేదు; నాదు = నా యొక్క; జిహ్వ = నాలుక; వినుమా = వినుము; ధీవర్య = విఙ్ఞాని; వేయేటికిన్ = పలు మాటలు దేనికి. తెలుగుభాగవతం.కం http://www.telugubhagavatam.com/
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
No comments:
Post a Comment