సకలార్థసంవేది
10.2-621-సీ.
సకలార్థసంవేది యొక యింటిలోపలఁ; జెలితోడ
ముచ్చటల్ సెప్పుచుండు
విపులయశోనిధి వేఱొక్క యింటిలో; సరసిజాననఁ
గూడి సరస మాడుఁ
బుండరీకదళాక్షుఁ డొండొక యింటిలోఁ; దరుణికి
హారవల్లరులు గ్రుచ్చుఁ
గరుణాపయోనిధి మఱియొక యింటిలోఁ; జెలిఁ
గూడి విడియము సేయుచుండు
ఆ. వికచకమలనయనుఁ
డొక
యింటిలో నవ్వు
బ్రవిమలాత్ముఁ డొకటఁ బాడుచుండు
యోగిజనవిధేయుఁ డొక యింట సుఖగోష్ఠి
సలుపు ననఘుఁ డొకటఁ జెలఁగుచుండు.
10.2-621-see.
sakalaarthasaMvaedi
yoka yiMTilOpala@M; jelitODa muchchaTal^ seppuchuMDu
vipulayaSOnidhi
vae~rokka yiMTilO; sarasijaanana@M gooDi sarasa maaDu@M
buMDareekadaLaakshu@M
DoMDoka yiMTilO@M; daruNiki haaravallarulu gruchchu@M
garuNaapayOnidhi
ma~riyoka yiMTilO@M; jeli@M gooDi viDiyamu saeyuchuMDu
aa.
vikachakamalanayanu@M Doka yiMTilO navvu
bravimalaatmu@M
DokaTa@M baaDuchuMDu
yOgijanavidhaeyu@M
Doka yiMTa sukhagOshThi
salupu
nanaghu@M DokaTa@M jela@MguchuMDu.
పదహారువేల ఎనమిది మంది భార్యలతో శ్రీ కృష్ణ భగవానుడు ఎలా
సంసారం చేస్తున్నాడో నారదుడు చూడ్డానికి వచ్చి చూస్తున్నాడు. అప్పుడు - సర్వవిషయములు
తెలిసిన వాడు, అత్యధిక మైన కీర్తి గలవాడు, కరుణా సముద్రుడు, వికసించిన తెల్లదామరల
వంటి కన్నులు గలవాడు, నిర్మల మైన మనసు గలవాడు, యోగీశ్వరులకు లోబడు వాడు, పాప రహితుడు
అయినట్టి శ్రీకృష్ణుడు ఆయా గృహములలో నున్న తన ప్రియురాళ్ళ ఇష్టాన్ని అనుసరించి
ఒకచోట ముచ్చట లాడుతు, ఒకచోట సరసాలాడుతు, ఒకచోట కొప్పులో పూలు తురుముతు, ఒకచోట
తాంబూలాలు చుడుతు, ఒకచోట నవ్వుతు, ఒకచోట పాడుతు, ఒకచోట సుఖ సల్లాపా లాడుతు, ఒకచోట ఆనందిస్తూ
ఉన్నాడు.
సకలార్థ సంవేది - సకల = సర్వ; అర్థ = విషయములు; సంవేది = సంపూర్ణముగా తెలిసినవాడు; యొక - ఒక = ఒకానొక; యింటి లోపలఁ జెలితోడ - ఇంటి = ఇంటి; లోపలన్ = లోపల; చెలి = ప్రియురాలి; తోడన్ = తోటి; ముచ్చటల్ = ఇష్టాగోష్ఠి వాక్యములు; సెప్పుచుండు - చెప్పుచున్ = చెప్తూ; ఉండు = ఉన్నట్టి; విపుల యశోనిధి - విపుల = విస్తారమైన; యశః = కీర్తికి; నిధి = ఉనికిప ట్టైనవాడు; వేఱొక యింటిలో - వేఱు = మరి; ఒక = ఒకానొక; ఇంటి = ఇంటి; లోన్ = లోపల; సరసిజాననఁ గూడి - సరసిజాననన్ = పద్మాక్షితో; కూడి = కూడుకొని; సరస మాడుఁ బుండరీకదళాక్షుఁ
డొండొక యింటి లోఁ దరుణికి - సరసము = సరసములు; ఆడున్ = ఆడుచున్న; పుండరీక = పద్మముల; దళ = రేకులవంటి; అక్షుడు = కన్నులు కలవాడు; ఒండు = మరి; ఒక = ఒక; ఇంటి = ఇంటి; లోన్ = లోపల; తరుణి = యువతి; కిన్ = కి; హార వల్లరులు - హార = పూల దండలకు; వల్లరులు = పూలగుత్తులను; గ్రుచ్చుఁ గరుణా పయోనిధి - గ్రుచ్చున్ = గుచ్చుచున్న; కరుణా = దయా; పయోనిధిన్ = సముద్రుడు; మఱియొక - మఱి = ఇంక; ఒక = ఒకానొక; యింటిలోఁజెలిఁగూడి - ఇంటి = ఇంటి; లోన్ = లోపల; చెలిన్ = ప్రియురాలిని; కూడి = చేరి; విడియము - విడియమున్ = తాంబూలములు; సేయుచుండు - చేయుచుండు = తయారు చేయుచుండును.
వికచ కమల నయనుఁ డొక యింటి లో - వికచ = విరసిన; కమల = కమలముల వంటి; నయనుడు = కన్నులు కలవాడు; ఒక = ఒకానొక; ఇంటి = ఇంటి; లోన్ = లోపల; నవ్వు బ్రవిమలాత్ముఁ
డొకటఁ బాడుచుండు - నవ్వున్ = నవ్వుచున్న; ప్రవిమల = మిక్కిలి నిర్మల మైన; ఆత్ముడు = మనస్సుక లవాడు; ఒకటన్ = ఒకచోట; పాడుచుండు = పాడుతుండును; యోగిజనవిధేయుఁ
డొక యింట - యోగి = యోగులైన; జన = వారికి; విధేయుడు = లోబడి యుండువాడు; ఒక = ఒకానొక; ఇంటన్ = ఇంటిలో; సుఖ గోష్ఠి
- సుఖగోష్ఠిన్ = సరస సల్లాపములు; సలుపు ననఘుఁ
డొకటఁ జెలఁగుచుండు - సలుపున్ = చేయు చుండును; అనఘుడు = పుణ్యుడు; ఒకటన్ = ఒకచోట; చెలగుచుండు = ఉత్సహించు చుండును.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
No comments:
Post a Comment