Wednesday, August 28, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_38

మాటిమాటికి వ్రేలు డిఁచి

10.1-496-సీ.
మాటిమాటికి వ్రేలు డిఁచి యూరించుచు; నూరుఁగాయలు దినుచుండు నొక్క;
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి; “చూడు లేదని నోరు చూపు నొక్కఁ;
డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిద మాడి; కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ;
డిన్ని యుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన; మనుచు బంతెనగుండు లాడు నొకఁడు;
ఆ. కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి వడి మ్రోల
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు;
నవ్వు నొకఁడు; సఖుల వ్వించు నొక్కఁడు;
ముచ్చటలాడు నొకఁడు; మురియు నొకఁడు.
10.1-496-see.
maaTimaaTiki vraelu maDi@Mchi yooriMchuchu
            nooru@Mgaayalu dinuchuMDu nokka;
Dokani kaMchamulOni doDisi chayyana mriMgi
            chooDu laedani nOru choopunokka@M;
Daegu raarguri chaldu lelami@M bannidamaaDi
            koorkonikoorkoni kuDuchu nokka@M;
DinniyuMDa@Mga@M baMchi yiDuTa nechchalitana
            manuchu baMtenaguMDu laaDu noka@MDu;
aa. kRshNu@M jooDu manuchu@M gikuriMchi vaDi mrOla
maeli bhakshyaraaSi mesa@Mgu noka@MDu;
navvu noka@MDu; sakhula navviMchu nokka@MDu;
muchchaTalaaDu noka@MDu; muriyu noka@MDu.
          ఎంత చక్కగా మురిపిస్తున్నాడో చూడండి మన పోతన కృష్ణుడు. – ఒక గొల్ల పిల్లాడు వ్రేళ్ళ మధ్యలో ఊరగాయ ముక్క ఇరికించుకొని మాటి మాటికి పక్కవాడిని ఊరిస్తూ తిన్నాడు. ఇంకొక గోప బాలుడు పక్కవాడి కంచంలోది చటుక్కున లాక్కొని మింగేసి, వాడు అడిగేసరికి ఏదీ ఏంలేదు చూడు అంటు తన నోరు చూపించాడు. మరొకడు పందాలు కాసి మరీ, ఐదారుమంది తినే చల్దులు నోట్లో కుక్కుకొని తినేసాడు. మరో పిల్లాడు ఒరే ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా, స్నేహ మంటే పంచుకోడంరా అంటు బంతెనగుండు లనే ఆట ఆడుతు తింటున్నాడు. ఇంకో కుర్రాడు ఒరే కృష్ణుణ్ణి చూడు అని  దృష్టి మళ్ళించి, మిత్రుడి ముందున్న మధుర పదార్థాలు తినేసాడు. మరింకో కుర్రాడు తాను నవ్వుతున్నాడు. ఇంకొకడు అందరిని నవ్విస్తున్నాడు. మరొకడు ముచ్చట్లాడు తున్నాడు. వేరొకడు ఉరికే మురిసిపోతన్నాడు.
        మాటిమాటికి - మాటిమాటికిన్ = పలుమార్లు, అస్తమాను; వ్రేలు - వ్రేలున్ = వేలిని; మడిఁచి - మడిచి = వంచి; యూరించుచు నూరుఁగాయలు దినుచుండు నొక్క డొకని - ఊరించుచున్ = ఆశ పెట్టుచు; ఊరగాయలున్ = ఆవకాయ లాంటివి; తినుచున్ = తింటూ; ఒక్కడు = ఒకా నొకడు; ఒక్కని = ఒకా నొకని యొక్క; కంచములోని దొడిసి - కంచము = కంచము; లోనిదిన్ = లో ఉన్న దానిని; ఒడిసి = ఒడుపుగా తీసుకొని; చయ్యన = చటుక్కున; మ్రింగి = తినేసి; చూడు = చూసుకొనుము; లే దని - లేదు = ఏమీలేదు; అని = అని; నోరు = నోటిని; చూపు నొక్కఁ డేగు రార్గురి - చూపున్ = చూపెట్టును; ఒక్కడు = ఒకతను; ఏగురి = ఐదుగురి వంతు (5); ఆర్గురి = ఆరుగురి వంతు (6); చల్దు లెలమిఁ బన్నిద మాడి - చల్దులు = చద్ది అన్నం; ఎలమి = రెచ్చిపోయి; పన్నిదము = పందెములు; ఆడి = వేసుకొని; కూర్కొని కూర్కొని = బాగా కూరేసు కుంటు; కుడుచు నొక్కఁ డిన్నియుఁ - కుడుచున్ = తినును; ఒక్కడు = ఒకతను; ఇన్ని = ఇంత ఎక్కువగ; యుండగఁ బంచి - ఉండగన్ = ఉన్నప్పుడు; పంచి = పంచిపెట్టి; యిడుట - ఇడుట = ఇచ్చుట; నెచ్చలి తన మనుచు – నెచ్చలి తనము = స్నేహ భావము; అనుచున్ = అనుచు; బంతెన గుండు లాడు నొకఁడు బంతెన గుండులు = వరుసగ అందరికి ముద్దలు పెట్టుట {బంతెన గుండ్లు - బంతి (వరుస)గా కూర్చొన్న వారికి తలా ఒక గుండు ఇచ్చెడి ఆట}; ఆడున్ = చేయును; ఒకడున్ = ఒకతను
            కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి - కృష్ణున్ = కృష్ణుడుని; చూడుము = చూడు; అనుచున్ = అనుచు; కికురించి = మాయజేసి; వడి - వడిన్ = వేగముగా; మ్రోల - మ్రోలన్ = ఎదురుగా నున్న; మేలి = మంచి; భక్ష్య రాశి - భక్ష్య = తిను బండారముల; రాశిన్ = గుంపును; మెసఁగు నొకఁడు - మెసగు = వేగముగా తినును; ఒకడు = ఒకతను; నవ్వు నొకఁడు - నవ్వున్ = నవ్వును; ఒకడు = ఒకతను; సఖుల నవ్వించు నొక్కఁడు - సఖులన్ = స్నేహితులను; నవ్వించున్ = నవ్వించును; ఒక్కడు = ఒకతను; ముచ్చట లాడు నొకఁడు ముచ్చట లాడున్ = కబుర్లు చెప్పును; ఒకడు = ఒకతను; మురియు నొకఁడు - మురియున్ = మురిసిపోవును; ఒకడు = ఒకతను.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||

No comments: