Friday, August 30, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_40

ను లాత్మీయ

10.1-1710-మ.
ను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజ తోయ మందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
నుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱుజన్మంబులున్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా! 
10.1-1710-ma.
ghanu laatmeeya tamOnivRttiko~rakai gaureeSumaryaada ne
vvani paadaaMbujatOyamaMdu munu@Mgan^ vaaMChiMtu raen aTTi nee
yanukaMpan^ vilasiMpanaeni vratacharyan^ noo~rujanmaMbulun^
ninu@M jiMtiMchuchu@M braaNamul^ viDichedan^ nikkaMbu praaNaeSvaraa!
          రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం – జీవితేశ్వరా! నాథా! మహాత్ములు అఙ్ఞాన రాహిత్యం కోరి పరమేశ్వరుని లాగ ఏ పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారో, అటువంటి తీర్థపాదుడ వైన నీ యనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను.
          భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా. – ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మఙ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అఙ్ఞానాంధకార నివారణ కోసం రజో సాత్వికాలు అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర ఙ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మరణించే దాకా తపిస్తూనే ఉంటాను.
        ఘను లాత్మీయ - ఘనులు = గొప్పవారు; ఆత్మీయ = తమ యొక్క; తమో నివృత్తి కొఱ కై - తమః = అఙ్ఞానమును; నివృత్తి = తొలగించుకొనెడి; వృత్తిన్ = ఉపాయము; కొఱకు = కోసము; = అయ్యి; గౌరీశు = శివుని {గౌరీశుడు - గౌరి యొక్క ప్రభువు, శివుడు}; మర్యాద  నెవ్వని - మర్యాదన్ = వలెనే; ఎవ్వని = ఎవరి యొక్క; పాదాంబుజ తోయ మందు - పాద = పాదము లనెడి; అంబుజ = పద్మముల; తోయము = తీర్థము; అందున్ = అందు; మునుఁగన్ - మునుగన్ = స్నానముచేయవలెనని; వాంఛింతు రే నట్టి - వాంఛింతురు = కోరుదురో; ఏనున్ = నేను కూడ; అట్టి = అటువంటి; నీ = నీ యొక్క; యనుకంపన్ - అనుకంపన్ = దయచేత; విలసింపనేని = మెలగలేకపోతే; వ్రతచర్యన్ - వ్రత = వ్రతదీక్ష; చర్యన్ = వంటి కార్యముగా; నూఱు = వంద (100); జన్మంబులున్ = రాబోవు జన్మములులో; నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ - నినున్ = నిన్ను; చింతించుచున్ = తలచుచు; ప్రాణముల్ విడిచెదన్ = చనిపోయెదను; నిక్కంబు = ఇది తథ్యము; ప్రాణేశ్వరా = నా పాణమునకు ప్రభువా.
                                                            http://telugubhagavatam.org/ 
                                                               సర్వేజనాః సుఖినోభవంతు.

No comments: